Death mistery: జీడితోటలో సగంకాలిన మృతదేహం
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:55 PM
Half-burnt body.. Suspicious death ప్రశాంతంగా ఉండే మందస ఉద్దానం ప్రాంతంలో.. పాత జాతీయ రహదారికి సమీపాన జీడితోటలో సగం కాలిన ఓ వివాహిత మృతదేహం కనిపించడంతో అలజడి రేగింది.
అనుమానాస్పదస్థితిలో వివాహిత మృతి
పక్కా ప్లాన్‌తో హత్య చేశారని ఆరోపణ
విభిన్న కోణాల్లో పోలీసుల దర్యాప్తు
హరిపురం, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ప్రశాంతంగా ఉండే మందస ఉద్దానం ప్రాంతంలో.. పాత జాతీయ రహదారికి సమీపాన జీడితోటలో సగం కాలిన ఓ వివాహిత మృతదేహం కనిపించడంతో అలజడి రేగింది. ఐదు రోజుల కిందట ఆమె అదృశ్యం కాగా.. సోమవారం విగతజీవిగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం కాగా.. ఎవరో ఆమెను హత్య చేసి ఉంటారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు సంబంధించి మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన వివాహిత ముంజేటి రాజేశ్వరి(23) సోమవారం అంబుగాం పాత జాతీయరహదారి సమీపాన లోహరిబంద పంచాయతీ కొత్తపేట జీడితోటల్లో విగతజీవిగా కనిపించింది. సగం కాలిన మృతదేహాన్ని స్థానికులు గుర్తింగి పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్వరికి పాలవలసకు చెందిన గోకర్ల చంద్రశేఖర్‌తో ఐదేళ్ల్ల కిందట వివాహమైంది. మూడేళ్లు, ఐదు నెలల చిన్నారులు ఉన్నారు. చంద్రశేఖర్ వలస కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ నెల 11న రాజేశ్వరి కన్నవారింటి నుంచి అత్తవారింటికి పాలవలస బయలుదేరింది. హరిపురంలో బంధువులు ఆమెను బస్సు ఎక్కించారు. కాగా ఆ రోజు రాత్రి ఆమె పాలవలస చేరుకోకపోవడంతో ఇరు కుటుంబ సభ్యులూ ఆందోళన చెందారు. రాజేశ్వరి ఆచూకీ కనిపించడం లేదంటూ మందస పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం జీడితోటల్లో సగం కాలిన వివాహిత మృతదేహం లభ్యం కాగా.. సమీపంలో సెల్‌ఫోన్ కూడా దొరకడంతో దాని ఆధారంగా.. ఆమె రాజేశ్వరి అని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు, సీఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ పరిశీలించారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీమ్‌ను తెప్పించి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వాసుత్రికి తరలించారు. కాగా, ఎవరో పథకం ప్రకారమే రాజేశ్వరిని హత్య చేసి.. కాల్చేసి జీడితోటల్లో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాలవలసలో సంబరాలు నిర్వహించగా.. అదేసమయంలో ఆ గ్రామానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం రాజేశ్వరి హత్యకి, ఆ యువకుడి హత్యకు సంబంధం ఉంటుందా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్ తెలిపారు.
Updated Date - Jun 16 , 2025 | 11:55 PM