Kidney Disease: కిడ్నీవ్యాధి కబళిస్తోంది
ABN, Publish Date - Jul 09 , 2025 | 12:14 AM
Health complications టెక్కలి మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిట్టాలపాడు గ్రామాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. గ్రామంలో సుమారు 75 కుటుంబాల్లో 300 మంది జనాభా ఉన్నారు. గత పదేళ్ల నుంచి చాలా మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు.
కిట్టాలపాడులో మూడేళ్లలో ఏడుగురి మృతి
పట్టించుకోని గత ప్రభుత్వం
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
టెక్కలి మండలం కిట్టాలపాడు గ్రామానికి చెందిన కందు అప్పన్న కిడ్నీవ్యాధితో బాధపడుతూ.. నెలరోజుల కిందట మృతి చెందాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు.
ఇదే గ్రామానికి చెందిన మోద లక్ష్మీనారాయణ కూడా ఎనిమిది నెలల కిందట కిడ్నీవ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం వితంతు పింఛన్ కూడా తనకు మంజూరు కాలేదని భార్య పార్వతి వాపోతోంది.
కందు అప్పన్న, మోద లక్ష్మీనారాయణతోపాటు గ్రామానికి చెందిన మోద సవరయ్య, మెండబోయిన అప్పన్న, ఎం.వెంకటరావు, మెండబోయిన కృష్ణమూర్తి, మోద కృష్ణమూర్తిని కూడా కిడ్నీ మహమ్మారి బలిగొంది. ఇలా గత మూడేళ్లలో కిడ్నీవ్యాధితో ఏడుగురు మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కిడ్నీవ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.
టెక్కలి రూరల్, జూలై 8(ఆంధ్రజ్యోతి): టెక్కలి మండలానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కిట్టాలపాడు గ్రామాన్ని కిడ్నీ వ్యాధి కబళిస్తోంది. గ్రామంలో సుమారు 75 కుటుంబాల్లో 300 మంది జనాభా ఉన్నారు. గత పదేళ్ల నుంచి చాలా మంది కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారు. గత మూడేళ్లలో ఏడుగురు కిడ్నివ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. గ్రామంలో నీటిని పరీక్షించగా ఫ్లోరైడ్ సమస్య ఉందని గుర్తించారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో గత్యంతరం లేక గ్రామంలో ఉన్న బావినీటినే వినియోగిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు గ్రామంలో సోలార్ పంపు సెట్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేశారు. కానీ, అప్పటికే కిడ్నీ బాధితులు పెరిగిపోయారు. ఫ్లోరైడ్ సమస్య వల్ల చాలామంది కీళ్లనొప్పులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం వ్యాధి తీవ్రత, కిడ్నీ బాధితుల సంఖ్య పెరుగుతోందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కొంతమంది డయాలసిస్ కోసం టెక్కలిలో జిల్లా ఆస్పత్రికి వెళ్తున్నారు. గతంలో కిడ్నీ బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ వచ్చేది. ప్రస్తుతం అంబులెన్స్ రాకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ డబ్బులు ఆటోల్లో వెళ్లేందుకు రవాణా చార్జీలకే సరిపోతున్నాయని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి కిడ్నీవ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
నీటి సరఫరాకు చర్యలు
ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు క్లోరినేషన్ చేసిన నీటిని అందించేందుకు జలజీవన్ పథకం కింద రూ.25.06 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో పనులు చేపడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఫ్లోరైడ్ నీరు వస్తోంది. దీంతో కిలోమీటరు దూరంలో ఉన్న నర్సింగపల్లి పాఠశాల వద్ద బోరు తీశారు. అక్కడి నుంచి గ్రామంలో ట్యాంకు ద్వారా శుద్ధ జలాన్ని ఇంటింటికీ సరఫరా చేయనున్నారు.
ఆటోచార్జీలకే సరి..
గ్రామంలో కిడ్నీ బాధితులు పెరుగుతుండడంతో భయమేస్తోంది. గత రెండేళ్ల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. గతంలో 108 వాహనం ద్వారా డయాలసిస్‌కు వెళ్లేవాడిని. ప్రస్తుతం అంబులెన్స్ రావడం లేదు. నెలకు ఐదుసార్లు డయాలసిస్‌కు టెక్కలిలో ఆస్పత్రికి వెళ్తున్నాను. ఆటో చార్జీలకే రూ.5వేలు ఖర్చవుతోంది. పింఛన్ వచ్చినా డబ్బులు చాలడం లేదు.
- మెండబోయిన సోమేశ్వరావు, కిట్టాలపాడు
అప్పు చేసి వైద్యం
నా భర్త కొన్నేళ్ల నుంచి కిడ్నీవ్యాధితో బాధపడుతుండేవాడు. అప్పు చేసి వైద్యం చేయించాం. అయినా ఫలితం లేకపోయింది. గత నెల మృతి చెందాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వితంతువు పింఛన్ అయినా మంజూరు చేయాలి.
- ఎం.ధనలక్ష్మీ, కిట్టాలపాడు
తాగునీరు వల్లే
కొన్నేళ్ల నుంచి తాగునీటి సమస్య వల్లే గ్రామంలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికైనా శరవేగంగా పనులు పూర్తిచేసి.. మంచినీటిని సరఫరా చేయాలి.
- తలగాపు అప్పయ్య, కిట్టాలపాడు
రెండు నెలల్లో తాగునీరు..
మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదనల మేరకు జలజీవన్ పథకం నిధులు మంజూరయ్యాయి. నర్సింగపల్లిలో బోరు తీసి.. కిట్టాలపాడులో 5వేల లీటర్లు నిల్వ ఉండే ట్యాంకును నిర్మించి నీటిని సరఫరా చేస్తాం. రెండు నెలల్లో పనులు పూర్తిచేసి.. ఇంటింటికీ తాగునీరు అందిస్తాం.
- మోహనరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, టెక్కలి
Updated Date - Jul 09 , 2025 | 12:14 AM