school meeting: పాఠశాలలకు పండుగ
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:45 PM
School celebrations ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో గురువారం మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
తల్లిదండ్రులకు క్రీడలు, రంగవల్లుల పోటీలు
నరసన్నపేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో గురువారం మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 3,017 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, 165 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 3.04 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. తప్పనిసరిగా సమావేశానికి హాజరుకావాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పటికే ఉపాధ్యాయులు ఆహ్వానం పలికారు. తరగతి గదులను మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించారు. రంగవల్లులతో తీర్చిదిద్దారు. గురువారం విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థి ప్రగతి నివేదికతోపాటు ప్రవర్తన, అభివృద్ధి సామర్థ్యాలపై చర్చిస్తారు. విద్యార్థుల తల్లులకు రంగోలి, లెమన్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేస్తారు. విద్యార్థుల పేరుమీద తల్లిదండ్రులతో మొక్కలు నాటిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ఫొటో బూత్‌లో ఫొటోలు తీసుకుంటారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద పెద్దలందరూ విద్యార్ధులతో కలిసి భోజనం చేయనున్నారు. అలాగే మెగా పేరెంట్స్ డే నాడు రెండో విడత తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.13వేలు చొప్పున జమ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Updated Date - Jul 09 , 2025 | 11:45 PM