ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

salt lands: ఆ ఉప్పునకు ముప్పు

ABN, Publish Date - May 05 , 2025 | 11:40 PM

Salt Production ఒకప్పుడు ఆ ప్రాంతంలోని పొలాలు ఉప్పు పంటతో కళకళలాడేవి. రైతులు నిత్యం ఉప్పు సాగులో బిజీగా ఉండేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పొలాల లీజు ముగియడంతో రెండేళ్లుగా ఉప్పు సాగు నిలిచిపోయింది. దీంతో ఆ పొలాలు బీడుగా మారి బీటలు వారాయి. ఉపాధి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

నౌపడాలో పండించే ఉప్పు
  • పూడిగల్లి పరిసరాల్లో రెండేళ్లుగా నిలిచిన సాగు

  • లీజు ముగిసినా.. రెన్యువల్‌కు ముందుకురాని కంపెనీలు

  • ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న స్థానికులు

  • ఒకప్పుడు ఆ ప్రాంతంలోని పొలాలు ఉప్పు పంటతో కళకళలాడేవి. రైతులు నిత్యం ఉప్పు సాగులో బిజీగా ఉండేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పొలాల లీజు ముగియడంతో రెండేళ్లుగా ఉప్పు సాగు నిలిచిపోయింది. దీంతో ఆ పొలాలు బీడుగా మారి బీటలు వారాయి. ఉపాధి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇదీ వజ్రపుకొత్తూరు మండలం పూడిగల్లి పరిసర ప్రాంతాల్లో రైతుల పరిస్థితి. అలాగే సంతబొమ్మాళి మండలం నౌపడా ఉప్పు పరిశ్రమదీ అదే దుస్థితి. ఒకప్పుడు దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన ఈ ఉప్పు పరిశ్రమకు మూలపేటలో పోర్టు ఏర్పాటు కారణంగా గండం ఏర్పడింది. పోర్టుకు సంబంధించి అధికారులు భూములు సేకరించడంతో ఉప్పు గల్లీలు కనుమరుగవుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

  • వజ్రపుకొత్తూరు/ టెక్కలి, మే 5(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం పూడిగల్లి పరిసర ప్రాంతాలు ఉప్పును పండించడంలో ప్రసిద్ధి చెందాయి. బ్రిటీష్‌ పాలనలో ఉప్పుపై పన్నును వ్యతిరేకించి, ఉప్పు సత్యగ్రహం పేరుతో కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు మహాత్మాగాంధీ ఈ ప్రాంతానికి వచ్చి సమావేశం నిర్వహించిన చరిత్ర ఉంది. కానీ లీజు ముగిసిన నేపథ్యంలో గత రెండేళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఉప్పు సాగు చేయకపోవడంతో రైతులకు ఉపాధి కరువవుతోంది. పూడిగల్లి ప్రాంతంలో సుమారు 1200 ఎకరాల ఉప్పు పొలాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉప్పుటేరు పారుతున్న కారణంగా పొలాల్లో ఉప్పు తప్ప.. మరే ఇతర పంటలు పండించడానికి అవకాశం ఉండదు. దీంతో ఈ పొలాలను వివిధ కంపెనీలకు లీజుకు ఇచ్చేవారు. సంబంధిత కంపెనీలు తమ ప్రతినిధులను ఇక్కడ నియమించి వారి ఆధ్వర్యంలో స్థానిక రైతులతో ఉప్పును పండించేవి. అందుకు ఒక్కొక్కరికీ రోజుకు రూ.300 నుంచి రూ.500 చెల్లించేవారు. ఈ విధంగా వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూరు, శివరాంపురం, తెరపల్లి, మాదిగాపురం, నగరంపల్లి, గల్లి, కూర్మనాథపురం, పూడిలంక, కొల్లిపాడు, సీతాపురం, పెద్దబొడ్డపాడు గ్రామాల నుంచి 300 మంది పనిచేసేవారు. అయితే, రెండేళ్ల కిందట పొలాల లీజు గడువు ముగిసినా సంబంధిత కంపెనీలు రెన్యువల్‌ చేయించుకోలేదు. కొత్త సంస్థలు కూడా ముందుకు రావడం లేదు. పోని స్థానిక రైతులే లీజుకు తీసుకుందామంటే వారికి అంత స్థోమత లేదు. దీంతో రెండేళ్లుగా ఉప్పు సాగు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భూములు సైతం బీటలు వారుతున్నాయి. ప్రస్తుతం 100 మందికి పైగా రైతులు గ్రామాల్లో పనులు లేకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. చాలామంది యువకులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. ఉప్పు పండించడం తప్ప.. తమకు ఇతర పనులు తెలియవని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

  • మూలపేట పోర్టుతో ‘నౌపడా’కు తప్పని గండం

  • నౌపడా ఉప్పు పరిశ్రమ ఒకప్పుడు దేశంలోనే మూడోస్థానంలో ఉండేది. అటువంటి ఉప్పు పరిశ్రమకు మూలపేటలో పోర్టు కారణంగా గండం ఏర్పడింది. సంతబొమ్మాళి మండలంలో నౌపడా, సీతానగరం, మూలపేట, యామాలపేట, భావనపాడు, మర్రిపాడు, శలగపేట తదితర గ్రామాల పరిధిలో సుమారు 5వేల ఎకరాల ఉప్పు భూములు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 293.97 ఎకరాలను మూలపేట పోర్టు కోసం అధికారులు సేకరించారు. అలాగే పోర్టు చుట్టూ ఏర్పడనున్న అనుబంధ పరిశ్రమలు, భవిష్యత్‌లో పోర్టు విస్తరణకు వేల ఎకరాల్లో భూములు కావాల్సి ఉంది. దీంతో మిగిలిన ఉప్పు భూములను కూడా సేకరించే అవకాశం ఉంది. దీనివల్ల నౌపడా శివార్లలో ఉన్న అరకొర ఉప్పు భూములు మాత్రమే మిగలనున్నాయి. ఈ ప్రాంతంలో పండే ఉప్పు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నౌపడా కేంద్రంగా సాల్ట్‌బోర్డు కమిషన్‌ కార్యాలయాన్ని సైతం మొన్నటి వరకు నిర్వహించింది. ఇప్పటికే కొంతమేర ఉప్పు భూములు రొయ్యల చెరువులుగా మారాయి. మిగిలిన భూములను మూలపేట పోర్టు భవిష్యత్‌ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ, చెన్నైలోని సాల్ట్‌బోర్డులతో చర్చలు నిర్వహించింది. ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ఉప్పు భూముల్లో కొంతభాగం 2027వ సంవత్సరం వరకు తమకు లీజులు ఉన్నాయని ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. రెవెన్యూ యంత్రాంగం అవన్నీ పక్కనపెట్టి పోర్టు నిర్మాణానికి అవసరమైన రైలు, రోడ్డు మార్గాలు కోసం కొంతమేరకు భూములను స్వాధీనం చేసుకొని పనులు మొదలుపెట్టింది. ఒకప్పుడు నౌపడా ప్రాంతంలో 286 మందికి లీజులు ఉండగా, ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. మరోవైపు ఉప్పుపంట ఆదాయం తగ్గడంతో రైతులు సైతం ఆందోళనలో పడ్డారు. ఈ విషయమై ఆర్డీవో ఎం.కృష్ణమూర్తిని వివరణ కోరగా.. ‘పోర్టు అవసరాల కోసం నౌపడా ఉప్పు భూములు సేకరించనున్నాం. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అవసరం మేరకు ఉప్పు భూములను తీసుకుంటామ’ని తెలిపారు.

  • ఇతర పనులు తెలియవు

  • చిన్నప్పటి నుంచి ఉప్పు పండించడం తప్ప నాకు ఇతర పనులు తెలియవు. రెండేళ్లుగా ఉప్పు సాగు నిలిచిపోవడంతో ఖాళీగా ఉంటున్నా. ఉపాధిహామీ పనులు 100 రోజులు మాత్రమే కల్పిస్తున్నారు. మిగిలిన రోజులు ఏమి చేయాలో తెలియడం లేదు. ఇన్నాళ్లు ఉప్పు పొలాల్లో పనిచేసినా, పింఛన్‌ సదుపాయం కల్పించలేదు. కనీసం సామాజిక పింఛన్ల జాబితాలో ఉప్పు రైతుల పేర్లు జత చేసి ఆదుకోవాలి.

    - టొంప మోహనరావు, ఉప్పు రైతు, శివరాంపురం

  • వలసబాట పట్టారు

  • ఉప్పు సాగు నిలిచిపోవడంతో మేమంతా ఉపాధి కోల్పోయాం. పని లేక యువకులు ఇతర ప్రాంతాలకు వలసబాట పట్టారు. దీంతో గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. మాలాంటి వారమంతా గ్రామాల్లో ఉండిపోయాం. కుటుంబాన్ని పోషించడం భారంగా ఉంది. ప్రభుత్వమే ఆదుకోవాలి. పింఛన్‌ కోసం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.

    - లండ మహాలక్ష్మి, శివరాంపురం

Updated Date - May 05 , 2025 | 11:40 PM