ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EKYC: మరో రెండు నెలలు

ABN, Publish Date - May 02 , 2025 | 12:17 AM

e-KYC Update Deadline Extension రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ అప్‌డేట్‌(నవీకరణ)కు ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. బోగస్‌ కార్డుల ఏరివేతకు, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకుగానూ ఈకేవైసీ తప్పనిసరిగా నవీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

సుందరాడలో డీలర్‌ వద్ద ఈకేవైసీ వేస్తున్న రేషన్‌కార్డుదారులు
  • రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ నవీకరణకు గడువు పెంపు

  • జూన్‌ నెలాఖరు వరకూ అవకాశం

  • ఇప్పటికీ జిల్లాలో 98,250 మందికి పెండింగ్‌

  • బయోమెట్రిక్‌లో సాంకేతిక ఇబ్బందులు

  • మెళియాపుట్టి మండలం జలగలింగుపురం గ్రామానికి చెందిన గొర్లె గణేష్‌, కావ్య, అశ్వత... ఒకే రేషన్‌కార్డులో ఉన్నారు. ఈ ముగ్గురూ గ్రామంలోనే నివసిస్తున్నా.. ఈకేవైసీ పెండింగ్‌ వచ్చింది. డీలర్‌ వద్ద వెళ్లి బయోమెట్రిక్‌ వేసినా ఈకేవైసీ పెండింగ్‌ అని చూపుతోంది. మీ-సేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్‌ వేయగా ఇంతకముందే ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందని చూపుతోంది. దీంతో ఏమిచేయాలో తెలియక ఆ ముగ్గురూ ఆందోళన చెందుతున్నారు.

  • ..................

  • మెళియాపుట్టి మండలం సుందరాడ గ్రామానికి చెందిన పడల కల్పనకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. ఇంతకముందే ఈకేవైసీ పూర్తిచేసినా.. డీలర్‌ వద్ద జాబితాలో పెండింగ్‌ అని చూపుతోందని ఆమె వాపోతోంది.

  • ..................

  • మెళియాపుట్టి మండలం లింగుపురానికి చెందిన నడిమింటి తేజేశ్వరరావు హైదరాబాద్‌లో ఉపాధి పొందుతూ నివసిస్తున్నాడు. రేషన్‌కార్డు మాత్రం ఇక్కడే ఉంది. అప్పుడప్పుడూ రేషన్‌ సరుకులు తీసుకునేవాడు. ప్రస్తుతం ఈకేవైసీ పెండింగ్‌ చూపుతుండడంతో ఇక్కడకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నాడు. ఇటువంటి రేషన్‌కార్డుదారులకు మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఈకేవైసీ నవీకరణకు రెండు నెలలు గడువు పెంచింది. దీంతో రేషన్‌కార్డుదారులకు కాస్త ఉపశమనం లభించనుంది.

  • ..................

  • మెళియాపుట్టి, మే 1(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డుదారుల ఈకేవైసీ అప్‌డేట్‌(నవీకరణ)కు ప్రభుత్వం మరోసారి గడువు పెంచింది. బోగస్‌ కార్డుల ఏరివేతకు, రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకుగానూ ఈకేవైసీ తప్పనిసరిగా నవీకరణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత మార్చి నెలాఖరు వరకు గడువు విధించింది. తర్వాత ఏప్రిల్‌ 30 వరకు గడువు పెంచింది. అయినప్పటికీ బయోమెట్రిక్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో జిల్లాలో ఈ ప్రక్రియ సజావుగా సాగడం లేదు. జిల్లాలో ఇప్పటివరకూ 98,250 మందికి ఈకేవైసీ పెండింగ్‌ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు పొడిగించింది. జూన్‌ 30వ తేదీనాటికి ఈకేవైసీ ప్రక్రియ శతశాతం పూర్తిచేయాలని స్పష్టం చేసింది.

  • ఇదీ పరిస్థితి :

  • జిల్లాలోని 1,625 డిపోల పరిధిలో 6,71,803 రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 422 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులు సరఫరా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 19,41,391 మంది రేషన్‌కార్డుదారులు ఉండగా.. గురువారం నాటికి 98,250 మందికి ఈకేవైసీ పెండింగ్‌ చూపుతోంది. ఇందులో ఐదేళ్లలోపు చిన్నారులు 29,933 మంది, 80 ఏళ్లు దాటిన వృద్ధులు 2,013 మంది ఉన్నారు. వీరికి బయోమెట్రిక్‌ పడే పరిస్థితి లేదు. చాలాచోట్ల బయోమెట్రిక్‌లో ఇబ్బందులు ఎదురవడం, స్థానికంగా కొంతమంది అందుబాటులో ఉండకపోవడంతో ఈకేవైసీ నమోదు శతశాతం పూర్తికావడం లేదు. దీంతో రేషన్‌ సరుకులు అందని చాలా మంది రేషన్‌కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా ప్రభుత్వం మరో రెండు నెలలు ఈకేవైసీ నవీకరణ గడువు పెంచడంతో ఊరట చెందుతున్నారు.

  • తేలనున్న బోగస్‌

  • వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ బియ్యం పక్కదోవ పట్టాయి. మృతుల పేరిట సైతం కొంతమంది రేషన్‌ సరుకులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే జిల్లాలో కొన్ని బోగస్‌ కార్డులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన కొంతమంది వ్యక్తులు.. ఆంధ్రాలో చదువుల కోసం రేషన్‌కార్డులు గతంలో పొందారనే ఆరోపణలు ఉన్నాయి. మెళియాపుట్టి మండలంలో నడసందర, చాపర, కొసమాళ, వసుంధర, రట్టిణి, గొప్పిలి, పెద్దలక్ష్మీపురం, గంగరాజపురం, జగన్నాథపురం వంటి గ్రామాల్లో అధికంగా ఒడిశాకు చెందిన వ్యక్తులకు రేషన్‌కార్డులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈకేవైసీ ప్రక్రియ శతశాతం పూర్తయితే ఇటువంటి బోగస్‌ కార్డుల లెక్క తేలనుంది. ఈ విషయమై మెళియాపుట్టి తహసీల్దార్‌ బి.పాపారావు వద్ద ప్రస్తావించగా.. జూన్‌ నెలాఖరులోగా ఈకేవైసీ నవీకరణ పూర్తిచేసుకోవాలని తెలిపారు. గ్రామాల్లో డీలర్ల వద్ద బయోమెట్రిక్‌ పడకపోతే.. మళ్లీ మీ-సేవ కేంద్రాల్లో ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు.

Updated Date - May 02 , 2025 | 12:17 AM