Judicial Inquiry: నిరసన భగ్నం
ABN, Publish Date - May 24 , 2025 | 12:09 AM
Keshav Rao Encounter.. Judicial Inquiry మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ భూటకమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గలో నిరసనకు సన్నద్ధం కాగా.. పోలీసులు భగ్నం చేశారు.
కేశవరావు ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ చేయాలి
ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
పలాస, మే 23(ఆంధ్రజ్యోతి): మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ భూటకమని, దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు జడ్జితో న్యాయవిచారణ చేసి ప్రజలకు వాస్తవాలు వెల్లడించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గలో నిరసనకు సన్నద్ధం కాగా.. పోలీసులు భగ్నం చేశారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావుతో పాటు పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా.. జిల్లాకు చెందిన కేశవరావును ప్రభుత్వమే భూటకపు ఎన్‌కౌంటర్ పేరుతో హత్యచేసిందని ప్రజాసంఘాలు ఆరోపించాయి. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గ బస్టాండు ఆవరణలో నిరసనకు పిలుపునిచ్చాయి. దీంతో బొడ్డపాడు, పరిసర గ్రామాలకు చెందిన ప్రజాసంఘాలు, శ్రీకాకుళంలో ఉన్న సంఘాల నాయకులు శుక్రవారం ఉదయం కాశీబుగ్గ చేరుకున్నారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ వారితో మాట్లాడి.. ఆందోళన వద్దని వెళ్లిపోవాలని సూచించారు. తాము శాంతియుతంగా నిరసన చేపడతామని చెప్పినా పోలీసులు అంగీకరించలేదు. దీంతో ఆందోళనకారులను పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం వారితో చర్చించి. పూచీకత్తుపై విడుదల చేశారు. మొత్తం రెండు గంటలపాటు కాశీబుగ్గ బస్టాండు, పోలీస్‌స్టేషన్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అనంతరం స్థానిక సూదికొండకాలనీలోని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్, పౌరహక్కులసంఘం, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం, అమరుల బంధుమిత్రుల కమిటీ, ప్రజాకళామండలి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, సీపీఎం నాయకులు సమావేశమయ్యారు. వారు విలేకరులతో మాట్లాడుతూ.. ‘జంట పట్టణాల్లో శాంతియుతంగా చేపడతామన్న నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం తగదు. తక్షణం మావోయిస్టు పార్టీతో ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలి. ఆపరేషన్ కగార్, ఆదివాసీల హనణం ఆపాలి. పాలకులు రాజ్యాంగ చట్టాలను ఉల్లంఘించి మావోయిస్టులే టార్గెట్‌గా చేసుకొని ఇప్పటి వరకూ 550 మందిని హత్య చేశారు. కార్పొరేట్ సంస్థలకు అడవులను అప్పగించేందుకే.. ఆదివాసీలు, మావోయిస్టులను చంపేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా ఫాసిస్టు పాలనకు ఇదొక నిదర్శన’మని తెలిపారు. సమావేశంలో తాండ్ర ప్రకాష్, వంకల మాధవరావు, పత్రి దానేసు, మద్దిల రామారావు, సాలిన వీరాస్వామి, జోగి కోదండరావు, తామాడ త్రిలోచన, పోతనపల్లి అరుణ, నీలకంఠం, మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధన, దాసరి శ్రీరాములు, తెప్పల అజయ్, బతకల ఈశ్వరమ్మ, మామిడి భీమారావు, వంకల పాపయ్య, జగన్, బర్ల గోపి పాల్గొన్నారు.
Updated Date - May 24 , 2025 | 12:09 AM