vamsadhara canal: ఇలాగైతే నీరెలా?
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:09 AM
Vamsadhara Canals Poor Maintenance వంశధార ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాదైనా సక్రమంగా సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి సాగునీటిని విడుదలు చేశారు.
దయనీయంగా వంశధార కాలువలు
కనీస నిర్వహణ లేక ఇబ్బందులు
ఆందోళనలో ఆయకట్టు రైతులు
హిరమండలం, జూలై 3(ఆంధ్రజ్యోతి): వంశధార ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు ఈ ఏడాదైనా సక్రమంగా సాగునీరు అందుతుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం హిరమండలంలోని గొట్టాబ్యారేజీ వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, బగ్గు రమణమూర్తి సాగునీటిని విడుదలు చేశారు. శివారు భూములకు సైతం సాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. కానీ, కాలువలు కనీస నిర్వహణ లేక.. శివారు భూములకు సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ 104 కి.మీ. మేర విస్తరించి ఉంది. హిరమండలం, సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం, వజ్రపుకొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాల్లో 398 గ్రామాల్లో 1,48,200 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. కొన్నేళ్లుగా వంశధార ఎడమ, కుడి ప్రధాన కాలువల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఏటా నీటి ప్రవాహ సామర్థ్యం తగ్గుతూ ఎక్కడో ఒకచోట గండ్లు పడుతున్నాయి. ఎడమ కాలువ ద్వారా 2,480 క్యూసెక్కుల నీటి విడుదల సామర్ధ్యం కాగా, 1,800 క్యూసెక్కులకు మించి నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీంతో శివారు భూములకు సాగునీరు అందడం లేదు. నీటి విడుదల సామర్థ్యం పెంచితే కాలువ గట్లు కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతోంది. 1971-78 మధ్య నిర్మించిన కాలువలు లైనింగ్ లేక చాలావరకు పూడుకుపోయాయి. కొన్నిచోట్ల అండర్‌టన్నెల్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి. షట్టర్లు, గేట్లు, రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. సుమారు 150 రాతి కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. వైసీపీ హయాంలో రెండేళ్ల కిందట ఆధునికీకరణ కోసం రూ.850 కోట్ల అంచనా వ్యయంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మంజూరు కాలేదు. ఎక్కడికక్కడ గట్టు బలహీనమై గండ్లు పడుతుండడంతో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ఎడమ ప్రధాన కాలువతో పాటు పిల్ల కాలువల్లో పూడికలు తొలగించింది. దీంతో కాలువ పరిస్థితి కొంత మెరుగైంది.
పట్టని మరమ్మతులు
గొట్టాబ్యారేజీ 24 గేట్లతోపాటు దానికి అనుసంధానంగా ఉన్న కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ గేట్లకు ఆరేళ్లుగా కనీస నిర్వహణ లేక పాడైపోయాయి. బ్యారేజీ ఎగువన గేట్లు దించినా.. లీకేజీ ద్వారా నీరు వృథాగా పోతోంది. గేట్లకు సంబంధించి బేరింగ్‌లు, రోలర్లు మార్చాల్సి ఉన్నా, గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలోదు. ప్రస్తుతం ప్రభుత్వ ఇంతవరకు నిధులు మంజూరు చేయలేదు. బ్యారేజీ దిగువ భాగాన జడ్జిస్టోన్ ఏప్రాన్ కొన్నేళ్లుగా వస్తున్న వరదలకు పూర్తిగా దెబ్బతింది. ఇంజనీరింగ్ నిపుణుల సూచన మేరకు జడ్జిస్టోన్ ఏప్రాన్ స్థానంలో కాంక్రీట్ ఏప్రాన్ నిర్మించేందుకు ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.8.5కోట్లు నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్ పదిశాతం పనులు చేసి నిలిపివేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. గతంలో 25 శాతంలోపు జరిగిన పనులు రద్దు చేసింది. అప్పటి నుంచి గొట్టాబ్యారేజీ పరిస్థితి దయనీయంగా మారింది. దిగువ సీసీ ఏప్రాన్ తక్షణమే నిర్మించకపోతే వరద సమయంలో బ్యారేజీకి ముప్పు తప్పదని ఇంజనీరింగ్ అధికారులు స్పష్టం చేసున్నారు. ప్రభుత్వం స్పందించి గొట్టాబ్యారేజీ మరమ్మతులకు, కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:09 AM