తీరం భద్రత ఎలా?
ABN, Publish Date - Aug 01 , 2025 | 12:15 AM
జిల్లాలో సముద్ర తీర ప్రాంత భద్రతపై ఆందోళన నెలకొంది.
- జిల్లాలో మెరైన్ పోలీస్‌స్టేషన్ల కొరత
- జాడలేని కొత్త స్టేషన్లు
- జూన్ నుంచి సెప్టెంబరు వరకూ విపత్తులు
- మత్స్యకారుల రక్షణకు ఇక్కట్లు
ఇచ్ఛాపురం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సముద్ర తీర ప్రాంత భద్రతపై ఆందోళన నెలకొంది. 11 మండలాల్లో 193 కిలోమీటర్ల తీర ప్రాంతం విస్తరించి ఉన్నా అందుకు తగ్గట్లు మెరైన్ పోలీసు స్టేషన్లు లేవు. కేవలం మూడు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లే ఉన్నాయి. దాదాపు 120 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 20 మందికి మించి లేరు. దీంతో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సంరక్షించడం వారికి కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం వర్షాకాలం కావడం, ఈ ఏడాది బంగాళాఖాతంలో విపత్తులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో తీర ప్రాంత భద్రతపై అనుమానాలు, ఆందోళనలు కలుగుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాలోని రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లో తీర ప్రాంతం ఉంది. రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల మేర తీరం విస్తరించి ఉంది. దీనిపరిధిలో 143 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మారుమూల కుగ్రామాలు 20 వరకూ ఉన్నాయి. వందలాది కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతంలో ఉన్నది మూడే మెరైన్ పోలీస్‌స్టేషన్లు. మెరైన్ పోలీస్‌స్టేషన్లు పెంచుతామని ప్రభుత్వ ప్రకటన ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఒక్కో స్టేషన్ పరిధిలో మూడు నుంచి నాలుగు మండలాలు ఉండడం దారుణం. వాస్తవానికి ఒక కానిస్టేబుల్‌కు ఒక గ్రామం చొప్పున బాధ్యతలు అప్పగించాలి. కానీ, ఐదు నుంచి పది గ్రామాల బాధ్యతను ఒక్కో కానిస్టేబుల్‌కు అప్పగిస్తున్నారు. ఏటా భారీ తుఫాన్‌లు సంభవిస్తుంటాయి. ఆ సమయంలో మత్స్యకారులను అప్రమత్తం చేయడం.. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించడం వారికి ఇబ్బందికరంగా మారుతోంది.
ఆ మూడుచోట్ల ఏర్పాటు..
జిల్లాలో కళింగపట్నం, భావనపాడు, బారువలో మెరైన్ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. సముద్ర తీరంలో 12 నాటికల్ మైళ్ల దూరం వరకూ నిరంతర భద్రతా చర్యలు పర్యవేక్షించాలి. విదేశీ మత్స్యకారులు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకోవాలి. నావీ విభాగానికి సమాచారం అందించాలి. కానీ, సిబ్బంది లేకపోవడం ఒక ఎత్తు అయితే.. విధి నిర్వహణకు అవసరమైన మరబోట్లు, అత్యాధునిక పరికరాలు లేకుండా పోయాయి. దీంతో సిబ్బందిపడుతున్న బాధలు వర్ణనాతీతం. గతంలో సమకూర్చిన మరబోట్లు, పరికరాలు తితలీ తుఫాన్ సమయంలో పాడయ్యాయి. వాటి స్థానంలో కొత్తవాటిని సమకూర్చలేదు.
పరిధి ఎక్కువ.. సిబ్బంది తక్కువ
-బారువ మెరైన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, మందస మండలాలు ఉన్నాయి. 36 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు, మరో ఐదు శివారు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 42 మంది కానిస్టేబుళ్లకుగాను 9 మంది మాత్రమే ఉన్నారు. ఇతర సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో శివారు మండలాల్లో విధుల నిర్వహణ సిబ్బందికి కష్టతరంగా మారుతోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి మందస మండలం గంగువాడ వరకూ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది.
-భావనపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో 63 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మరో ఏడు శివారు గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 82 మంది సిబ్బంది ఉండాలి. కానీ కేవలం 29 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు, అరకొర వసతులతో తీర ప్రాంత రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది.
- కళింగపట్నం పరిధిలో గార, శ్రీకాకుళం, రణస్థలం, ఎచ్చెర్ల మండలాల్లో 43 తీర ప్రాంత రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ 48 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వహించాల్సి ఉండగా.. కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
Updated Date - Aug 01 , 2025 | 12:15 AM