mavoist leader: ఆయన జీవితమే.. ఉద్యమం
ABN, Publish Date - May 22 , 2025 | 12:21 AM
Nambala Kesava Rao encounter ఆర్‌ఎస్‌యూ భావజాలాలకు ఇష్టపడి.. ఆ తరువాత సీపీఐఎంఎల్‌లో చేరి.. మావోయిస్టు పార్టీలో కమాండర్ ఇన్ ఛీప్‌గా ఎదిగిన నంబాల కేశవరావు(71) అలియాస్ గంగన్న, బసవరాజు సుమారు ఐదు దశాబ్దాలు ఉద్యమాలకే అంకితమయ్యారు. ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు రథసారధి కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో కోటబొమ్మాళి మండలంలో ఆయన స్వగ్రామమైన జీయన్నపేట మూగబోయింది.
- జిల్లా కమిటీ నుంచి కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎదిగిన నంబాల కేశవరావు
- మావోయిస్టు పార్టీలో గంగన్న, బసవరాజుగా పిలుపు
- ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్
- స్వగ్రామంలో జీయన్నపేటలో విషాదఛాయలు
టెక్కలి, మే 21(ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎస్‌యూ భావజాలాలకు ఇష్టపడి.. ఆ తరువాత సీపీఐఎంఎల్‌లో చేరి.. మావోయిస్టు పార్టీలో కమాండర్ ఇన్ ఛీప్‌గా ఎదిగిన నంబాల కేశవరావు(71) అలియాస్ గంగన్న, బసవరాజు సుమారు ఐదు దశాబ్దాలు ఉద్యమాలకే అంకితమయ్యారు. ఛత్తీ్‌సగఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు రథసారధి కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో కోటబొమ్మాళి మండలంలో ఆయన స్వగ్రామమైన జీయన్నపేట మూగబోయింది. సిక్కోలులో పుట్టిన ఆయన.. మావోయిస్టు ఉద్యమనేతగా ఎదిగారు. నౌపడా ఆర్‌ఎస్ ఎట్ తలగాం హైస్కూల్‌లో ఎనిమిది, తొమ్మిది, పది తరగతులు చదివారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశారు. అనంతరం ఇంజనీరింగ్ కోసం వరంగల్‌లోని ఆర్‌ఈసీలో చేరారు. ఎంటెక్ కూడా కొంతకాలం అక్కడే చదువుకున్నారు. అదేసమయంలో 1980లో అక్కడ మెస్‌లో జరిగిన ఓ గొడవలో ఒకరు చనిపోయారు. కేశవరావు అప్పటికే ఆర్‌ఎస్‌యూ భావజాలాలను అందుకున్నారు. ఎంటెక్ చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి.. నక్సల్‌బరి ఉద్యమంలో చేరారు. అదే ఏడాది జీయన్నపేటలో తన మిరప పొలానికి నూతిలోని నీరు తోడుతుండగా.. మెస్‌లో జరిగిన హత్య కేసుకు సంబంధించి పోలీసులు రాగా, సమీప కొండల్లోకి కేశవరావు పారిపోయారు. కొద్దిరోజుల తర్వాత చింతపల్లి అడవుల్లో పోలీసులకు చిక్కగా ఆయనను విశాఖ సెంట్రల్‌జైల్‌కు తరలించారు. ఆ సమయంలో కామ్రేడ్ చౌదరి తేజేశ్వరరావుతో కలిసి ఆయన జైల్‌లో గడిపాడు. ఓ న్యాయవాది సహాయంతో బెయిల్‌పై బయటకు వచ్చిన కేశవరావు.. ఆ తరువాత నుంచి ఇంటి ముఖం చూడలేదు. సాయుధ పోరాటమే ఊపిరిగా సుమారు 45ఏళ్లు అజ్ఞాత జీవనాన్ని గడిపారు.
రూ.1.50కోట్ల రివార్డు..
కేశవరావు.. అలియాస్ గంగన్నగా, రాష్ట్రకమిటీ సభ్యుడైన తరువాత బసవరాజుగా మావోయిస్టు పార్టీలో పిలవబడి ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించాడు. మొదటిగా సీపీఐఎంఎల్‌లో తూర్పుగోదావరి జిల్లా సభ్యుడిగా, రాష్ట్రకమిటీ సభ్యుడిగా, ఆ తరువాత మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీ సభ్యుడిగా ఎదిగాడు. 2018లో అప్పటి మావోయిస్టు కేంద్ర ప్రధానకార్యదర్శి లక్ష్మణరావు అనారోగ్యంతో రాజీనామా చేశారు. అనంతరం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేశవరావు బాధ్యతలు స్వీకరించారు. కేశవరావు కొన్నాళ్లు ఎల్‌టీటీఈలో కూడా శిక్షణ పొందాడు. గెరిల్లా, మిలటరీ సాంకేతిక వ్యూహాల్లో దిట్ట. అనేక దాడుల్లో పాలుపంచుకున్నారు. అందుకే కేశవరావు తలకు మొదట రూ.10లక్షలతో రివార్డు ప్రారంభమై చివరికి కోటిన్నర రూపాయల వరకు చేరింది.
ఉపాధ్యాయ కుటుంబంలో పుట్టి..
జీయన్నపేటకు చెందిన వాసుదేవరావు, భారతమ్మ దంపతులకు 1955లో కేశవరావు జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడు. తల్లి భారతమ్మ గృహిణి. ఈయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. పెద్దన్నయ్య ఢిల్లేశ్వరరావు, తమ్ముడు రాంప్రసాద్ విశాఖలో ఉంటున్నారు. ఒక సోదరి హనుమంతు ఉష విజయవాడలో ఉండగా.. మరో సోదరి జలజాక్షి మెళియాపుట్టి మండలం శేఖరాపురంలో నివసిస్తోంది. ఇంకో సోదరి సత్యవతి హైదరాబాద్‌లో ఉంటున్నారు. విశాఖ సెంట్రల్‌జైల్‌లో కేశవరావు ఉన్న సమయంలో తండ్రి వాసుదేవరావు అప్పుడప్పుడూ వెళ్లి కలుస్తూండేవారు. ఉద్యమాల్లో చేరిన తర్వాత కేశవరావు స్వగ్రామానికి ఎప్పుడూ రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు. కేశవరావుకు సంబంధించి ఇంట్లో ఉన్న ఫొటోలు అన్నీ కాల్చేయడంతో ఆయన ఆచూకీ పెద్దగా గుర్తించలేకపోయారు. కేశవరావు చదువుకుంటున్న రోజుల్లో గల ఒక ఫొటోను ఇన్నాళ్లు పోలీసులు అలియాస్ గంగన్న, బసవరాజుగా చూపించారు. గత ఏడాది అక్టోబరు 10న ఛత్తీ్‌సగఢ్ పరిధి అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతిచెందాడని ప్రచారం జరిగింది. అయితే దీన్ని పోలీసులు, మావోయిస్టులు ఎవరూ ధ్రువీకరించలేదు. ఈసారి నారాయణపూర్ జిల్లా అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో కేశవరావు మృతిచెందాడని తెలవడంతో జీయన్నపేటలో విషాదఛాయలు కనిపించాయి. వాస్తవానికి కేశవరావు మావోయిస్టు చీఫ్‌గా వ్యవహరిస్తుండడం వలన మూడంచెల భద్రత ఉంటుంది. తొలి అంచెలో పీఎల్‌జీఏ సెక్యూరిటీ, రెండో అంచెలో సీ6 యూనిట్, మూడో దశలో రెగ్యులర్ దళాలు రక్షణగా ఉంటాయి. మొత్తంగా కేశవరావు మృతి వారి కుటుంబ సభ్యుల్ని అడిగితే తమకేమీ సమాచారం లేదంటున్నారు. ఆ గ్రామస్థులు కొందర్ని ప్రశ్నిస్తే టీవీల్లో చూడడం, పేపర్లలో చదవడం తప్ప ఆయన గురించి తమకేమీ తెలియదంటున్నారు.
Updated Date - May 22 , 2025 | 12:21 AM