బూర్జ మండల అభివృద్ధికి కృషి
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:47 PM
బూర్జ మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కేంద్రం మంత్రి రామ్మోహన్ నాయుడు
బూర్జ, జూలై 9(ఆంధ్రజ్యోతి): బూర్జ మండలాన్ని అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవం బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాల అభి వృద్ధి విద్యతోనే సాధ్యమన్నారు. మంత్రి లోకేశ్ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అవగాహన కలిగిన వ్యక్తి అని, ఆయన సూచనలతో మండల అభివృద్ధికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేస్తామన్నారు. కొల్లివలసలో ఎంపీ లాడ్స్ నుంచి బస్సు షెల్టర్ నిర్మిస్తామని హామీనిచ్చారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ కొల్లివలస నుంచి నారాయణపురం వరకు రూ.2.5 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. ‘సుపరిపాలనలో తొలి అడుగు’ భాగంగా ఇంటింటికి వెళ్లి ఏడాదిలో చేపట్టిన అభివృద్ధిని వివరించారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ ఆనెపు రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వ్రపసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాములు నాయుడు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:47 PM