ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్తూరు టు ఒడిశా.. వయా మన్యం

ABN, Publish Date - Jul 12 , 2025 | 11:52 PM

Ration Rice Smuggling రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. కొంతమంది మిల్లర్లు ప్రధాన సూత్రధారులు వ్యవహరిస్తూ.. రేషన్‌ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో విజిలెన్స్‌ అధికారులకు భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడడం చర్చనీయాంశమవుతోంది.

పి.కోనవలసలో విజిలెన్స్‌ అధికారులకు లారీలో పట్టుబడిన రేషన్‌ బియ్యం
  • కడుమ మిల్లు నుంచి రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

  • పార్వతీపురం జిల్లాలో భారీగా పట్టుబడిన వైనం

  • ప్రాథమికంగా గుర్తించిన విజిలెన్స్‌.. కేసు నమోదు

  • నీరు గార్చేందుకు తెరవెనుక నాయకుల యత్నం

  • విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేయడం.. పీడీఎస్‌ రైస్‌ పట్టుకోవడం.. రెవెన్యూ శాఖకు అప్పగించడం.. ఆ వెంటనే నాయకులు రంగంలోకి దిగడం.. అధికారులపై ఒత్తిడి తేవడం.. తూతూమంత్రంగా కేసులు పెట్టడం.. అక్రమార్కులను రక్షించడం..! ఇదీ జిల్లాలో జరుగుతున్న తీరు. కొందరు నాయకుల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రజల నుంచి రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి.. మిల్లులో పాలిష్‌ చేయించి.. జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. దొరికితేనే దొంగలు అన్న చందంగా విజిలెన్స్‌ దాడులు చేసినప్పుడే పట్టుబడుతున్నారు. తాజాగా కొత్తూరు మండలంలోని ఓ మిల్లు నుంచి అక్రమంగా తరలిన బియ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది.

  • శ్రీకాకుళం, జూలై 12(ఆంధ్రజ్యోతి): రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జోరందుకుంది. కొంతమంది మిల్లర్లు ప్రధాన సూత్రధారులు వ్యవహరిస్తూ.. రేషన్‌ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో విజిలెన్స్‌ అధికారులకు భారీగా రేషన్‌ బియ్యం పట్టుబడడం చర్చనీయాంశమవుతోంది. కొత్తూరు మండలం కడుమ నుంచి ఈ బియ్యం అక్రమ రవాణా సాగుతున్నట్టు అధికారులు గుర్తించడంతో అక్రమార్కుల్లో గుబులు రేగుతోంది. ప్రభుత్వం గతంలో రేషన్‌కార్డుదారులకు కిలో రూపాయి చొప్పున బియ్యం అందజేసేది. కరోనా వ్యాప్తి సమయం నుంచి ఒక్కో కార్డుదారుడికి ప్రతీనెలా ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తోంది. చాలా మంది లబ్ధిదారులు సన్నబియ్యానికి అలవాటు పడి.. వీటిని వినియోగించడం లేదు. రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.20 నుంచి రూ.22 చొప్పున వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీటిని ఆయా వ్యాపారులు.. మిల్లర్లుకు గంపగుత్తుగా మరికొంత లాభం వేసుకుని విక్రయిస్తున్నారు. ఆ చౌక బియ్యాన్ని మిల్లర్లు ఇతర రాష్ట్రాలకు పంపి.. దర్జాగా డబ్బులు సంపాదిస్తున్నారు. రెండేళ్ల కిందట ఎల్‌.ఎన్‌.పేట మండలం స్కాట్‌పేట నుంచి ఏకంగా ఆర్టీసీ పార్శిల్‌ వాహనంలోనే తరలిస్తున్న పీడీఎస్‌ రైస్‌ను విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదులో చూపించిన ఉత్సాహం.. ఆ తర్వాత ఏమైందో.. నిందితులకు శిక్ష పడిందా? లేదా అన్నదీ అధికారులు వెల్లడించడంలేదు. ఇప్పుడు పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద పట్టుబడిన చౌకబియ్యం కడుమ మిల్లు నుంచి వచ్చాయని విజిలెన్స్‌ అధికారులే ప్రకటించారు. కాగా అసలు ఆ బియ్యం ఎక్కడ నుంచి కొనుగోలు చేశారు..? వాటిని రీసైక్లింగ్‌ ఎక్కడ జరిగింది..? అలాగే.. లారీతో బియ్యం తరలింపుతో మూడు రకాల బిల్లులను ఎందుకు ఇచ్చారు..? దీనివెనుక ఉన్న వ్యక్తులకు రాజకీయ నాయకులతో లింకులేమిటన్నది తేలాల్సి ఉంది. కొంతమంది మిల్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి వెనుక ఉంటూ.. ఇటువంటి వ్యాపారాలకు తెరతీస్తున్నారు. శనివారం విజిలెన్స్‌ అధికారులు బియ్యాన్ని పట్టుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించేశారు. ఆ తర్వాత సీఎస్‌డీటీ(కొత్తూరు) ఆధ్వర్యంలో కడుమ మిల్లులో తనిఖీలు నిర్వహించారు. కొంతమంది నుంచి.. మరొక మిల్లు రెన్యువల్‌ ముగిసిందని.. అందుకే ఇక్కడ నుంచి పంపుతున్నామంటూ మిల్లర్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వీటన్నింటినీ అధికారులు నమోదు చేసుకున్నారు. కానీ ఈ కేసును నీరుగార్చేందుకుగాను.. సదరు మిల్లరు బడానాయకుల వద్దకు వెళ్లి మంతనాలు చేసినట్టు సమాచారం. జిల్లాలో అప్పుడప్పుడు రేషన్‌ బియ్యం భారీగా పట్టుబడటం.. ఆతర్వాత మొక్కుబడిగా విచారణ జరిగేలా.. చేయడం షరామామూలేనన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా పట్టుబడిన బియ్యం కేసు కూడా ఇలానే ఉంటుందా..? అక్రమార్కులపై చర్యలు తీసుకుంటారా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పీడీఎస్‌ బియ్యం రవాణా సూత్రధారులపై కఠిన చర్యలుంటేనే అక్రమాలకు చెక్‌ పడుతుందని పలువురు భావిస్తున్నారు.

  • 700 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

  • పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద శ్రీకాకుళం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శనివారం తనిఖీ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుమ నుంచి ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌కు వెళ్తున్న లారీ(ఏపీ39-యూయూ-4289)లో ఏకంగా 34,800 కిలోల పీడీఎస్‌ బియ్యం (700 బస్తాలు) పట్టుబడ్డాయి. వీటి విలువ రూ. 15,83,400 ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కొత్తూరు మండలం కడుమలో గోవిందరావుకు చెందిన రైస్‌మిల్లు నుంచి ఈ బియ్యం సరఫరా అయినట్లు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని లారీతో సహా స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈసీ 6(ఏ), 7(1) సెక్షన్‌ కింద రైస్‌ మిల్లు యజమాని గోవిందరావు, లారీడ్రైవర్‌ మానేపల్లి వెంకటేష్‌పై కేసు నమోదు చేయాలని, వీరిపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకోవాలని సివిల్‌ సప్లయ్‌ డిప్యూటీ తహసీల్దార్‌కు రాతపూర్వకంగా తెలియజేశారు. ఎస్‌ఐ రామారావు, పోలీసు కానిస్టేబుళ్లు పురుషోత్తమ్‌, తిరుపతిరావు, రెవెన్యూ అధికారి హేమలత, పాచిపెంట సీఎస్‌డీటీ తనిఖీల్లో పాల్గొన్నారు.

Updated Date - Jul 12 , 2025 | 11:52 PM