Kota Srinivasa Rao: కోట శ్రీనివాసరావుకు.. సిక్కోలుతో అనుబంధం
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:50 PM
Kota Srinivasa Rao .. Srikakulam connection సినీరంగంలో నాలుగున్నర దశాబ్దాల పాటు వెలుగొందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసి జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు.
35 ఏళ్ల కిందట కమ్మసిగడాం యాత్రకు రాక
ఆకస్మిక మృతితో అభిమానుల దిగ్ర్భాంతి
శ్రీకాకుళం కల్చరల్, జూలై 13(ఆంధ్రజ్యోతి): సినీరంగంలో నాలుగున్నర దశాబ్దాల పాటు వెలుగొందిన విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిసి జిల్లాలోని ఆయన అభిమానులు దిగ్ర్భాంతి చెందారు. వందల సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన ఆయన ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాటకరంగం, సినిమా రంగం రెండింటిలోనూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కోట శ్రీనివాసరావుకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా, కమెడియన్‌గా విభిన్న పాత్రల్లో తనదైన శైలిలో ఒదిగిపోయి.. నవ్వుల్లోనూ, కన్నీళ్లల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్న గొప్ప నటుడుగా గుర్తింపు పొందారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 750 పైగా సినిమాల్లో నటించిన ఆయన ప్రేక్షకులను మెప్పిస్తూ తొమ్మిది నంది అవార్డులు సొంతం చేసుకున్నారు.
కోట శ్రీనివాసరావు మృతి సినీ, నాటక రంగానికి తీరని లోటని శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి అన్నారు. ‘35 ఏళ్ల కిందట కోట శ్రీనివాసరావు జిల్లాకు వచ్చారు. రణస్థలం మండలం కమ్మసిగడాం మహాలక్ష్మి జాతరలో నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు. పట్టాభి అనే దర్శకుడు, నటుడు నాటక పరిశుద్ధ పేరిట ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆ నాటక పోటీల్లో శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య.. చీకటి అనే నాటికను ప్రదర్శించారు. అదే పరిషత్తు నాటికల్లో కోట శ్రీనివాసరావు ప్రాణం ఖరీదు అనే సాంఘిక నాటికలో విలన్‌గా నటించారు. అప్పుడు రంగస్థల కళాకారుల సమాఖ్య ఆయనను సన్మానించింద’ని రామలింగస్వామి తెలిపారు. కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు పరిషత్ నాటకాలు ప్రదర్శించేవారు. ఆయన గుంటూరు, విజయవాడ, పొద్దుటూరుల్లో నాటక పరిషత్ నాటకాలు వేయడానికి వచ్చేవారు. ఆ సమయంలో శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులమంతా కలిసేవాళ్లమ’ని రామలింగస్వామి గుర్తుచేసుకున్నారు.
స్వామి వివేకానంద ట్రస్ట్ అధ్యక్షుడు జి.లోకనాథం(గులోనా) మాట్లాడుతూ ‘కోట శ్రీనివాసరావుతో కలిసి పెళ్లి సినిమాలో విలన్‌గా నటించే అవకాశం నాకు దక్కింది. ఆయన విలక్షణ నటుడు. నన్ను చిత్ర పరిశ్రమలో కొనసాగమని కోరేవారు. ఆయనతో కలిసి పనిచేయడం ఓ మధురానుభూతి’ అని తెలిపారు. రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి చిట్టి వెంకటరావు, రామచంద్రదేవ్, రమణారావు, పొట్నూరు వెంకటరావు తదితరులు కోట శ్రీనివాసరావు మృతికి సంతాపం వ్యక్తం చేశారు. సుమిత్రా కళా సమితి అధ్యక్షుడు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, సురేష్ తదితరులు నివాళులర్పించారు.
Updated Date - Jul 13 , 2025 | 11:50 PM