Iranian government: ఎలాగున్నాడో.. ఎప్పుడొస్తాడో?
ABN, Publish Date - Apr 19 , 2025 | 12:11 AM
Iranian government: ఇరాన్‌లో బందీగా మారిన భర్త కోసం భార్య, కుటుంబీకులు అల్లాడిపోతున్నారు. తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా విడిచిపెట్టకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
- భర్త కోసం భార్య, కుటుంబీకుల ఎదురుచూపు
- ఇరాన్ ప్రభుత్వ ఆధీనంలో గార్లపాడు వాసి
- షిప్‌లో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్న వైనం
- తొమ్మిది నెలలుగా అక్కడే బందీగా..
ఎల్.ఎన్.పేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌లో బందీగా మారిన భర్త కోసం భార్య, కుటుంబీకులు అల్లాడిపోతున్నారు. తొమ్మిది నెలలు అవుతున్నా ఇంకా విడిచిపెట్టకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎలాగున్నాడో.. ఎప్పుడొస్తాడో అని కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇదీ మండలంలోని గార్లపాడు ఆర్‌అండ్‌ఆర్‌కాలనీకి చెందిన పతివాడ వెంకటరావు కుటుంబ పరిస్థితి.
ఇదీ జరిగింది..
వెంకటరావు దుబాయ్‌కు చెందిన ఓ కంపెనీ షిప్‌లో కెప్టెన్‌గా ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. గతేడాది జనవరి 24న దుబాయ్ నుంచి షిప్‌లో క్రూడాయిల్‌ను తీసుకుని ఇరాన్ వెళ్లాడు. అయితే, ఓవర్ లోడ్‌తో షిప్ వచ్చిందని ఇరాన్ ప్రభుత్వం ఆ షిప్‌ను స్వాధీనం చేసుకుంది. అప్పటికి షిప్‌లో సుమారు 14 మంది ఉద్యోగులు ఉన్నారు. వెంకటరావు కెప్టెన్‌గా ఉండడంతో ఆయన్ను అదుపులోకి తీసుకుని మిగిలిన వారిని విడిచిపెట్టింది. వెంకటరావును విడిచిపెట్టాలంటే షిప్ యజమానిని తమకు అప్పజెప్పాలని, లేదా అపరాధ రుసుమైనా చెల్లించాలని ఇరాన్ ప్రభుత్వం షరతు విధించింది. మరో 15 రోజుల్లో వెంకటరావు షిప్ దిగిపోతాడన్న సమయంలో దాని యజమాని ఆ షిప్‌ను వేరొకరికి విక్రయించాడు. నూతన యజమాని షిప్‌ను విడిపించేందుకు సుముఖత చూపటంలేదు. మొదటి యజమాని సైతం పట్టించుకోవడం లేదు. దీంతో 9 నెలలుగా ఇరాన్ ప్రభుత్వ బందీగా వెంకటరావు ఉండిపోయాడు. ఈ విషయాన్ని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర పౌరవిమానయానాశాఖమంత్రి కింజరాపు రామ్మోన్‌నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దృష్టికి వెంకటరావు కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇరాన్ ప్రభుత్వం నుంచి వెంకటరావును విడిపించాలని వినతిపత్రాలు అందించారు. దీంతో ఆయన్ను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారని, అయినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదని వెంకటరావు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. వెంకటరావు రాకకోసం భార్య స్వాతి, తల్లిదండ్రులు సిమ్మన్న, చిన్నమ్మడు, ఇతర కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
పాపను ఎత్తుకొని విచారిస్తున్న స్వాతి
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
నా భర్త వెంకటరావు ఇంటి నుంచి వెళ్లి ఏడాదిన్నర కావస్తుంది. నేను 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు దుబాయ్ వెళ్లాడు. ఇప్పుడు పాప పుట్టి సుమారు 8 నెలలు అవుతుంది. నా భర్త ఇంటికి సంతోషంగా వస్తాడనుకున్న సమయంలో ఇరాన్ ప్రభుత్వ బందీగా మారాడు. అప్పటి నుంచి తీవ్ర మానసికక్షోభ అనుభవిస్తున్నా. ప్రభుత్వం జోక్యం చేసుకుని నా భర్తను ఇరాన్ ప్రభుత్వం నుంచి విడిపించాలి.
- స్వాతి, వెంకటరావు భార్య.
Updated Date - Apr 19 , 2025 | 12:11 AM