ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Drugs:గంజాయిరహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

ABN, Publish Date - Jun 27 , 2025 | 12:00 AM

Anti-drug campaign మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి, సిక్కోలును గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

శ్రీకాకుళంలో భారీ ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌ తదితరులు
  • డ్రగ్స్‌ నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలి

  • వ్యవసాయశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌/క్రైం, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించి, సిక్కోలును గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘నాషా ముక్త భారత్‌ అభియాన్‌’ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక అరసవల్లి మిల్లు జంక్షన్‌ వద్ద ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం 80 అడుగుల రోడ్డులోని ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్న మాట్లాడారు. ‘ వైసీపీ పాలనలో రాష్ట్రంలో గంజాయిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టారు. నేడు అది ఎక్కడ చూసినా భూతమై కనిపిస్తోంది. గంజాయి నిర్మూలనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మంత్రి లోకేశ్‌ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదంతో ప్రత్యేక ప్రచారాలు నిర్వహించాం. 4వేల మంది పోలీసులతో ఈగల్‌ టీమ్‌లను ఏర్పాటుచేసి, డ్రగ్స్‌ వినియోగం, రావాణాపై ఉక్కుపాదం మోపాం. టెక్నాలజీని కూడా వినియోగించి ఏజెన్సీలో గంజాయి పంటను పూర్తిగా నిర్మూలించాం. యువత డ్రగ్స్‌ బారిన పడి విలువైన జీవితాలను కోల్పోతున్నారు. గంజాయి మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్‌ వినియోగాన్ని తొలిదశలోనే నిర్మూలిద్దాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రగ్స్‌ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి’ అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అందరితో మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞను చేయించారు.

  • యువతా ఆలోచించండి

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘సరదా కోసమో, కష్టం ఎదురైనా, స్నేహితుల ప్రోద్బలంతో కొంతమంది యువత డ్రగ్స్‌ బారిన పడి భవిష్యత్‌ను పాడుచేసుకుంటున్నారు. యువతా ఆలోచించండి. డ్రగ్స్‌ బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఎవరైనా మీ స్నేహితులు ఇందులో కూరుకుపోతే వెంటనే పోలీసులకు తెలియజేయండి. బాధ్యత గల పౌరులుగా జీవితంలో గొప్పగా ఎదగండి’ అని పేర్కొన్నారు.

  • జీవితాలను బాగుచేయడమే లక్ష్యంగా

  • ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ‘యువత జీవితాలను బాగుచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈగల్‌ టీమ్‌ ద్వారా మాదకద్రవ్యాల వినియోగం, రవాణాపై ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ఏడాదిలో 160 కేసులు నమోదు చేశాం. 1930 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. 270 మందిపై కేసులు నమోదు చేశాం. హాట్‌స్పాట్స్‌ను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. డ్రోన్లను వినియోగించి స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సహాయంతో ఈగల్‌ టీమ్స్‌ ద్వారా నిందితులను పట్టుకున్నాం. 52 మందిని డీ-అడిక్షన్‌ కేంద్రాలకు పంపించి బాగుచేయగలిగాం. డ్రగ్స్‌ వినియోగంలో పట్టుబడితే కఠినచర్యలు తప్పవు’ అని హెచ్చరించారు.

  • మత్తు... జీవితకాలం చిత్తు

  • ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. ‘ఒక్క క్షణం మత్తుకు అలవాటైతే అది మీ జీవితకాలాన్ని చిత్తు చేస్తుంది. యువత జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యంగా ముందుకెళ్లాలి. మత్తుకు బానిసలై కుటుంబానికి, సమాజానికీ భారం కావద్ద’ని హితవు పలికారు. అలాగే డ్రగ్స్‌ నివారణపై యువతను చైతన్య పరిచేలా తప్పెటగుళ్ల కళాకరుల ప్రదర్శన ఆటకట్టుకుంది. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు, మాజీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పైడిశెట్టి జయంతి, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డీసీ శ్రీకాంత్‌రెడ్డి, టౌన్‌ డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, ఆర్డీవో సాయిప్రత్యూష, ఐసీడీఎస్‌ పీడీ బి.శాంతిశ్రీ, ఎక్సైజ్‌శాఖ సూపరింటెండెంట్‌ తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, శీర రమణయ్య, చౌదరి అవినాష్‌, అరవల రవీంద్ర, మాదారపు వెంకటేష్‌, ఎస్వీ రమణమాదిగ, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 12:00 AM