Hostels: వసతిగృహాలకు కిట్‌లు
ABN, Publish Date - May 04 , 2025 | 11:44 PM
Student welfare గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు సకాలంలో కాస్మెటిక్స్ చార్జీలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాస్మెటిక్స్ చార్జీలకు బదులు ఇకపై 12 రకాల వస్తువులను విద్యార్థులకు నేరుగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాస్మెటిక్స్ చార్జీలకు బదులుగా 12 వస్తువుల పంపిణీ
రానున్న విద్యా సంవత్సరం నుంచి అమలుకు కసరత్తు
విద్యార్థుల్లో ఆనందం
మెళియాపుట్టి మండలం ముకుం దపురం గ్రామానికి చెందిన ఎస్.పవన్ కుమార్ పెద్దమడి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదివేవాడు. ప్రభుత్వం నుంచి కాస్మెటిక్ చార్జీలు రాకపోవటంతో తల్లిండ్రులు ఇచ్చిన డబ్బులతోనే సర్దుబాటు చేసుకునేవాడు. రాష్ట్ర ప్రభుత్వం కాస్మెటిక్ చార్జీలు బదులుగా కిట్‌లు అందజేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
..................
మెళియాపుట్టి మండ లం కేరాశింగి గ్రామానికి చెందిన ఎస్.చందు పెద్ద మడి గురుకుల పాఠ శాలలో ఏడో తరగతి చదివేవాడు. వసతిగృహంలో దుస్తులు ఉతకడానికి సబ్బులు లేక ఇబ్బందులు పడ్డాడు. ప్రభుత్వం కిట్లు అందజేస్తే ఇటువంటి విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
..................
మెళియాపుట్టి, మే 4(ఆంధ్రజ్యోతి): గిరిజన ఆశ్రమ పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో విద్యార్థులు సకాలంలో కాస్మెటిక్స్ చార్జీలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాస్మెటిక్స్ చార్జీలకు బదులు ఇకపై 12 రకాల వస్తువులను విద్యార్థులకు నేరుగా అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రెండు నెలలకోసారి ఈ కిట్లను అందజేసేలా సాంఘిక సంక్షేమశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో టెండర్ల ద్వారా వీటిని సరఫరా చేయనున్నారు. కాస్మెటిక్స్ చార్జీల డబ్బులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలో జమ చేసేవారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ డబ్బులను సక్రమంగా జమచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. క్షవరంతోపాటు నూనె, సబ్బు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించి తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సాంకేతిక కారణాలతో కొంతమంది తల్లుల ఖాతాలో కాస్మెటిక్ నిధులు జమకావడం లేదని ఆ కమిటీ గుర్తించింది. అలాగే కొంతమందికి డబ్బులు జమయినా దూర ప్రాంతాల నుంచి ప్రతినెలా తల్లిదండ్రులు రాలేకపోవడంతో విద్యార్థులు కాస్మెటిక్స్ కొనుగోలు చేయలేకపోతున్నారని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో కిట్లు అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి
సీతంపేట ఐటీడీఏ పరిధిలో 29 ఆశ్రమ పాఠశాలల్లో గతేడాది 4,270 మంది విద్యార్థులు చదివేవారు. 12 గిరిజన పోస్టుమెట్రిక్ పాఠశాలల్లో 1,529 మంది, 63 బీసీ వసతిగృహాలు, 18 పోస్టుమెట్రిక్ వసతిగృహాల్లో 6,500 మంది విద్యార్థులు ఉండేవారు. సాంఘిక సంక్షేమశాఖ పరిధిలో 20 వసతిగృహాలతోపాటు 11 పోస్టుమెట్రిక్ వసతిగృహల్లో 2,820 మంది విద్యార్థులు ఉన్నారు. గురుకుల పాఠశాలలు, సీతంపేట, పెద్దమడి గురుకుల కళాశాలల్లో వందలాది మంది విద్యనభ్యసిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డైట్ చార్జీలను మూడు, నాలుగు తరగతుల విద్యార్థులకు రూ.1,150 చొప్పున చెల్లించేవారు. ఐదు నుంచి పదోతరగతి విద్యార్థులకు రూ.1,400 చొప్పున, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1,600 చొప్పున అందజేసేవారు. కాస్మెటిక్ చార్జీల కిందట మూడు నుంచి ఆరో తరగతి విద్యార్థులకు నెలకు రూ.125, విద్యార్థినులకు రూ.130 చొప్పున చెల్లించేవారు. ఏడు నుంచి పదోతరగతి విద్యార్థులకు రూ.150, విద్యార్థినులకు రూ.200 చొప్పున అందజేసేవారు. ఇంటర్.. ఆపై విద్యార్థులకు రూ.250 చొప్పున ఇచ్చేవారు. వైసీపీ హయాంలో వీటిని సక్రమంగా అందజేయకపోవడంతో విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం కమిటీ ప్రతిపాదనల మేరకు 12 రకాల వస్తువులను కిట్ల రూపంలో నేరుగా విద్యార్థులకు పంపిణీ చేయనుంది. కొబ్బరినూనె, టూత్ బ్రష్, పేస్ట్, టంగ్‌క్లీనర్, ఫౌడర్, సబ్బు, హెయిర్ బ్యాండ్, రబ్బరు బ్యాండ్, రిబ్బన్లు, వ్యాజిలిన్, షాంపు, డిటర్జెంట్ సబ్బు, వాషింగ్ ఫౌడర్, సర్ప్ తదితర వస్తువులను అందజేయనుంది. బాలురకు కిట్‌తోపాటు ప్రతినెలా క్షవరానికిగాను అదనంగా రూ.50 చొప్పున అదనంగా ఇవ్వనుంది. దీంతో వసతిగృహ విద్యార్థులకు ఊరట లభించనుంది.
Updated Date - May 04 , 2025 | 11:44 PM