Laughing: నవ్వండి.. నవ్వించండి
ABN, Publish Date - May 03 , 2025 | 11:45 PM
Stand-up Comedy ప్రస్తుత యాంత్రిక జీవితంలో జనానికి మనసారా నవ్వుకునే తీరిక లేకుండా పోయింది. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, రక్తపోటు, ఇతరత్రా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనస్ఫూర్తిగా నవ్వేవారి శరీరంలో సమతుల్యమైన మార్పులు చోటు చేసుకొని, రక్త ప్రసరణ జరిగి మంచి ఆరోగ్యానికి దోహద పడుతుంది.
హాస్యంతో ఆరోగ్యంగా ఉంటారు
సమస్యల్ని దూరం చేస్తుంది
రోజుకు కనీసం అరగంటైనా నవ్వాలి
నేడు ప్రపంచ నవ్వుల దినోత్సవం
శ్రీకాకుళం కల్చరల్, మే 3 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత యాంత్రిక జీవితంలో జనానికి మనసారా నవ్వుకునే తీరిక లేకుండా పోయింది. ఫలితంగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, రక్తపోటు, ఇతరత్రా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనస్ఫూర్తిగా నవ్వేవారి శరీరంలో సమతుల్యమైన మార్పులు చోటు చేసుకొని, రక్త ప్రసరణ జరిగి మంచి ఆరోగ్యానికి దోహద పడుతుంది. రోజుకు కనీసం 30 నిమిషాలైనా మనసారా నవ్వకపోతే అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే నవ్వులో పాజిటివ్ భావాలతో పాటు హీలింగ్ ప్రక్రియ కూడా ఉంది. అందుకే నగరాల్లో ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. హాస్యం మన సమస్యల్ని దూరం చేస్తుంది. హాయిగా నిద్ర పట్టేందుకు ఉపకరిస్తుంది. నవ్వడం అనేది ఓ ఆరోగ్య సూత్రం. అందుకే మీరు కడుపుబ్బ నవ్వండి.. అందర్నీ నవ్వించండి. ఆదివారం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని హాస్య నటులు, మిమిక్రీ ఆర్టిస్టుల గురించి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
15 దేశాల్లో ప్రదర్శనలు
శ్రీకాకుళం నగరానికి చెందిన మిమిక్రీ శ్రీనివాస్ గురించి తెలియని వారుండరు. తన వద్ద ఉన్న వెంట్రిలాక్విజమ్ అనే బొమ్మ ద్వారా సుమారు 15 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. వెంట్రిలాక్విజమ్ బొమ్మతో నాభి నుంచి శబ్దాన్ని ఉత్పన్నం చేసే ప్రక్రియ ద్వారా అనేక మందికి నవ్వించి ఆరోగ్యవంతుల్ని చేస్తున్నారు. ప్రశాంతత వాతావరణానికి నవ్వు అనేది ఒక ఆరోగ్య సూచిక అని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే మిమిక్రీ గొప్పతనమని అంటున్నారు. ప్రతిరోజూ నగరాల్లో లాఫింగ్ థెరఫీ ద్వారా మానసిక రోగులకు వైద్యం కొనసా గిస్తున్నారని తెలుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పదవీ విరమణ పొందినవారికి, మానసిక రోగులు, చిన్నారులకు ప్రత్యేకంగా లాఫింగ్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. నవ్వడంతో మనలో శక్తి పుంజుకుంటుందని, ఇది ప్రతీ అవయవానికి ఒకవిధమైన వ్యాయామం అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ నవ్వాలి
ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకు ప్రతిఒక్కరూ నవ్వాలి. ప్రపంచ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల మాధవ్ ద్వారా నేను మిమిక్రీ విద్యను నేర్చుకున్నా. ఉపాధ్యాయుడిగా పదవీవిరమణ పొందిన తరువాత లాఫింగ్ క్లబ్ అని ఏర్పాటు చేశా. వేసవి సెలవుల్లో నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి పిల్లలకు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాం.
-ఎల్.నందికేశ్వరరావు, మిమిక్రీ ఆర్టిస్ట్, శ్రీకాకుళం
...................
వెండి తెరపై సిక్కోలు నవ్వులు.. కామెడీ కింగ్ కొండవలస
ఎచ్చెర్ల, మే 3 (ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల, మే 3(ఆంధ్రజ్యోతి): వెండి తెరపై ఆయన కని పిస్తే చాలు నవ్వులే నవ్వులు. తనదైన శైలిలో డైలాగ్‌లు చెబితే ఎలాంటి వారైనా నవ్వలేకుండా ఉండలేరు. ఆయనే కామెడీ కింగ్ కొండవలస లక్ష్మణరావు. సిక్కోలు నుంచి సినీ పరిశ్రమకు వెళ్లి.. ఒక దశలో వెలుగొందారు. ఆయన స్వస్థలం సరుబుజ్జిలి మండలం కొండవలస. 1946 ఆగస్టు 10న జన్మించారు. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాతో తెరం గ్రేటం చేశారు. అందులో పొట్టి రాజు క్యారెక్టర్‌తో అందర్నీ మెప్పించారు. ‘నేను ఒప్పుకోను.. అయితే ఓకే’ అంటూ మొదటి సినిమాతోనే అందరితో శభాష్ అనిపించుకున్నారు. 200కు పైగా సినిమాల్లో నటించి హాస్యాన్ని పండించారు. ఎంకాం చదివిన ఆయన నటనలో, డైరెక్షన్‌లో డిప్లమో కూడా పూర్తిచేశారు. విశాఖపట్నంలోని పోర్టు ట్రస్ట్‌లో ఉద్యోగం చేస్తూనే, నాటకాలు వేసేవారు. ‘సవతితల్లి’ అనే నాటికలో కొండవలస ద్విపాత్రాభినయంతో తొలిసారిగా అలరించారు. వెయ్యికిపైగా నాటకాలను ప్రదర్శించి మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ఇలా నాటకాలు వేస్తున్న క్రమంలో ద్రాక్షారామంలో కొండవలస నటించిన ‘అల్లదే మా ఊరు’ అనే నాటికను వీక్షించిన దర్శకుడు వంశీ ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ అనే సినిమాలో కొండవలసకు ప్రాధాన్యం ఉన్న పొట్టిరాజు క్యారెక్టర్‌ను ఇచ్చి ప్రోత్సహించారు. తన సహజ ధోరణిలో కూడా వినూత్నంగా కొండవలసతో డైలాగులు చెప్పించిన వంశీ... చివరి సినిమా వరకు దానినే కొనసా గించడం విశేషం. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చి న ‘ఎవడి గోల వాడిది’ చిత్రంలో కొండవలస కామెడీ విలన్ గా కన్పించారు. కబడ్డీ కబడ్డీలో కృష్ణారావు క్యారెక్టర్‌తో అంద ర్నీ నవ్వించారు ఆయన. సత్యం, పందెం, రాఖీ, ఆదివారం ఆడవాళ్లకు సెలవు, పెళ్లాంతో పనేంటి, శ్రీరామచంద్రుడు తదితర సినిమాల్లో బాగా పేరు తెచ్చుకున్నారు. 12 ఏళ్ల పాటు సినిమాల్లో ఖాళీ లేకుండా నటించిన ఆయన ఆఖరి సినిమా వాసవీ కన్యకాపరమేశ్వరి చరిత. 2015 నవంబరు 2 హైదరాబాద్‌లో ఆయన కన్నుమూశారు.
Updated Date - May 03 , 2025 | 11:45 PM