డ్వాక్రా సొమ్ము గోల్‌మాల్!
ABN, Publish Date - Jun 13 , 2025 | 12:03 AM
మునిసిపాలిటీ పరిధి లోని డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును ఆర్పీ (రిసోర్స్ పర్సన్) గోల్‌మాల్ చేయడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు.
ఆర్పీ చేతివాటం?
గోప్యం వహిస్తున్న సంబంధిత అధికారులు
ఆందోళనలో మహిళా సంఘాల సభ్యులు
ఆమదాలవలస, జూన్ 12(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధి లోని డ్వాక్రా మహిళల పొదుపు సొమ్మును ఆర్పీ (రిసోర్స్ పర్సన్) గోల్‌మాల్ చేయడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని ఓ మెప్మా ఆర్పీ స్వయంశక్తి సంఘాల సభ్యులు కట్టే పొదుపు సొమ్ము కలెక్షన్ చేసి గత కొన్ని నెలల నుంచి బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా సొంతానికి వా డుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డులోని కొన్ని స్వయం శక్తి సంఘాల నుంచి వసూలు చేసిన సుమారు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల వరకు దారి మళ్లించినట్టు తెలుస్తుంది. గత 15 రోజుల నుంచి డ్వాక్రా మహిళలను ఆ ఆర్పీ తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో తామంతా మోసపోయామని డ్వాక్రా మహిళలు గర్రహించి, ఈ విషయాన్ని స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఉన్న మెప్మా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. అయితే మెప్మా అధికారులు మాత్రం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, ఆర్పీ నుంచి రికవరీ చేసి తిరిగి ఇప్పిస్తామని బాధితులకు నచ్చచెప్పినట్టు భోగట్టా. అంతేకాకుండా డ్వాక్రా మహిళల డబ్బులు దారి మళ్లించిన ఆర్పీను కూడా ఇటీవల కార్యాలయానికి రప్పించి ఈ నెలాఖరు నాటికి పొదుపు డబ్బును బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానని రాతపూర్వకంగా హామీ తీసుకున్నట్టు కొంతమంది అధికారుల ద్వారా తెలుస్తుంది. అయితే ఈ గోల్‌మాల్ ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఉంటుందా? లేక అంతకన్నా ఎక్కువ ఉంటుందా? అన్నది సంబంధిత అధి కారులు లెక్కతేల్చాలని మరికొంతమంది మహిళలు కోరుతున్నట్టు తెలుస్తోంది.
తప్పు చేస్తే చర్యలు తప్పవు
ఈ విషయాన్ని మెప్మా పీడీ ఎస్‌వీ రమణ వద్ద ప్రస్తావించగా.. ఆమదాలవలస పట్టణంలో జరిగిన మెప్మా నిధులు గోల్‌మాల్ విష యం తనకు సమాచారం లేదన్నారు. ఈ విషయం తనదృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Updated Date - Jun 13 , 2025 | 12:03 AM