Tribal Communities: ఆ మూడు గ్రామాల్లో..
ABN, Publish Date - May 24 , 2025 | 12:17 AM
Government Neglect in tribal villages కొత్తూరు మండల కేంద్రానికి శివారు ప్రాంతమైన పొనుటూరు పంచాయతీలోని బంకి బంజరగూడ, బంకిగూడ, బంకిమెట్టు గూడ గ్రామాల గిరిజనులు సమస్యలతో సతమతమవుతున్నారు.
గిరిజనులకు అందని ప్రభుత్వ పథకాలు
కుల ధ్రువీకరణ పత్రాల మంజూరులో కొర్రీలు
తాగునీటికి తప్పని ఇబ్బందులు
పాఠశాలకు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే
అంగన్‌వాడీ కేంద్రం కూడా లేక అవస్థలు
కొండపోడు పట్టాల పంపిణీలోనూ నిర్లక్ష్యం
వారంతా ఇరవై ఏళ్ల కిందట బతుకుదెరువు కోసం ఒడిశా రాష్ట్రం నుంచి జిల్లాకు వచ్చేశారు. కొత్తూరు మండలం పొనుటూరు పంచాయతీ పరిధిలో మూడు గ్రామాల్లో జీవనం సాగిస్తున్నారు. వారందరికీ ఆధార్, ఓటు, రేషన్‌కార్డులతోపాటు ఉపాధిహామీ పథకం జాబ్‌కార్డులు సైతం ఉన్నాయి. కానీ, ప్రభుత్వ పథకాలు మాత్రం దరిచేరడం లేదని ఆ మూడు గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుల ధ్రువీకరణ పత్రం మంజూరులో అధికారులు కొర్రీలు పెడుతున్నా రని ఆరోపిస్తున్నారు. అలాగే పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు రహదారులు, తాగునీటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. తమ సమస్యలు పట్టించుకునే వారు కరువయ్యారని వాపోతున్నారు.
....................
కొత్తూరు, మే 23(ఆంధ్రజ్యోతి): కొత్తూరు మండల కేంద్రానికి శివారు ప్రాంతమైన పొనుటూరు పంచాయతీలోని బంకి బంజరగూడ, బంకిగూడ, బంకిమెట్టు గూడ గ్రామాల గిరిజనులు సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉండగా, 150 మంది నివసిస్తున్నారు. వీరంతా ఇరవై ఏళ్ల కిందట ఒడిశా నుంచి వచ్చి.. ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పరచుకుని జీవనం సాగిస్తున్నారు. ఆధార్, ఓటు, ఉపాధిహామీ జాబ్‌కార్డులు పొందారు. వీరిలో సుమారు 60 మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. గతంలో సార్వత్రిక, పంచాయతీ ఎన్నికల్లో ఓటుహక్కును సైతం వినియోగించుకున్నారు. గతంలో కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేశారు. ప్రస్తుతం విద్యార్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు జారీకి అధికారులు కాలయాపన చేస్తున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో గృహాలు నిర్మించుకుందామన్నా.. తమ పిల్లలు ఉన్న చదువులకు వెళ్లాలన్నా కుల ధ్రువీకరణ పత్రాలు అనివార్యం కాగా.. వాటిని మంజూరు చేయడంలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారి నిరాకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పిల్లలు మధ్యలో చదువుకు దూరమై.. కూలికి వెళ్లాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి గృహాలు, కొండపోడు పట్టాల మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ కె.బాలకృష్ణ వద్ద ప్రస్తావించగా.. సర్టిఫికెట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కుల ధ్రువీకరణ పత్రాలు జారీచేస్తామని తెలిపారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు.
బడీ లేదూ.. ‘అంగన్‌వాడీ’ లేదు
పొనుటూరు పంచాయతీలోని బంకి బంజరగూడ, బంకిగూడ, బంకిమెట్టు గూడ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల లేక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నారులు ప్రాథమిక విద్యాభ్యాసం చేయాలంటే సుమారు నాలుగు కిలోమీటర్లు దూరంలో ఉన్న పొనుటూరు గ్రామం వెళ్లాల్సి వస్తోంది. దీంతో పాఠశాలకు పంపలేక చాలామంది చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. అలాగే అంగన్‌వాడీ కేంద్రం కూడా లేకపోవడంతో గిరిజనులు అవస్థలు పడుతన్నారు. ఈ మూడు గ్రామాల్లో సుమారు 10మంది చిన్నారులు ఉన్నారు. 9మంది బాలింతలు ఉన్నారు. గతంలో ఈ మూడు గిరిజన గ్రామాలకు మినీ అంగన్‌వాడీ కేంద్రం ఉండగా.. ప్రస్తుతం దానిని మూసేశారు. కొత్తూరు మండలం కొత్తపొనుటూరు అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఈ మూడు గ్రామాలకు కూడా పౌష్టికాహారం సరఫరా చేస్తున్నారు. లబ్ధిదారులు విధిగా ఫేస్‌యాప్ నమోదు చేసుకుంటేనే సరుకులు అందజేస్తారు. కాగా.. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అంగన్‌వాడీ కేంద్రానికి గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారానికి నోచుకోలేకపోతున్నామని గర్భిణులు, బాలింతలు వాపోతున్నారు. పౌష్టికాహార లోపం కారణంగా న్యూమోనియా వంటి వ్యాధులు సోకి ఆస్పత్రి పాలవుతున్నామని పేర్కొంటున్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రమైనా మంజూరు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై కొత్తూరు ఐసీడీఎస్ సీడీపీవో విమలకుమారి వద్ద ప్రస్తావించగా.. ఆ మూడు గిరిజన గూడలకు మినీఅంగన్‌వాడీ కేంద్రం మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
కనీస సౌకర్యాలు లేక..
బంకి బంజరగూడలో గతంలో ఏనుగుల దాడి సమయంలో అటవీశాఖ అధికారులు తీయించిన బోరు మరమ్మతులకు గురైంది. ప్రస్తుతం బిందెడు నీళ్లు కూడా రావడం లేదు. తాగునీటి కోసం కిలోమీటరు దూరంలో ఉన్న వంశధార నదీ పరివాహక ప్రాంతానికి నడుచుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని మహిళలు వాపోతున్నారు.
గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కూడా లేదు. ఎవరికైనా అనారోగ్యం చేస్తే.. వారిని డోలీలో మోసుకుంటూ ప్రధాన రహదారి వద్దకు తీసుకురావాల్సిందే. అక్కడి నుంచి అంబులెన్స్‌లో వెళ్లాల్సి వస్తోంది. అత్యవసర సమయాల్లో తమ పాట్లు వర్ణనాతీతమని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు.
గిరిజనులు జీవనం సాగించేందుకు పోడు వ్యవసాయానికి తగిన భూములు లేవు. దీంతో బతుకుదెరువు కష్టంగా ఉందని, ప్రభుత్వం పోడు పట్టాలు మంజూరు చేసి.. తమను ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. అధికారులు, పాలకులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
చదువుకు దూరం..
కుల ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదు. దీంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్య పరిష్కరించడం లేదు.
సవర కలోడియా, బంకి బంజరగూడ
పౌష్టికాహారం అందడం లేదు
మా మూడు గ్రామాల్లో సుమారు 10 మంది చిన్నారులు, 9మంది బాలింతలు ఉన్నారు. అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో పౌష్టికాహారం అందడం లేదు. పిల్లలు, గర్భిణులు అనారోగ్యం బారిన పడుతున్నారు.
సవర జయరాజ్, బంకి బంజరగూడ
ప్రభుత్వ పథకాలు వర్తించడం లేదు
ఇరవై ఏళ్ల కిందట ఒడిశా నుంచి ఇక్కడకు వచ్చి జీవనం సాగిస్తున్నాం. మా అందరికీ ఆధార్, ఓటు, రేషన్, ఉపాధిహామీ పథకం కార్డులున్నా, మాకు కులు ధ్రువీకరణ పత్రాలు మంజూరులో జాప్యం చేస్తున్నారు. దీంతో పిల్లల చదువుతోపాటు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నాం.
సవర కవుల్లో, బంకి బంజరగూడ
Updated Date - May 24 , 2025 | 12:17 AM