పుచ్చుపోయి.. పురుగుపట్టి
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:57 PM
: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న నిత్యావసరాల సరుకుల్లో నాణ్యత కొరవడుతుంది.
- అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం కందిపప్పు సరఫరా
- కానరాని అధికారుల తనిఖీలు
- లబ్ధిదారులకు తప్పని ఇబ్బందులు
ఇచ్ఛాపురం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న నిత్యావసరాల సరుకుల్లో నాణ్యత కొరవడుతుంది. పౌర సరఫరాల స్టాక్ పాయింట్ల నుంచి పుచ్చుపోయిన, పురుగు పట్టిన కంది పప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల గర్భిణిలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాంగం నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతివాటం తదితర కారణాలతో నాణ్యతలేని సరుకులను సరఫరా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇదీ పరిస్థితి..
జిల్లాల్లో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,385 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 6,020 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు సేవలందిస్తున్నారు. గర్భిణిలు, బాలింతలు 18,422 మంది ఉన్నారు. వీరికి ప్రతి నెలా 3 కిలోల బియ్యం, నూనె అర కిలో, కంది పప్పు కిలోను అంగన్‌వాడీ కార్యకర్తలు అందిస్తుంటారు. ఈ సరుకులను ఓ సంస్థ సరఫరా చేస్తోంది. వీటినే అంగన్‌వాడీ కేంద్రాల్లో వండి పిల్లలకు పౌష్టికాహారంగా మధ్యాహ్న భోజనం పెడుతుంటారు. అయితే, బియ్యం, నూనె బాగుంటున్నా కందిపప్పు మాత్రం నాసిరకంగా ఉంటుందని గర్భి ణిలు, బాలింతలు చెబుతున్నారు. పురుగులతో పాటు ఎక్కువ పుచ్చులు ఉంటున్నాయని, సరిగ్గా ఉడకడం లేదని ఆవేదన చెందుతున్నారు. దీంతో దాన్ని వినియోగించడం లేదని అంటున్నారు. పప్పు పురుగు పట్టడంతో వాటిని శుభ్రపరచటానికి అంగన్‌వాడీ ఆయాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పప్పు ఉడకపోవడంతో పాటు రుచిగా ఉండడం లేదని, దీనివల్ల పిల్లలు తినడం లేదని అంగన్‌వాడీ కార్యకర్తలు అంటున్నారు.
తనిఖీలేవీ?
జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, జలుమూరు, జి.సిగడాం, ఇచ్ఛాపురం, కంచిలి, కోటబొమ్మాళి, కొత్తూరు, లావేరు, మెళియాపుట్టి, పలాస, సరుబుజ్జిలి, టెక్కలిలో స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చిన కందిపప్పుతో పాటు ఇతర నిత్యావసరాలను విధిగా అధికారులు తనిఖీ చేయాలి. బాగుంటేనే అంగన్‌వాడీ కేంద్రాలకు అందించాలి. కానీ, జిల్లాలో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి నాణ్యతలేని కందిపప్పు లారీల్లో స్టాక్ పాయింట్లకు వచ్చింది. దీన్ని అధికారులు తనిఖీ చేసి తిప్పి పంపారు. అనంతరం నాణ్యమైన కందిపప్పును తీసుకువచ్చారు. దీంతో కొద్దినెలల పాటు నాణ్యమైన పప్పును అంగన్‌వాడీ కేంద్రాలకు అందించారు. తరువాత అధికారుల తనిఖీలు, పర్యవేక్షణ కరువు అవడంతో పుచ్చు కందిపప్పు సరఫరా అవుతోంది. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నాణ్యత లేకుంటే చర్యలు
అంగన్‌వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. సిబ్బందిని క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేస్తున్నాం. ఆహారంలో నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటున్నాం. అంగన్‌వాడీ కేంద్రాలకు పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఎక్కడైనా నాసిరకం అనితేలితే వాటిని తిప్పి పంపుతున్నాం.
-శాంతిశ్రీ, ఐసీడీఎస్ పీడీ, శ్రీకాకుళం
Updated Date - Jul 30 , 2025 | 11:57 PM