ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో విడదీస్తే సహించేదిలేదు
ABN, Publish Date - Jul 24 , 2025 | 11:51 PM
ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీస్తే సహించేది లేదని వామపక్ష నేతలు అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 24(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీస్తే సహించేది లేదని వామపక్ష నేతలు అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ.. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో మంత్రి అచ్చెన్నాయుడు చెప్పాలని డిమాండ్ చేశారు. టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు వల్ల రాష్ట్ర, జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రయోజనం ఉందో తెలియజేయా లన్నారు. ఎచ్చెర్లలో 1986లో దళిత కుటుంబాల నుంచి 4 ఎకరాల భూమిని ఎటువంటి ్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుందని, అక్కడ యారక్ బాట్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసి దళిత కుటుంబాలను కార్మికులు, హమాలీలుగా ఉపాధి కల్పించారన్నారు. ఇప్పుడు ఇక్కడ 80 మంది హమాలీలుగా లోడింగ్, అన్ లోడింగ్ పనులు చేస్తూ 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ఇప్పుడు ఈ డిపోను విభజించడం వల్ల వారంతా ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎచ్చెర్ల డిపోను యధావిధిగా కొన సాగించి హమాలీల ఉపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు సంతోష్, కె.సూరయ్య, ఎల్.రామప్పడు, కేదారేశ్వరరావు, ఏపీ బీసీఎల్ హమాలీల యూనియన్ నాయకులు నిడిగంట్ల రమణ, రాము, సొంట్యాన శ్రీనివాసరావు, నవిరి సురేష్, లండ సీతారాం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 24 , 2025 | 11:51 PM