Village devolopment : అభివృద్ధే అజెండాగా..
ABN, Publish Date - May 23 , 2025 | 12:47 AM
Public interaction ఎండలమల్లన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చర్యలు చేపట్టారు. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి సిక్కోలు నుంచే శ్రీకారం చుట్టారు.
టెక్కలిలో ‘మన ఊరు.. మాటామంతీ’
రావివలస గ్రామస్థులతో డిప్యూటీ సీఎం ముఖాముఖి
సమస్యలను తెలుసుకుంటూ.. పరిష్కారం చూపేలా చర్యలు
రూ.15కోట్ల నిధులు మంజూరుకు ఆదేశాలు
టెక్కలి, మే 22(ఆంధ్రజ్యోతి): ఎండలమల్లన్న కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం.. రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేసేలా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చర్యలు చేపట్టారు. ప్రజలతో మమేకమై.. వారి సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘మన ఊరి కోసం మాటామంతీ’ అనే స్ర్కీన్ గ్రీవెన్స్ కార్యక్రమానికి సిక్కోలు నుంచే శ్రీకారం చుట్టారు. గురువారం టెక్కలి మండలం రావివలస గ్రామస్థులతో ముఖాముఖి నిర్వహించారు. టెక్కలిలోని భవానీ థియేటర్ వేదికగా రావివలస గ్రామస్థులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి.. తక్షణమే పరిష్కరించేలా ఆదేశాలు జారీచేశారు. అలాగే ప్రజల అభ్యర్థన మేరకు రావివలసలో వివిధ అభివృద్ధి పనులకుగానూ సుమారు రూ.15కోట్లు మంజూరు చేయించారు. దీంతో రావివలస గ్రామస్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. ‘గ్రామాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. రావివలసలో ఎండలమల్లికార్జున స్వామి ఆలయానికి టూరిజం, దేవదాయశాఖ ద్వారా అవసరమైన నిధులు మంజూరు చేద్దాం. గ్రామంలో గ్రంథాలయం, రోడ్లు, కాలువలు, క్రీడామైదానాలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేద్దాం. ఉన్నతస్థాయిలో ఉన్న స్థానికులు ఊరిని మర్చిపోకూడదు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలి. ఆడపిల్లలకు రక్షణ కవచంలా నిలవాలి. మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి’ అని తెలిపారు. పాఠశాల ప్రాంగణాల్లో ఆకతాయిలతో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి కణితి కిరణ్‌కుమార్, పార్టీ శ్రేణులకు సూచించారు. ఎండల మల్లికార్జునస్వామిని తాను త్వరలో దర్శించుకుంటానని తెలిపారు.
వైసీపీ పాలనలో కుంటుపడిన అభివృద్ధి
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘వైసీపీ పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడింది. స్థానిక సంస్థల నిధులు ఇతర రంగాలకు మళ్లించారు. రాజ్యాంగ అధికారాన్ని తుంగలోకి తొక్కారు. స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు, అధికారాల కోసం ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ కృషి అభినందనీయం. గిరిజన గూడేల నుంచి రహదారులు లేక డోలీతో ఆసుపత్రులకు వెళ్లే దుస్థితి. ఇది గుర్తించి అవసరమైన తారురోడ్లు వేశారు. ఇప్పటికే పల్లెపండుగ ద్వారా గ్రామాల అభివృద్ధి ప్రారంభించాం. రావివలసను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉంది. రూ.1,200కోట్లతో జలజీవన్ మిషన్ ద్వారా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. ప్రకృతి వ్యవసాయాన్ని రెట్టింపు చేస్తామ’ని తెలిపారు.
మాజీ జడ్పీటీసీ ఎల్.ఎల్.నాయుడు మాట్లాడుతూ.. ‘రావివలసలో ఎండలమల్లికార్జునస్వామి ఆలయానికి వెళ్లే మార్గాన్ని విస్తరించాలి. గ్రామంలో ఇంటర్నల్ డ్రైనేజ్ సదుపాయం కల్పించాలి. అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించాలి. శ్మశానవాటికకు రోడ్డు, సీత పుష్కరిణికి మెట్లు సదుపాయం కల్పించాలి’ అని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందిస్తూ.. ‘సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణానికి రూ.5కోట్లు మంజూరు చేద్దాం. డ్రైనేజ్ నిర్మాణాల్లో చాలాచోట్ల లోపాలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారానికి టౌన్ అండ్ కంట్రీప్లాన్ అధికారులు చర్యలు తీసుకోవాలి. కొన్నిచోట్ల డ్రైనేజ్ లోపల నుంచే పైపులైన్ వేస్తారు. అది సరికాదు. పీఎం జలజీవన్ మిషన్ ద్వారా ఆయా ప్రాంతాలకు కొంతమేరకు సదుపాయాలు కల్పిస్తాం. శ్మశానవాటికకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాల’ని కలెక్టర్‌కు ఆదేశించారు. ఈ మేరకు ఎండలమల్లన్న ఆలయానికి వెళ్లే రహదారి విస్తరణకు రూ.3కోట్ల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరు చేస్తున్నామ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు.
రావివలసకు చెందిన నర్తు కృష్ణవేణి మాట్లాడుతూ.. ‘మా గ్రామంలో 83 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. సమావేశాలు పెట్టుకునేందుకు సౌకర్యం లేదు. భవనం మంజూరు చేయాల’ని కోరారు. ఈ మేరకు రూ.10లక్షలు మంజూరు చేయనున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
దాసరి ఉషారాణి మాట్లాడుతూ.. పిల్లల చదువు కోసం బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పించి మాలాంటి ఎన్నో కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఓ అధికారిని మీ ఇంటికి పంపిస్తానని, వ్యక్తిగతంగా మీ అభిప్రాయాన్ని తెలుసుకుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు.
జనసేన నాయకుడు అనపాన జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రావివలసలో ఉన్న 50 రజక కుటుంబాల జీవనోపాధి కోసం ఒక్క చెరువు దోబీఘాట్ కేటాయించాలి. శ్మశానవాటికతోపాటు 23 చెరువుల ఆక్రమణలు గుర్తించాలి. పరిసరాల్లో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి వచ్చే రూ.5కోట్ల డీఎంఎఫ్ నిధులతో మా గ్రామాలు అభివృద్ధి చేయాల’ని కోరారు. దోబీఘాట్ కోసం రూ.20లక్షలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. శ్మశానవాటిక, చెరువుల ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులకు డీఎంఎఫ్ నిధులు కేటాయిస్తామని కలెక్టర్ వెల్లడించారు.
మాజీ సర్పంచ్ బడే జగదీష్ మాట్లాడుతూ.. ‘రావివలసలో పెద్దచెరువు మరమ్మతులు చేయాలి. పంట కాలువల ఆక్రమణలు తొలగించాలి. సచివాలయాల పరిధిలో అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలి. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన జడ్పీ హైస్కూల్‌కు ప్రహరీ నిర్మించాల’ని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. ‘అధికారులు అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తా. ప్రహరీ నిర్మాణానికి రూ.30లక్షలు మంజూరు చేస్తున్నాను. ఆ ప్రాంగణంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మీతో పాటు కార్యదర్శి రవికుమార్ కూడా పర్యవేక్షించాలి. పంట కాలువల ఆక్రమణలు తొలగించాల’ని కలెక్టర్‌కు ఆదేశించారు. పెద్దచెరువుకు నరేగా కింద పూడికలు తొలగించి.. అవసరమైన మరమ్మతులు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ఇప్పిలి జగదీష్ మాట్లాడుతూ.. ‘నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా యువతకు అవకాశం కల్పించాలి. 2014-19 మధ్య పెండింగ్‌లో ఉన్న ఇళ్ల కాలనీ బిల్లులు మంజూరు చేయాలి. ఉపాధిహామీ పథకం రైతులకు అనుసంధానం చేయాలి. గొర్రెలు, మేకలకు సంబంధించి బీమా పరిహారం దక్కేలా చూడాల’ని కోరారు. ఈ రెండు అంశాలను మంత్రి అచ్చెన్న చూసుకుంటారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉపాధి హామీ పథకం అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తానన్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులను ఆదుకుంటామని తెలిపారు. కాగా.. 2014-19 మధ్యకాలంలో ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీ నుంచి ఈ గ్రామానికి 46యూనిట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు మంజూరైతే లబ్ధిదారులకు అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
మాజీ ఎంపీటీసీ నర్తు కృష్ణ మాట్లాడుతూ.. ‘ ఎండలమల్లికార్జున స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా గుర్తించాలి. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాల’ని కోరారు. లైబ్రరీ మంజూరు చేస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. టూరిజం, దేవదాయశాఖతో మాట్లాడి తగిన ఏర్పాట్లు చేస్తానన్నారు.
బి.రోహిణి మాట్లాడుతూ.. చిన్న పరిశ్రమలకు ప్రోత్సహించాలని, బ్యాంకు రుణాలు అందజేయాలని కోరారు. బ్యాంకుల నుంచి రుణాలు అందజేయాలని ఎల్‌డీఎంకు డీప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే మూలపేట పోర్టు నిర్మాణానికి అవసరమైతే ఇక్కడ తయారైన సామగ్రిని వినియోగానికి పంపుతామని కలెక్టర్ తెలిపారు.
గొర్లె జగదీశ్వరి మాట్లాడుతూ.. మంచినీరు అందించే అదనపు ట్యాంకు కావాలని కోరారు. దీంతో ట్యాంకు నిర్వహణకు ఎంతకాలం పడుతుందని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణరావు మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి ఉంది. అడిషినల్ ట్యాంక్ నిర్మాణానికి నాలుగైదు నెలల సమయం పడుతుంది. దీనికి రూ.62లక్షల నిధులు సమకూర్చాల’ని తెలిపారు. ఇది మీరు చేయకపోతే జర్నలిస్ట్‌ల నుంచి నేను మాటపడాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ పేర్కొన్నారు.
విజయవంతంగా
అన్నిశాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో ‘మన ఊరు.. మాటామంతీ’ కార్యక్రమం విజయవంతమైంది. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గ్రామస్థులతో మమేకమై.. పలు అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేశారు.
- ఎం.కృష్ణమూర్తి, ఆర్డీవో, టెక్కలి
Updated Date - May 23 , 2025 | 12:47 AM