postal services scam: మా డబ్బులు ఇవ్వండి
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:02 AM
customer protest postal services delay ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో రూ.కోట్లలో జరిగిన భారీ స్కాంపై అధికారులను ఖాతాదారులు నిలదీశారు. సోమవారం పోస్టల్ కార్యాలయం లోపల ఆందోళన చేశారు. తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో ఖాతాదారుల ఆందోళన
అధికారులను నిలదీసిన వైనం
ఇచ్ఛాపురం, జూలై 28(ఆంధ్రజ్యోతి): ఇచ్ఛాపురం పోస్టల్ కార్యాలయంలో రూ.కోట్లలో జరిగిన భారీ స్కాంపై అధికారులను ఖాతాదారులు నిలదీశారు. సోమవారం పోస్టల్ కార్యాలయం లోపల ఆందోళన చేశారు. తాము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా మా పిల్లల పేరున పోస్టాఫీసులో కేవీపీ బాండ్ల రూపంలో డబ్బులు దాచుకుంటే.. సైబర్ నేరగాళ్లతో కలిసి పైసా కూడా లేకుండా ఖాతా ఖాళీ చేసేశారని బాధితులు లోహిదాస్‌రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన కేవీపీ బాండ్లు కూడా నకిలీవేనని, తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రతీ ఖాతాదారుడికి దాచుకున్న డబ్బులు అందజేస్తామని సోంపేట పోస్టల్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ హామీ ఇచ్చారు. దీనికి పోస్టల్ డిపార్ట్‌మెంట్ పూర్తి బాధ్యత వహిస్తుందని, ఖాతాదారులెవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. మేము చేపడుతున్న విచారణకు సహకరిస్తే.. వీలైనంత తొందరలో మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ అధికారి హరిబాబు వచ్చి.. బాధితులతో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. ఇప్పటివరకూ 33 మంది ఖాతాదారులను బాధితులుగా గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఉన్నతాధికారులు ఏమి చేస్తున్నారు?
జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు ఖాతాదారులకు అండగా నిలిచారు. రూ.కోట్లలో స్కాం జరిగితే ఉన్నతాధికారులు రాకుండా ఏమి చేస్తున్నారని డివిజనల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్‌ను ఆయన నిలదీశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్ అధికారి హరిబాబుతో ఫోన్లో మాట్లాడారు. భారీ కుంభకోణంపై ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో విచారణ చేయడం సరికాదని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధితుల నుంచి గ్రీవెన్స్‌లు తీసుకుంటున్నామని, అందరికీ న్యాయం చేస్తామని హరిబాబు తెలిపారు. మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామన్నారు. ఖాతాదారుల పాస్‌పుస్తకాలు పరిశీలించి.. ఆన్‌లైన్ డేటాతో సరిచూస్తామన్నారు. అవకతవకలు జరిగితే సరిచేస్తామన్నారు. ఖాతాదారులందరికీ దాచుకున్న డబ్బులను అందజేస్తామని స్పష్టం చేశారు.
Updated Date - Jul 29 , 2025 | 12:02 AM