Horticulture: ఉద్యాన సాగుకు ప్రోత్సాహం
ABN, Publish Date - May 31 , 2025 | 12:19 AM
Horticulture promotion రైతులకు దీర్ఘకాలిక ఆదాయం లభించేలా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో బీడు భూములు అధికంగా ఉన్నాయి. నీటి కొరత, చాలామంది రైతులు వలసబాట పట్టడం, పెట్టుబడి పెరగడం, కూలీల కొరత వంటి కారణాలతో వ్యవసాయం చేయడం కష్టతరమైంది.
రైతులకు దీర్ఘకాలిక ఆదాయం లభించేలా..
జిల్లాలో 5,978 హెక్టార్లలో సాగు లక్ష్యం
గ్రామీణ ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉపాధి
పాతశ్రీకాకుళం, మే 30(ఆంధ్రజ్యోతి): రైతులకు దీర్ఘకాలిక ఆదాయం లభించేలా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో బీడు భూములు అధికంగా ఉన్నాయి. నీటి కొరత, చాలామంది రైతులు వలసబాట పట్టడం, పెట్టుబడి పెరగడం, కూలీల కొరత వంటి కారణాలతో వ్యవసాయం చేయడం కష్టతరమైంది. ప్రస్తుతం జిల్లాలో 3,550 హెక్టార్ల బీడు భూములు ఉన్నట్లు అంచనా. ఈ భూములను ఉద్యాన పంటల(తోటల) సాగుకు వినియోగిస్తే.. ఒక్కసారి పెట్టుబడితో ఏళ్ల తరబడి దీర్ఘకాలిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. జిల్లాలో 2025-26 సంవత్సరానికిగాను 5,978 హెక్టార్లలో ఉద్యాన పంటల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా 398 హెక్టార్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా 60 హెక్టార్లు, కేంద్ర ఆయిల్ పామ్ మిషన్ ద్వారా 800 హెక్టార్లలో పామ్‌ఆయిల్ సాగు చేయనున్నారు. జాతీయ వెదురు మిషన్ కింద 10 హెక్టార్లు, పంటల వైవిధ్యీకరణ ద్వారా 100 హెక్టార్లు, ఉపాధిహామీ పథకం ద్వారా రూ.1,260 హెక్టార్లలో తోటల విస్తరణ చేపట్టనున్నారు. అదనంగా కొబ్బరి బోర్డు ద్వారా 300 హెక్టార్లలో కొబ్బరి పంట, దీనితోపాటు 3,550 హెక్టార్ల బీడు భూములను సేద్య యోగ్యంగా వినియోగించాలని అధికారులు నిర్ణయించారు.
అంతర పంటలు కూడా..
తోటల సాగు అంటే కేవలం మామిడి, జీడి, కొబ్బరి మాత్రమే కాకుండా జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లెపూల సాగు, ఆయుర్వేద, సుగంధ తైల మొక్కల సాగు చేయవచ్చు. ఈ పంటలు తక్కువ నీటితో పెరిగే సామర్థ్యం కలిగి.. బీడు భూములకు ఎంతో అనువుగా ఉంటాయి. పదే పదే నాట్లు వేసుకునే అవసరం లేకుండా చాలా ఏళ్ల వరకు ఆదాయం వస్తుంది. వార్షిక పంటలు వేశాక ఆదాయం రావడానికి రైతుకు సమయం పడుతుంది. దీని నుంచి బయటపడేందుకు కూరగాయలు, బొప్పాయి, అరటితోపాటు పసుపు, అల్లం వంటి అంతర పంటలను పండిస్తే అదనపు ఆదాయం పొందవచ్చు. తోటల సాగు వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. మొక్కల పెంపకం, కోత, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ వంటి వివిధ దశల్లో ఉపాధి లభిస్తుంది.
బీడు భూములు.. సస్యశ్యామలం
ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో క్లస్టర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, శీతలీకరణ గదులు ఏర్పాటు చేసి రైతులకు మార్కెట్ లింకేజీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతులు పంటలను నిల్వ చేసుకునేందుకు ఈ శీతలీకరణ గదులు ఉపయోగపడతాయి. వ్యవసాయ రంగంలో స్థిరమైన అభివృద్ధితో బీడు భూములను బంగారు భూములుగా మార్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. ప్రభుత్వం 90శాతం రాయితీపై డ్రిప్ ఇరిగేషన్‌కు స్ర్పింకర్లను అందజేస్తోంది. దీని ద్వారా నీటిని 60 నుంచి 80 శాతం ఆదా చేసుకుని బీడు భూములను సస్యశ్యామలం చేసుకోవచ్చు. అలాగే ఉపాధిహామీ పథకంలో భాగంగా సన్న, చిన్నకారు రైతులు.. తమ పొలంలో నీటి కుంటలను ఏర్పాటు చేసుకుని, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.
ఆర్థిక భద్రతే.. లక్ష్యం
బీడు భూముల్లో ఉద్యాన పంటలను ప్రోత్సహించి.. జిల్లాలో రైతులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యం. ప్రభుత్వం తరపున రైతులకు సహాయ సహకారాలు అందిస్తాం. ఉద్యాన సాగులో సలహాలు, సూచనల కోసం అధికారుల సేవలను వినియోగించుకోవాలి. గ్రామీణ స్థాయిలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి.
- రత్నాల వరప్రసాద్, జిల్లా ఉద్యానవన అధికారి
Updated Date - May 31 , 2025 | 12:19 AM