Maternal deaths: ఇద్దరు బాలింతల మృతి
ABN, Publish Date - Jul 09 , 2025 | 11:50 PM
Healthcare negligence వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. వైద్యురాలి తీరును నిరసిస్తూ మృతదేహాలతో ఆందోళన చేశారు.
డాక్టరు నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన
యలమంచిలి, పాగోడు గ్రామాల్లో విషాదం
జలుమూరు(సారవకోట), జూలై 9(ఆంధ్రజ్యోతి): వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు బాలింతలు మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. వైద్యురాలి తీరును నిరసిస్తూ మృతదేహాలతో ఆందోళన చేశారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జలుమూరు మండలం యలమంచిలికి చెందిన పట్ట అరుణ(23), పాగోడు గ్రామానికి చెందిన నార ధనలక్ష్మి(22) అనే బాలింతలు మంగళవారం రాత్రి శ్రీకాకుళంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిద్దరూ పురిటినొప్పులతో బుడితి సామాజిక ఆస్పత్రిలో చేరారు. సోమవారం డాక్టర్ బాన్న శోభారాణి వీరిద్దరికీ ఆపరేషన్ చేయగా ఇద్దరు మగబిడ్డలు జన్మించారు. ఆపరేషన్ తర్వాత అరుణ, ధనలక్ష్మికి ఓవర్ బ్లీడింగ్‌తోపాటు యూరిన్ ఆగిపోయి పరిస్థితి విషమించింది. దీంతో వారిద్దరినీ శ్రీకాకుళంలో రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. బుడితి సీహెచ్‌సీలో వైద్యాధికారి నిర్లక్ష్యం కారణంగా వారిద్దరూ మృతి చెందారని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపించారు. బుధవారం బుడితి, పాగోడు కూడలి సమీపంలో మృతదేహాలతో ఆందోళన చేశారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్‌ఐ ఆశోక్‌బాబు సంఘటనా స్థలాలకు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని సర్ది చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, ఈ ఘటనపై మృతుల కుటుంబాల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఇన్‌చార్జి ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు.
కుటుంబ సభ్యుల్లో విషాదం
అరుణ స్వస్థలం అల్లాడపేట. రెండేళ్ల కిందట యలమంచిలికి చెందిన పట్ట గోవిందరావుతో వివాహమైంది. ఈ దంపతులకు తొలికాన్పులో ఓ పాప జన్మించింది. రెండోకాన్పులో బాబు జన్మించిన కొద్ది గంటల్లోనే అరుణ మృతి చెందడంతో గోవిందరావు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
పాగోడు గ్రామానికి చెందిన ధనలక్ష్మికి ఆమదాలవలస మండలం కుసిమివలసకు చెందిన నార సంతోష్‌తో ఏడాది కిందట వివాహమైంది. ప్రసవం కోసం రెండు నెలల కిందట కన్నవారింటికి వచ్చింది. తొలికాన్పులో కుమారుడు జన్మించాడని ఆనందించేలోపు.. ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
వైద్యాధికారి శోభారాణి కురుపాం(పార్వతీపురం మన్యం జిల్లా) ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బదిలీపై బుడితి సీహెచ్‌సీకి గత నెల 23న వచ్చారు. బాధ్యతలు చేపట్టిన రెండు వారాల్లోనే ఇద్దరు బాలింతలు మృతి చెందడంతో పరిసర గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆపరేషన్ సమయంలో తాను ఎటువంటి నిర్లక్ష్యం చేయలేదని వైద్యాధికారి శోభారాణి చెబుతున్నారు. ఆపరేషన్ తర్వాత ఓవర్ బ్లీడింగ్ అవడంతో వెంటనే శ్రీకాకుళంలో రిమ్స్‌కు రిఫర్ చేశామన్నారు. ఈ ఘటన జరగడం తన దురదృష్టకరమని తెలిపారు.
Updated Date - Jul 09 , 2025 | 11:50 PM