రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యమా?
ABN, Publish Date - Jul 15 , 2025 | 12:05 AM
రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఇలాగే వ్యవహరిస్తే సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హెచ్చరించారు.
ఆమదాలవలస, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడం ఎంతమాత్రం సమంజసం కాదని, ఇలాగే వ్యవహరిస్తే సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేయాల్సి వస్తుందని ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ఎంపీపీ తమ్మినేని శారదమ్మ అధ్యక్షతన మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత వంశధార, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన చర్చ ప్రారంభించారు. వంశధార, పలు ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు సక్రమంగా రావడం లేదని పలువురు సర్పంచ్‌లు, ఎంపీ టీసీ సభ్యులు పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఐదేళ్ల వైసీపీ పాలనలో సాగునీటి వన రులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిధులు రప్పించి సాగునీటి వనరులను యథాస్థితికి తీసుకువస్తామన్నారు. అయితే ప్రతి ఎకరాకు సాగునీరందించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారులపై ఉందని, రైతులు నుంచి ఎటువంటి ఫిర్యాదులు వచ్చినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వ్యవసాయశాఖపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సచివాలయాల వ్యవసాయ సహాయకులు సకాలంలో ఎరువులు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిం దన్నారు. తొగరాం గ్రామ సచివాలయ వ్యవసాయ రైతుల నుంచి ఎరువులకు నగదును వసూలు చేసినట్లు ఎమ్మెల్యే దృష్టికి పలువురు సభ్యులు తీసుకురాగా తక్షణం సదరు ఉద్యోగిపై విచారణ చేపట్టి జేడీఏకి పంపాలని ఏవో మెట్ట మోహనరావును ఆదేశించారు. గ్రామస్థాయి ప్రజా ప్రతినిధులు రాజకీయ ధోరణితో తప్పుడు ప్రచారాలు వీడి అన్నిశాఖల అధికారుల ద్వారా పూర్తి విషయం తెలుసు కుని ప్రజలకు వివరిస్తే బాగుంటుందని అన్నారు. సమావేశంలో ఎంపీడీవో రోణంకి వెంకటరావు, జడ్పీటీసీ బెండి గోవిందరావు, ప్రత్యేక ఆహ్వానితుడు తమ్మినేని శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 12:05 AM