గడువులోపు సమస్యల పరిష్కారానికి కృషి
ABN, Publish Date - Jul 01 , 2025 | 12:33 AM
ప్రజలు సమస్యలపై ఇచ్చే వినతులను పరిశీలించి నిర్ణీత గడువులోగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పలాస రూరల్, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ప్రజలు సమస్యలపై ఇచ్చే వినతులను పరిశీలించి నిర్ణీత గడువులోగా వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. పలాస ట్రెజరీ కార్యాలయం ఆవరణలో కలెక్టర్ స్వప్నిల్‌దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్).. ‘మీ కోసం’ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్‌స్థాయిలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను స్వీకరించారు. జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఇచ్చినహామీని అమలు చేయాలని ఏపీ రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనరు టి.అజయ్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో ఆస్తుల ఆక్రమణలు తొలగించి బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, పీరుకట్ల విఠల్, బడ్డ నాగరాజు తదితరులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బ్రాహ్మణతర్లాలో సర్వేనెంబరు 56/1లోని కస్పావీధి, పెద్దవీధి, నడిమివీధి, చాకలివీధి, వూన వీధులు ప్రభుత్వం గ్రామకంఠంగా గుర్తించింది. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు జరగక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు పరిశీలించి వాటిని తొలగించాలని జిల్లా ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు వి.యాదగిరి, గ్రామస్థులు ఆళ్ల కృష్ణారావు, వూన రత్నాకర్, సురేంద్ర వినతిపత్రం అందజేశారు. ఇలా చాలామంది పలు సమస్యల పరిష్కారం కోరుతూ వినతిపత్రాలు సమర్పించారు. కలెక్టర్ హాజరుకానున్నారని తెలిసి ఉదయం నుంచీ తహసీల్దార్ కార్యాలయం వద్ద బారులుదీరారు. కలెక్టర్ మాట్లాడుతూ.. భూములు.. స్థలాల ఆక్రమణ, భూముల సరిహద్దుల మార్పు, మ్యూటేషన్స్, లబ్ధిదారుల పేర్లు మార్పు తదితర సమస్యలపై అధికంగా వినతులు వచ్చాయన్నారు. ఈ వినతులు సంబంధిత శాఖ అధికారులు సమగ్రంగా పరిశీలించి.. సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్, ఆర్డీవో జి.వెంకటేష్, తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి, మునిసిపల్ కమిషనర్ రామారావుతో పాటు రెవెన్యూ, మునిసిపల్, సచివాలయం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 01 , 2025 | 12:33 AM