బడిబస్సు భద్రమేనా?
ABN, Publish Date - Jun 26 , 2025 | 12:03 AM
గతంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా స్కూల్ బస్సులు తిప్పుతామంటే కుదరదు. కచ్చితంగా వాటికి సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సిందే.
- ఆటోమేటిక్ టెస్టింగ్ విధానం అమలు
-యంత్రాలతో పూర్తిగా తనిఖీ
-ఫిట్‌నెస్ లేకుంటే పక్కకే..
- జిల్లాలో కాలంచెల్లిన బస్సులే అధికం
కాశీబుగ్గ, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): గతంలో మాదిరిగా ఇష్టారాజ్యంగా స్కూల్ బస్సులు తిప్పుతామంటే కుదరదు. కచ్చితంగా వాటికి సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సిందే. అది కూడా మాన్యువల్‌గా కాదు. ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంలో తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రం ఇవ్వనున్నారు. శ్రీకాకుళం నగరంలోని సింహద్వారం వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఏజెన్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతను అప్పగించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ విధానం తప్పనిసరి చేశారు. మానవ తప్పిదాలకు, అక్రమాలకు అవకాశం ఇవ్వకుండా ఆటోమేటిక్ టెస్టింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు రవాణా, విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధానంతో బడి బస్సు భద్రమేనా? లేదా? అనేది పక్కాగా తేలనుంది.
567 బస్సుల్లో ఎన్ని ఫిట్?
సాధారణంగా ప్రైవేటు విద్యాసంస్థలే బస్సులు నడుపుతుంటాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 398, జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85, ఇంజనీరింగ్ కాలేజీలు 3, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఒక్కొక్కటి ఉన్నాయి. వీటి పరిధిలో 567 బస్సులు నడుస్తున్నాయి. వీటికి ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే సామర్థ్య పరీక్షలు నిర్వహించాలి. అయితే కొత్తగా ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంతో ఎన్ని బస్సులు తమ సమర్థత నిరూపించుకుంటాయో చూడాలి. జిల్లాలో గత ఆరేళ్లుగా బస్సుల ఫిట్‌నెస్ పరీక్షలు తూతూమంత్రంగా జరిపినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఏటా ఏప్రిల్‌లో విద్యాసంస్థలకు సెలవులు ఇస్తారు. మే 15 నాటికి స్కూల్ బస్సులకు ఇచ్చే ఫిట్‌నెస్ ధ్రువీకరణపత్రం గడువు ముగుస్తుంది. పాఠశాలలు తెరిచే సమయానికి సామర్థ్య పరీక్షలు పూర్తిచేయాలి. వాస్తవానికి సురక్షితమైన, కండీషన్‌లో ఉన్న బస్సులనే వినియోగించాలి. 15 ఏళ్లు దాటిన బస్సులను అస్సలు వినియోగించకూడదు. కానీ, కొన్ని పాఠశాలలు పాత బస్సులకు రంగులు వేసి నడుపుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దానికి చెక్ చెబుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కొత్త తనిఖీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. యంత్రాల సాయంతో సామర్థ్యాన్ని తనిఖీ చేస్తారు. వాహనం నుంచి వెలువడుతున్న పొగ, బ్రేక్, లైట్ల పనితీరును పరిశీలిస్తారు. అందులో ఏ చిన్నలోపం ఉన్నా ధ్రువీకరణపత్రం రాదు. కండిషనల్‌లో ఉన్న వాహనాలకే ధ్రువపత్రం అందుతుంది. గతంలో మాదిరిగా నచ్చినప్పుడు వాహనం తీసుకెళతామంటే కుదరదు. అందుకు ముందుగా చలానా తీయాలి. దీని ప్రకారం సమయం కేటాయిస్తారు. వారు కేటాయించిన సమయంలోనే బస్సులను తనిఖీకి తీసుకెళ్లాలి.
ఈ నిబంధనలు తప్పనిసరి
స్కూల్ బస్సుకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 60 ఏళ్ల దాటిన వారిని బస్సు డ్రైవర్‌గా నియమించకూడదు. హెవీ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు నాలుగేళ్ల అనుభవం, ఆరోగ్యంగా ఉన్న డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ముందుగా వారి నుంచి ఫిట్‌నెస్ పొందాలి. కంటిచూపు సక్రమంగా ఉండడంతో పాటు మూర్చ వంటి వ్యాధులు లేని వారికి ఎంపిక చేసుకోవాలి. బస్సులో క్లీనర్, అటెండర్ తప్పకుండా ఉండాలి. రెగ్యులర్‌గా స్కూల్ యాజమాన్యం తనిఖీ చేసి రిపోర్టు దగ్గర పెట్టుకోవాలి. బస్సుకు పసుపు రంగు వేయించాలి. ముందు భాగంలో తెలుపు, వెనుక భాగంలో ఎరుపు రంగు రేడియం స్టిక్కర్లు అతికించాలి. స్కూల్‌పేరు, ఫోన్ నెంబర్లు సూచించేలా బొమ్మలు అతికించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, ఎమెర్జెన్సీ డోర్ ఏర్పాటుచేయాలి. అగ్నిప్రమాద నివారణ పరికాలు అందుబాటులో ఉంచాలి. కిటికీలకు నెట్ తప్పనిసరిగా ఉంచాలి. తలుపులకు లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక పెట్టాలి. ముందు, వెనుక భాగాల్లో స్కూల్ బస్సు, ఆన్ స్కూల్ డ్యూటీ అని రాయాలి. గంటకు 40 కిలోమీటర్ల వేగానికి మించకుండా స్పిడ్ గవర్నెన్స్ ఏర్పాటుచేయాలి. కానీ, గత కొన్నేళ్లుగా ఈ నిబంధనలేవీ అమలైన దాఖలాలు లేవు. నిష్ణాతులైన డ్రైవర్లకు అధిక వేతనం ఇవ్వాల్సి వస్తోందని కొన్ని యాజమాన్యాలు వయసు పైబడిన వారిని సైతం డ్రైవర్లుగా ఎంపిక చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొన్ని యాజమాన్యాలకు రెండు లేదా అంతకన్న ఎక్కువ బస్సులు ఉన్నా రవాణా శాఖ అధికారులు మాత్రం ఒకటి లేదా రెండు బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు చేసి మిగతా వాటిని వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే, కేవలం బస్సులకు ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేసి తరువాత పట్టించుకోవడం లేదన్న విమర్షలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఆటోమేటిక్ టెస్టింగ్ విధానంతోనైనా వాటికి చెక్‌పడుతుందా? లేదా? అన్నది చూడాలి.
యాజమాన్యాలదే బాధ్యత
స్కూల్ బస్సుల విషయంలో యాజమాన్యాలే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కండీషన్‌లో ఉన్న బస్సులను ఏర్పాటు చేసుకోవాలి. నిష్ణాతులైన డ్రైవర్లనే ఎంపిక చేయాలి. ఫిట్‌నెస్ పత్రాలు పొంది ఉండాలి. లేదంటే చర్యలు తప్పవు. జిల్లాలో ఎన్ని స్కూల్‌కు బస్సులు ఉన్నాయి, ఎన్నింటికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నాం. అన్ని బస్సులను తనిఖీ చేస్తాం. ఫిట్‌నెస్ లేకుండా వాటిని బయటకు పంపితే కఠిన చర్యలు తీసుకుంటాం.
- తిరుమలచైతన్య, డీఈవో, శ్రీకాకుళం
Updated Date - Jun 26 , 2025 | 12:03 AM