COVID-19 : కరోనాపై మళ్లీ అప్రమత్తం
ABN, Publish Date - May 24 , 2025 | 11:48 PM
Coronavirus New variant కరోనా వైరస్.. ఐదేళ్ల కిందట ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది.. ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కొవిడ్ తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ఒకటీ రెండు కేసులు నమోదవడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రిమ్స్‌లో ఎప్పటిలానే నిర్ధారణ పరీక్షలు
జిల్లాలో ప్రస్తుతానికి కొత్త కేసులు లేవు
అయినా జాగ్రత్తలు పాటిస్తే మేలు
శ్రీకాకుళం, మే 24(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్.. ఐదేళ్ల కిందట ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెంది.. ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కొవిడ్ తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో ఒకటీ రెండు కేసులు నమోదవడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాలో కొత్త కరోనా కేసులు నమోదు కాకపోయినా.. అప్రమత్తం కావాల్సిన అవసరం తలెత్తింది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో ఇప్పటికే కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి కొత్త కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యశాఖ అధికారులు ప్రకటించారు. గతంలో కొవిడ్ సమయంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే చాలని చెబుతున్నారు. ఎప్పటిలానే మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటిస్తే కరోనా బారిన పడకుండా ఉండొచ్చు. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. శానిటైజర్‌తో తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. జనసమూహాల్లో ఎక్కువసేపు ఉండకూడదు. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, డయాబెటీస్, బీపీ, షుగర్, లివర్, కిడ్నీ వ్యాధులున్నవారు అప్రమత్తంగా ఉండాలి. దగ్గు, జ్వరం, శ్వాసకోస సమస్యలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రందించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్త పాటిస్తే చాలు అని వైద్యులు సూచిస్తున్నారు.
భయాందోళన వద్దు
శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఇంతవరకు కొవిడ్ కేసులు నమోదు కాలేదు. అపోహలు.. వదంతులు నమ్మొద్దు. ప్రజలు అనవసర ఆందోళన... భయం చెందొద్దు. ప్రస్తుతానికి అప్రమత్తంగా ఉంటే చాలు. గతంలో మాదిరి వ్యక్తిగత జాగ్రత్తలు, జనసమూహంలో వెళ్లేటప్పుడు మాస్క్‌లు ధరిస్తే మంచిది.
డా.కె.అనిత, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి
Updated Date - May 24 , 2025 | 11:48 PM