Alert: తీరంలో అప్రమత్తం
ABN, Publish Date - May 07 , 2025 | 11:43 PM
Coastal alert High tides పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో తీరం వెంబడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక కెమెరాలతో సముద్ర తీరప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
ప్రత్యేక కెమెరాలతో పర్యవేక్షిస్తున్న పోలీసులు
ఎచ్చెర్ల/రణస్థలం, మే 7(ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడి చేసి ముష్కరులను మట్టుబెట్టిన నేపథ్యంలో తీరం వెంబడి పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక కెమెరాలతో సముద్ర తీరప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌లో ప్రభుత్వం, ప్రజలు తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఈ క్రమంలో ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ సైన్యం ముప్పేట దాడి చేసి మట్టుబెట్టింది. దీంతో భారత్‌పై ఉక్రోశంగా ఉన్న పాకిస్థాన్ ఏ మార్గంలోనైనా మళ్లీ దాడి చేయొచ్చునని, ఏదైనా పన్నాగం పన్నవచ్చునని పోలీసులు అనుమానిస్తూ అప్రమత్తమయ్యారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించారు. జిల్లాలో రణస్థలం మండలం దోనిపేట నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు వరకూ 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం రూరల్, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మొత్తంగా 11 తీర మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 120 మత్స్యకార తీర గ్రామాలు ఉన్నాయి. ఈ తీరప్రాంత గ్రామాల్లో మెరైన్ పోలీసులు బుధవారం పర్యటించారు. బుడగట్లపాలెం, జీరుపాలెం, కొమరవానిపేట, కొత్తముక్కాం తదితర గ్రామాల్లో సమావేశాలను నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలాంటి సంఘటనలు జరిగినా, అపరిచిత వ్యక్తులు తీర గ్రామాల్లో కనిపించినా వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. సముద్రం గుండా ఉగ్రవాదులు చొరబడితే ఎలా పట్టుకోవాలో అన్న దానిపై పోలీసులు, మెరైన్ నేవీ సిబ్బంది సంయుక్తంగా పలుచోట్ల మాక్‌డ్రిల్ కూడా నిర్వహించారు. ఈ విషయమై కళింగపట్నం మెరైన్ పోలీసుస్టేషన్ సీఐ బి.ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా.. పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల శిబిరాలపై భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట చేసిన దాడుల నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా తీరప్రాంతాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. తీర గ్రామాల్లో సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.
Updated Date - May 07 , 2025 | 11:43 PM