shopping: షాపింగ్ సందడి
ABN, Publish Date - Jun 19 , 2025 | 11:45 PM
Business Growth.. Economic Development పండగ సీజన్ మాదిరి జిల్లాలో ఎక్కడ చూసినా మార్కెట్ సందడి కనిపిస్తోంది. వస్త్రదుకాణాలు, పుస్తకాలు, బ్యాగ్‌లు, షూలు, సైకిళ్లు తదితర విక్రయ కేంద్రాలతోపాటు బంగారం షాపులు జనంతో నాలుగు రోజుల నుంచి కిటకిటలాడుతున్నాయి.
జిల్లాలో జోరుగా సాగుతున్న వ్యాపారాలు
ఎక్కడ చూసినా.. కొనుగోలుదారుల రద్దీ
‘తల్లికి వందనం’ నిధులు సద్వినియోగించుకునేలా ప్రణాళికలు
శ్రీకాకుళం/నరసన్నపేట, జూన్ 19(ఆంధ్రజ్యోతి): పండగ సీజన్ మాదిరి జిల్లాలో ఎక్కడ చూసినా మార్కెట్ సందడి కనిపిస్తోంది. వస్త్రదుకాణాలు, పుస్తకాలు, బ్యాగ్‌లు, షూలు, సైకిళ్లు తదితర విక్రయ కేంద్రాలతోపాటు బంగారం షాపులు జనంతో నాలుగు రోజుల నుంచి కిటకిటలాడుతున్నాయి. శ్రీకాకుళంతోపాటు ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, నరసన్నపేట, ఆమదాలవలస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో షాపులన్నీ కొనుగోలుదారులతో రద్దీగా ఉన్నాయి. ప్రభుత్వం ‘తల్లికి వందనం’ నిధులు జమ చేయడమే ఇందుకు కారణమని స్పష్టమవుతోంది. ఇటీవల ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సంబంధించి.. వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం పేరిట రూ.13వేలు చొప్పున నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. ఈ డబ్బులతో అందరూ సంతోషంగా షాపింగ్ చేస్తూ.. తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుంటున్నారు. వాస్తవానికి జూన్‌లో వ్యాపారాలు డల్‌గా ఉంటాయి. కానీ, సీఎం చంద్రబాబు పుణ్యమా? అని తమ వ్యాపారాలు జోరందుకున్నాయని వ్యాపారులు కూడా సంబరపడుతున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు పడడంతో.. పండగ సీజన్ మాదిరి వ్యాపారాలు సాగుతున్నాయని పేర్కొంటున్నారు.
‘తల్లికి వందనం’.. పిల్లల్లో ఆనందం
జమ్ము గ్రామానికి చెందిన రావాడ తనూజ నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. జమ్ము నుంచి సుమారు మూడు కిలోమీటర్లు మేర దూరంలోని ఉన్న పాఠశాలకు ఆటోలో వెళ్లి వచ్చేది. ప్రభుత్వం ఇటీవల తల్లికి వందనం పథకం కింద తనూజ తల్లి రమణమ్మ బ్యాంకు ఖాతాలో రూ.13వేలు జమ చేసింది. ఆ డబ్బులను సద్వినియోగం చేసేలా తనూజ కోసం ఆమె తల్లిదండ్రులు రమణమ్మ, కృష్ణ సైకిల్ కొనుగోలు చేశారు. రెండు రోజులుగా ఆ సైకిల్‌పైనే పాఠశాలకు వెళ్లి వస్తుండడంతో తనూజలో ఆనందం వ్యక్తమవుతోంది. ఇదే మాదిరి చాలామంది తల్లిదండ్రులు ‘తల్లికి వందనం’ పథకానికి గుర్తుగా సైకిళ్లు, వెండీ పట్టీలు, కొద్దిపాటి బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.
గతంలో ఒక్కరికే.. ఇప్పుడు అందరికీ..
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ‘అమ్మఒడి’ పథకం ద్వారా కేవలం ఒకరికి మాత్రమే లబ్ధి చేకూర్చేవారు. అది కూడా గతేడాది ఎగనామం వేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తే ‘తల్లికి వందనం’ పథకం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికీ రూ.13వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలు చేసి చూపించారు. జిల్లాలో 2,28,659 మంది విద్యార్థులకు సంబంధించి 1,52,563 మంది తల్లులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. సుమారు అన్ని ఇళ్లల్లో ఇద్దరు పిల్లలకు రూ.26వేలు, ముగ్గురు నుంచి ఐదుగురు పిల్లలున్నవారికి ఒక్కొక్కరికి రూ.13వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో ఇటీవల జమ చేశారు. ఎన్నో కుటుంబాలకు లబ్ధి కలగడంతో.. వాటిని సద్వినియోగం చేసుకునేలా.. వస్తువులు.. బంగారం ఆభరణాలు.. ఇతరత్రా వాటిని కొనుగోలు చేసుకుంటున్నారు. మరోవైపు పాఠశాలలు తెరచుకున్న వేళ.. శ్రీకాకుళంలో ఏడురోడ్ల జంక్షన్‌లో ఉన్న వస్త్రదుకాణాలు, బుక్ స్టోర్స్.. బ్యాగ్‌లు, షూస్ దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పాత బస్టాండ్ వద్ద రిలయన్స్ మార్ట్, డేఅండ్‌నైట్ జంక్షన్ వద్ద రిలయన్స్ డిజిటల్‌తోపాటు ప్రముఖ షాపింగ్ మాల్స్, ఫర్నిచర్ దుకాణాల్లో రద్దీ కనిపిస్తోంది. రామలక్ష్మణ జంక్షన్, ఏడురోడ్ల జంక్షన్ వద్ద ఉన్న సైకిల్ షాపుల్లో కూడా జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. కొంతమంది తల్లులు.. తమకు వచ్చిన డబ్బులతో కొద్దిపాటి బంగారు ఆభరణాలను, వెండి పట్టీలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొంతమంది టీవీలు, ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా అన్ని దుకాణాల్లోనూ సందడి కనిపించడంతో వ్యాపారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Jun 19 , 2025 | 11:45 PM