Parents demond: పాఠశాల చెంతనే మద్యం దుకాణమా?
ABN, Publish Date - Jun 12 , 2025 | 11:59 PM
Liquor Shop School Vicinity ఇచ్ఛాపురం మండలం ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపాన కంటైనర్‌లో మద్యం దుకాణం ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొలగించాలంటూ ఈదుపురం గ్రామస్థుల ఆందోళన
లేదంటే పాఠశాలకు పంపించబోమని స్పష్టం
ఇచ్ఛాపురం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం మండలం ఈదుపురం జడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపాన కంటైనర్‌లో మద్యం దుకాణం ఏర్పాటుపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల కిందట కేసుపురంలో కంటైనర్‌లో మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. గ్రామస్థులు ఆందోళన చేపట్టి అడ్డుకోవడంతో దానిని తొలగించారు. తాజాగా ఈదుపురం పాఠశాల సమీపంలోని ఖాళీ స్థలంలో ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేశారు. పాఠశాల ప్రహరీకి సుమారు 150 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని, లేదంటే తమ పిల్లలను పాఠశాలకు పంపించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం మద్యం దుకాణం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. మద్యం దుకాణం షట్టర్లు దించేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి చక్కదిద్దారు. మద్యం దుకాణాన్ని తొలగించేలా చర్యలు చేపడతామని భరోసా ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్ నరసింహమూర్తి, సర్పంచ్ నర్తు ప్రసాద్, ఎంపీటీసీ వివేకానంద, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 11:59 PM