Flyover : రణస్థలంలో ఫ్లైఓవర్
ABN, Publish Date - May 02 , 2025 | 11:47 PM
Flyover construction ఎట్టకేలకు రణస్థలంలో జాతీయ రహదారి ఆరులేన్ల వంతెన పనులకు సంబంధించి ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు విచ్చేసిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
అమరావతి వేదికగా ప్రధాని మోదీ శంకుస్థాపన
ఊపందుకోనున్న నిర్మాణ పనులు
రణస్థలం, మే 2(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు రణస్థలంలో జాతీయ రహదారి ఆరులేన్ల వంతెన పనులకు సంబంధించి ప్రధాని మోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు విచ్చేసిన ప్రధాని మోదీ.. రాష్ట్రంలో వివిధ జాతీయ రహదారులకు సంబంధించి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా రణస్థలంలో రూ.252కోట్ల నిర్మాణంతో ఐదు కిలోమీటర్లకుపైగా ఫ్లైఓవర్, విస్తరణ పనులకు అమరావతి వేదికగా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. మొత్తం ఐదు కిలోమీటర్లకుపైగా ఇక్కడ రోడ్డు విస్తరణ జరగనుంది. అందులో దాదాపు 2 కిలోమీటర్ల మేర ఓపెన్ ఫ్లైఓవర్ ఉండనుంది. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఆశీలుమెట్ట తరహాలో భారీ స్తంభాలతో వంతెన ఇక్కడ ఏర్పాటు కానుంది. కొద్దిరోజుల కిందట ఇక్కడ ఫ్లైఓవర్, విస్తరణకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. స్థానికుల అభ్యంతరాలతో వివాదాలు జరిగాయి. వారికి స్థానిక తహసీల్దారు కార్యాలయంలో అవగాహన కూడా కల్పించారు. ఇప్పుడు నేరుగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో పనులు ఊపందుకోనున్నాయి.
ఇదీ పరిస్థితి
విశాఖ నుంచి నరసన్నపేట వరకూ దాదాపు 135 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని ఆరు లేన్లగా విస్తరించారు. కానీ రణస్థలం మండల కేంద్రాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. దీనిపై ఆరేళ్లుగా సందిగ్ధం కొనసాగుతోంది. మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. అలాగని ఫ్లైఓవర్ నిర్మించలేదు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రణస్థలం మండల కేంద్రాన్ని తప్పించి బైపాస్ రోడ్డు నిర్మాణానికి 2016లో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, స్థానిక ఎమ్మెల్యే కళా వెంకటరావు కృషి మేరకు... దన్నానపేట నుంచి లావేరు మండలం రావివలస వరకూ 3.5 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మాణానికి నిర్ణయించారు. సుమారు 66ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. భూసేకరణకు కూడా చేపట్టారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెం, ఎచ్చెర్లలో సేకరించిన భూములకు మాదిరిగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. మార్కెట్ ధర ప్రకారం సెంటు భూమికి రూ.2 లక్షలకుపైగా చెల్లిస్తామని ప్రకటించారు. కానీ అప్పట్లో విపక్షంగా ఉన్న వైసీపీ నేతలు ఈ పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై దృష్టి పెట్టిన హైవే అథారిటీ అధికారులు రణస్థలం విషయాన్ని పెండింగ్ పెట్టారు.
మాట మార్చిన వైసీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిహారం విషయంలో ఆ పార్టీ నేతలు మాట మార్చారు. సెంటుకు మొదటి అనుకున్నంత ధర ఇవ్వలేమని 30 శాతం తగ్గించి ఇస్తామని ప్రకటించారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. బైపాస్ నిర్మించాలంటే దాదాపు ఐదుచోట్ల వంతెనల నిర్మాణం చేపట్టాలి. రైతులకు పరిహారం చెల్లించాలి. ఈ మొత్తం లెక్కలు వేసుకున్న హైవే అథారిటీ అధికారులు మాత్రం రణస్థలంలో ఫ్లైఓవర్ నిర్మాణానికే మొగ్గుచూపారు. అప్పటికే రైతుల నుంచి సేకరించిన 66 ఎకరాలను తిరిగి వారికి అప్పగిస్తూ ప్రభుత్వం సైతం ఉత్తర్వులు జారీచేసింది. కొద్దిరోజుల కిందట టెండర్లు పూర్తయ్యాయి. సంబంధింత సంస్థ పనులు కూడా ప్రారంభించింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో రెండేళ్లలో పనులు పూర్తిచేయాలని కేంద్ర జాతీయ రహదారుల సంస్థ భావిస్తోంది.
Updated Date - May 02 , 2025 | 11:47 PM