ప్రతి కార్యకర్తకూ ప్రాధాన్యం
ABN, Publish Date - Jul 30 , 2025 | 11:54 PM
జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం, ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వెల్లడించారు.
కూటమి పాలనపై ప్రజల్లో సంతృప్తి
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు
శ్రీకాకుళం/క్రైం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకూ సముచిత స్థానం, ప్రాధాన్యం ఇస్తామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలతో శ్రీకాకుళంలో బుధవారం అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు, కూటమి ప్రభుత్వంపై ప్రజల స్పందన, క్షేత్రస్థాయిలో వాస్తవాలను అభిప్రాయాలుగా తెలుసుకున్నారు. అనంతరం నాగబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో చాలా సంతృప్తి ఉందని స్పష్టమైందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేపడుతున్న అభివృద్ధి పనుల ద్వారా రాష్ట్రానికి, కూటమి ప్రభుత్వానికి గౌరవం పెరుగుతోందని వెల్లడించారు. కొద్ది రోజులు అటూ ఇటూ అయినా.. పార్టీ కోసం శ్రమించిన వాళ్లందరికీ పదవులు లభిస్తాయని చెప్పారు. పవన్ కల్యాణ్ వంటి నాయకుడే పదేళ్ల పాటు ఏవిధమైన పదవులు ఆశించకుండా ప్రజాక్షేత్రంలో పనిచేసిన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. పదవుల కేటాయింపుపై పవన్‌కల్యాణ్ చూసుకుంటారని వివరించారు. ఇకపై ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ ఎదుగుదల కోసం అధిక సమయం కేటాయించి పనిచేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో వార్డు స్థాయి, బూత్ స్థాయి నాయకులతో, కార్యకర్తలతో సమావేశం అవుతానని స్పష్టంచేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పేడాడ రామ్మోహన్, గేదెల చైతన్య, దాసరి రాజు, విశ్వక్షేన్, వి దుర్గారావు, కణితి కిరణ్‌కుమార్, బలగ ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 30 , 2025 | 11:54 PM