అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:46 PM
ఆంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు దిగింది.
రాజాం రూరల్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఆంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు దిగింది. కేంద్రాల నుంచి నెలనెలా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించే సమయంలో ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ ఆధారిత గుర్తింపు) తప్పనిసరి చేసింది. జులై 1 నుంచి అమలుచేయాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఇప్పటికే పోషణ్ ట్రాకర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకత పెంచేందుకు, అర్హులకు పౌష్టికాహారం అందేందుకు, నకిలీ లబ్ధిదారుల్ని తొలగించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పొందే సర్వీసులలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నేరుగా నిజమైన లబ్ధిదారులకు పౌష్టికాహారం అందేలా చేయడానికే ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌ఎస్ విధానాన్ని తెచ్చింది. కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు సరఫరా చేసే మెటీరియల్‌కు సంబంధించి ఏం పంపిణీ చేశారో నేరుగా లబ్ధిదారు సెల్‌కు సమాచారం వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఫలితంగా పౌష్టికాహారం పక్కదారి పట్టేందుకు అవకాశాలు తక్కువ. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేవారు తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం ముఖ ఆధారిత గుర్తింపు హాజరు తప్పనిసరి చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు ఎంతమంది లబ్ధిదారులు వచ్చారో సెల్‌ఫోన్ ద్వారా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. యాప్ నిర్వహణపై ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేటప్పుడు, ఆహారం అందించే సమయంలో ఫేషియల్ గుర్తింపు హాజరు తీసుకుంటారు.
జిల్లాలో 95 శాతం ఫేస్ క్యాప్చర్ పూర్తి
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలకు పోషణ్ ట్రాకర్ అప్లికేషన్‌లో ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరైంది. జిల్లాలో 49,445 మంది లబ్ధిదారులుండగా వారిలో ఇప్పటి వరకు 46,610 మంది లబ్ధిదారులకు ఫేస్ కేప్చర్ ప్రక్రియను పూర్తి చేశారు. తద్వారా జులై ఒకటి నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో కొన్నిచోట్ల మినహా దాదాపుగా అన్ని అంగన్వాడీల ద్వారా లబ్ధిదారులకు ఎఫ్‌ఎస్‌ఆర్ విధానంలో పౌష్టికాహారం అందించేందుకు దాదాపుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఖచ్చితంగా అమలు చేస్తాం..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను జులై ఒకటి నుంచి జిల్లా అంతటా ఖచ్చితంగా అమలు చేస్తాం. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో ఇప్పటికే 95 శాతం ఎఫ్‌ఎస్‌ఆర్ పూర్తి చేశాం. ఈకేవైసీ కూడా 75 శాతం పూర్తి చేశాం. ఆధార్ ఐడెంటిఫికేషన్‌లో చిన్నపాటి సమస్యలున్నాయి. దీన్ని త్వరితగతిన పూర్తిచేయాలని పీఓలకు సూచించాం. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో పౌష్టికాహారం పక్కదారి పట్టేందుకు అవకాశాలే ఉండవు. నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది. అక్రమాలకు ఆస్కారం ఉండదు.
-టి.విమలారాణి, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఐసీడీఎస్, విజయనగరం
Updated Date - Jun 30 , 2025 | 11:46 PM