Infrastructure growth: అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:48 PM
Economic development రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ.. రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
ఎల్.ఎన్.పేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తూ.. రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందజేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎల్.ఎన్.పేట మండలంలోని దబ్బపాడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. సమస్యలకు సంబంధించిన వినతులను ప్రజల నుంచి తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలన్నింటిని సీఎం చంద్రబాబునాయుడు దశలవారీగా నెరవేర్చుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. వైసీపీ పాలనలో స్వార్థ రాజకీయాల కారణంగా రాష్ట్రం ఆర్థికంగా వెనకబడింది. రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది. రాజధాని నిర్మాణానికి సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారు. హామీలన్నింటినీ శతశాతం నెరవేర్చడంతోపాటు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమ’ని స్పష్టం చేశారు. అనంతరం దబ్బపాడు, వాడవలస గ్రామాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. వందశాతం రాయితీపై కంది, మినుము విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, మండలపార్టీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.మనోహర్‌నాయుడు, కె.చిరంజీవి, కూటమి నేతలు ఎ.పోలినాయుడు, వి. ఆనందరావు, వి.గోవిందరావు, ఎస్.తేజేశ్వరరావు, టి.అప్పన్న, జె. మోహనరావులతోపాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 11:48 PM