ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎన్నాళ్లీ కష్టాలు?

ABN, Publish Date - Aug 01 , 2025 | 12:18 AM

ఆ గ్రామం వంశధార నదీ తీరంలో ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే వరదలతో ఆ ఊరుకు మూడు నెలలపాటు రాకపోకలు నిలిచిపోతాయి.

కడపలగెడ్డపై నిలిచిన బ్రిడ్జి పనులు

- కడపల గెడ్డపై పూర్తికాని బ్రిడ్జి నిర్మాణం

- మూడు నెలలపాటు నత్తనడకన పనులు

- కాంట్రాక్టర్‌ తీవ్ర నిర్లక్ష్యం

- ప్రస్తుతం గెడ్డలో ప్రవహిస్తున్న వరద

- దబ్బపాడు గ్రామస్థులకు తప్పని ఇబ్బందులు

ఎల్‌.ఎన్‌.పేట, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఆ గ్రామం వంశధార నదీ తీరంలో ఉంటుంది. వర్షాకాలం వచ్చిందంటే వరదలతో ఆ ఊరుకు మూడు నెలలపాటు రాకపోకలు నిలిచిపోతాయి. ఆ గ్రామ ప్రజలు అత్యవసర సమయాల్లో పట్టణాలకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సిందే. కడపల గెడ్డపై బ్రిడ్జి నిర్మిస్తే తమ కష్టాలు తీరుతాయని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నోసార్లు వినతులు అందించినా ఫలితం శూన్యం. గత వైసీపీ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసినా పనులు మాత్రం చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వంతెన పనులు ప్రారంభించారు. కానీ, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో ఇప్పటికీ బ్రిడ్జి పూర్తికాలేదు. దీంతో ఆ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ మండలంలోని దబ్బపాడు గ్రామస్థుల దయనీయ పరిస్థితి.

ఇదీ పరిస్థితి..

ప్రతిఏటా వర్షాకాలంలో వంశధార నదికి వరదలు వస్తుంటాయి. ఈ వరదకు కొండ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీరు తోడైతే తురకపేట-దబ్బపాడు గ్రామాల మధ్యఉన్న కడపల గెడ్డకు వరద పోటెత్తుతుంది. గెడ్డలోని నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంటుంది. దీంతో దబ్బపాడు గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అత్యవసర సమయాల్లో ఆ గ్రామస్థులు వాడవలస, మిరియాపల్లి, లక్ష్మీనర్సుపేట గ్రామాల మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. దీనికోసం సుమారు ఐదారు కిలోమీటర్లు ప్రయాణించి ఎల్‌ఎన్‌పేట జంక్షన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డుకు చేరుకోవాల్సి వస్తుంది. దీనివల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో వైద్యసేవలందక ప్రాణాలను సైతం కోల్పోవలసి వస్తుందని గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

నత్తనడకన పనులు..

తురకపేట-దబ్బపాడు గ్రామాల మధ్యఉన్న కడపల గెడ్డపై బ్రిడ్జి నిర్మిస్తామని గత వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. దీనికోసం అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆర్భాటంగా శంకుస్థాపన కూడా చేశారు. కానీ, నిధులు మాత్రం మంజూరు చేయకపోవడంతో పనులు జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కడపల గెడ్డపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.67 లక్షలు ఎస్‌డీఎంఎఫ్‌ నిధులు మంజూరు చేసింది. దీంతో స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఈ ఏడాది ఏప్రిల్‌ 29న శంకుస్థాపన చేయడంతో దబ్బపాడు గ్రామస్థుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బ్రిడ్జి నిర్మాణం జరిగి వర్షాకాలంలో తమఇక్కట్లు తీరిపోతాయని ఎంతో సంబరపడిపోయారు. కానీ, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం కారణంగా సుమారు మూడు నెలల పాటు నత్తనడకన పనులు జరగడంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకుతోడు వంశధార కుడిప్రధాన కాలువ దిగువున ఉన్న ఆయకట్టుకు పిల్లకాలువల ద్వారా నీరు వస్తుండడంతో కడపల గెడ్డలో నీరుపొంగి ప్రవహిస్తుంది. దీంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి వరకూ కడపల గెడ్డలో నీరు ప్రవహిస్తుంది. బ్రిడ్జి పనులు మళ్లీ ప్రారంభించాలంటే మార్చి వరకు ఆగాల్సిందే. అప్పటివరకు తమకు కష్టాలు తప్పవని దబ్బపాడు గ్రామస్థులు వాపోతున్నారు.

కాంట్రాక ్టర్‌ నిర్లక్ష్యం చేశారు..

కడపల గెడ్డపై బ్రిడ్జి పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం చేశారు. నెల రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. కానీ, మూడు నెలలు అవుతున్నా పూర్తి చేయలేదు. సంబంధిత అధికారులు కూడా పట్టించుకోలేదు.

-జమ్మి మోహనరావు, మాజీ సర్పంచ్‌, దబ్బపాడు

Updated Date - Aug 01 , 2025 | 12:18 AM