ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మంచికి వాడుకుందాం

ABN, Publish Date - Jun 30 , 2025 | 12:39 AM

మానవుడి జీవితంలో సోషల్‌ మీడియా పెను ప్రభావం చూపుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రికి పడుకునే వరకూ సోషల్‌ మీడియాను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. సాధారణంగా ఉదయం లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలకు దండం పెడుతుంటారు.

- సోషల్‌ మీడియాతో ఉపయోగాలెన్నో

- సక్రమంగా వాడుకుంటే మేలు

-లేదంటే దుష్పరిణామాలు తప్పవు

- నేడు ప్రపంచ సోషల్‌మీడియా దినోత్సవం

- రణస్థలంలో ఓ యువకుడు కార్లను అద్దెకు తిప్పుతుంటాడు. ఈ క్రమంలో తరచూ విశాఖ, రాజమండ్రి వెళుతుంటాడు. అక్కడ డ్రాపింగ్‌ ఉంటే తిరుగు ప్రయాణంలో కారులో ఖాళీగా వస్తున్న క్రమంలో ఎవరైనా సంప్రదించవచ్చు అని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. దీంతో చాలామంది ఆయనను ఆశ్రయించి ప్రయాసలకు గురికాకుండా వస్తుంటారు. అటు ఆ యువకుడికి సైతం ఉపాధి లభిస్తోంది.

రణస్థలం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మానవుడి జీవితంలో సోషల్‌ మీడియా పెను ప్రభావం చూపుతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రికి పడుకునే వరకూ సోషల్‌ మీడియాను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. సాధారణంగా ఉదయం లేచిన వెంటనే దేవుడి చిత్రపటాలకు దండం పెడుతుంటారు. కానీ, ఇప్పుడు చాలామంది లేవగానే సెల్‌ఫోన్‌ కోసం తడుముతుంటారు. లేచిన వెంటనే సోషల్‌ మీడియాను వీక్షిస్తుంటారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం వంటిని చూసుకుంటారు. సమాచార వ్యాప్తిలో సోషల్‌ మీడియాది కీలక పాత్ర. ఒక వ్యక్తి జీవితంలో కలిగే బాధ, ఆనందం, విజయం, అపజయం..ఇలా అన్నిరకాల భావోద్వేగాలను అందరితో పంచుకోవడానికి ఇదో సాధనం. అయితే, సోషల్‌ మీడియా వినియోగంలో చాలా జాగ్రత్తలు అవసరమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల లాభాలతో పాటు నష్టాలు ఉంటాయంటున్నారు. సోషల్‌ మీడియా ద్వారా ఎంతోమంది పేరుప్రఖ్యాతలు సంపాదించారు. అదే సోషల్‌ మీడియా కొందరి జీవితాలను తలకిందులు చేసింది. అందుకే సోషల్‌ మీడియాలో మీరు ఏంచేస్తారు? ఎలాంటి సమాచారం కోసం వెతుకుతారు? అనేది విశ్లేషించుకోవాలి. మనకు ఉపయోగం అనుకున్న వాటినే ఎంచుకోవాలి. సోమవారం ప్రపంచ సోషల్‌ మీడియా దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

జాగ్రత్తలు పాటించకపోతే నష్టం తప్పదు..

సోషల్‌ మీడియాను జాగ్రత్తగా వాడుకోకపోతే నష్టం తప్పదు. చాలామంది వ్యక్తిగత జీవితాలపై అనేక పోస్టులు పెడుతుంటారు. సమాచారాన్ని షేర్‌ చేస్తుంటారు. అయితే ఇటీవల సోషల్‌ మీడియాలో రాజకీయ, విధానాపరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాలు, న్యాయపరమైన విధానాలపై వచ్చే పోస్టులను ఇతరులకు పంపడం ద్వారా చిక్కుల్లో పడుతుంటాం. అనవసరంగా పోలీసు కేసుల బారిన పడుతుంటాం. అటువంటి సమయంలో సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు సాక్ష్యాలుగా చూపుతున్నారు పోలీసులు. లేనిపోని లింకులు క్లిక్‌ చేయడం, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్‌ రిక్వెస్టులకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సవాళ్లు అసభ్యపదజాలాలు. కామెంట్ల రూపంలో కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటారు. కొన్నిసార్లు మనం పెట్టే పోస్టులు, షేర్లు, కామెంట్లతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓక వేళ నచ్చని పోస్టు, సమాచారం ఉంటే వాటిని చూడకపోవడం, అనుసరించకపోవడమే ఉత్తమం. ‘ముఖ్యంగా పిల్లలు సోషల్‌ మీడియాకు ఎడిక్ట్‌ కాకుండా చూసుకోవాలి. సోషల్‌ మీడియాను అడ్డం పెట్టుకొని అనేక రకాలుగా సమాజంలో విచ్ఛిన్నకర శక్తులు ప్రవేశిస్తున్నాయి. ఇది గుర్తెరిగి ప్రతిఒక్కరూ బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది.’ అని శ్రీకాకుళానికి చెందిన వైద్య నిపుణుడు కళ్యాణబాబు చెబుతున్నారు.

యూట్యూబ్‌ స్టార్‌గా మత్స్యకార మహిళ

షూటింగ్‌లో మనవళ్లతో అప్పలమ్మ(ఫైల్‌)

కవిటి/ఇచ్ఛాపురం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘చిరంజీవి, ప్రభాష్‌, మహేష్‌బాబు డైలాగులను ఆమె అలవోకగా చెప్పేస్తుంది. అచ్చం సినిమాల మాదిరిగా గన్‌లు పెట్టి ఫైట్లు చేస్తుంది. విలన్లను చితక్కొడుతుంది’..ఇవన్నీ చేస్తోంది లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి అనుకుంటే మీరు పొరబడినట్టే. ఆమె అప్పుబాలు యూట్యూబ్‌ నటి అప్పలమ్మ. సోషల్‌ మీడియాలో ఉర్రూతలూగిస్తున్న ఈ బామ్మ వయసు అక్షరాలా 70 సంవత్సరాలు. ఏడు పదుల వయసులో కూడా చలాకీగా యూట్యూబ్‌లో నటించి వేలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. కవిటి మండలం బెజ్జిపుట్టుగ పంచాయతీ పెద్దకర్రివానిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకార మహిళ కర్రి అప్పలమ్మ యూట్యూబ్‌లో విశేష ఆదరణ పొందారు. భర్త తెచ్చే చేపలను విక్రయించే అప్పలమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లు పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితం అయ్యారు. అయితే మూడేళ్ల కిందట మనవడు శివ అప్పలమ్మతో తీసిన చిన్నపాటి వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెట్టాడు. వాటికి మంచి ఆదరణ లభించింది. దీంతో పెద్ద వీడియోలు, సినిమాల్లో ఫైట్లు, కామెడీ సీన్లను బామ్మ అప్పలమ్మతో తీయడం ప్రారంభించాడు. సొంతంగా అప్పుబాలు యూట్యూబ్‌ చానల్‌ ఏర్పాటుచేసి అందులో పెడుతున్నాడు. శివ దర్శకత్వంలో అప్పలమ్మ, పక్కింటి కుర్రాడు బాలుతో పాటు గ్రామంలోని పిల్లలు ఇందులో నటిస్తుంటారు. దీంతో చాలామంది అభిమానులను సొంతం చేసుకుంది అప్పలమ్మ. ఈ వయసులో కూడా ఆసక్తిగా నటిస్తున్న ఆమెను ఎక్కువమంది అభినందిస్తుంటారు. ఈ వయసులో ఇవన్నీ అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తుంటారని.. కానీ నటించడమంటే తనకు చాలా ఇష్టమని చెబుతోంది అప్పలమ్మ. రోజురోజుకూ అప్పుబాలు యూట్యూబ్‌ చానళ్లకు ప్రేక్షకులు, వీక్షకులు పెరిగారు. ఇటీవల లక్ష సబ్‌స్ర్కైబర్లను సాధించింది ఈ చానల్‌. అప్పలమ్మ వల్లే ఆ గ్రామానికి ఎనలేని పేరు వస్తోంది. దీంతో పెద్ద కర్రివానిపాలెం గ్రామస్థులు కూడా అప్పలమ్మను చాలా గౌరవంగా చూసుకుంటున్నారు. అప్పలమ్మకు కవిటి మండలంతోపాటు ఇచ్ఛాపురంలో కూడా వందలాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆవిడను చూసి చాలా మంది యూట్యూబర్స్‌గా తయారు కావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బీటెక్‌ చదివి.. ఇన్‌ఫ్లుయెనర్‌గా ఎదిగి

శ్రీకాకుళం అర్బన్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రణస్థలానికి చెందిన మహంతి రమణ ఒకపక్క యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెనర్‌గా రాణిస్తూ మరోపక్క సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. బీటెక్‌ చదివిన రమణ 2020లో సోషల్‌ ‘అరే మావ’ పేరిట యూట్యూబ్‌ చానెల్‌ను ప్రారంభించాడు. సమాజానికి ఉపయోగపడే వీడియోలు తీసి తన యూట్యూబ్‌ చానెల్‌లో పెడుతున్నాడు. రాజకీయ, సామాజిక కార్యక్రమాలు, డ్రగ్స్‌తో కలిగే అనర్థాలు, శక్తియాప్‌, మహిళలకు రక్షణగా ఆటోలకు క్యూఆర్‌ కోడ్‌ వంటి కార్యక్రమాలపై వీడియోలను తీసి పోలీస్‌శాఖతో పాటు పలువురి మన్ననలు పొందాడు. ప్రస్తుతం రమణకు 30 లక్షలకు పైచిలుకు సబ్‌ స్ర్కైబర్లు ఉన్నారు. ‘యూట్యూబ్‌ చానెల్‌ను పెట్టిన కొత్తలో నేను చాలా మాటలు పడ్డాను. బీటెక్‌ చదివావు. నీకెందుకురా ఇటువంటివి, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చుగా అని చాలామంది అనేవారు. వాటిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ పది మందితో యూట్యూబ్‌ చానెళ్లను నిర్వహించి మంచి పేరు సంపాదించా. రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేశా. అమరావతి వరద బాధితులకు నా యూట్యూబ్‌ చానెల్‌ సబ్‌ స్ర్కైబర్ల సాయంతో సేవలు అందించా. గత ఏడాది ఆగస్టు 25న నా చానెల్‌ 25 లక్షల మంది సబ్‌ స్ర్కైబర్లకు చేరుకుంది. దీంతో రణస్థలంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించి 220 యూనిట్లను రక్తం సేకరించాం. ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అతిథిగా వచ్చి నన్ను ప్రశంసించడం ఎంతో ఆనందంగా అనిపించింది.’ అని రమణ తెలిపారు. ప్రేక్షకులకు సందేశాత్మకమైన విషయాల్లో పరిజ్ఞానం పెంపొందించడమే తన ఆశయమని ఆయన తెలిపారు.

సామాజిక సేవలో సతీష్‌

పాతపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): పాతపట్నానికి చెందిన సైలాడ సతీష్‌ సోషల్‌ మీడియా వేదికగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజామన్ననలు పొందుతున్నారు. దీనికోసం వాట్సాప్‌ గ్రూపును ఏర్పాటు చేశారు. డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని వారికి, వ్యాధుల బారిన పడి లేదా ప్రమాదాలకు గురైన వారికి తన గ్రూప్‌ సభ్యులతో కలిసి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం కావాలంటే ఈ ప్రాంతంలో ముందుగా సతీష్‌ను సంప్రదించడం పరిపాటి అయిపోయింది. మొబైల్‌ బ్లడ్‌బ్యాంక్‌ (పాతపట్నం బ్లడ్‌ డోనర్స్‌ వాట్సాప్‌ గ్రూప్‌) ద్వారా రక్తం అందించేందుకు డోనర్లను సిద్ధపరుస్తారు. రెండేళ్లుగా ఉచిత అంబులెన్స్‌ సేవలు కూడా అందిస్తున్నారు. ఎవరికైనా అంబులెన్స్‌ అవసరమైతే డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకొని డీజిల్‌ కొట్టుకొని వాహనాన్ని తీసుకుపోవచ్చు. ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరంలేదు. ఇలా సోషల్‌ మీడియా వేదికగా పలువురి సహాక సహకారాలు అందిస్తూ సతీష్‌ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 12:39 AM