ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తల్లులకు ‘షాక్‌’

ABN, Publish Date - Jun 18 , 2025 | 11:42 PM

విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుపేద కుటుంబాల పాలిట శాపంగా మారింది. వారి తప్పిదంతో చాలామంది పేద పిల్లలు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు.

‘తల్లికి వందనం’ డబ్బులు రాలేదని చెబుతున్న జింకిభద్ర గ్రామానికి చెందిన పైల కుమారి

- ఒకే ఆధార్‌ నెంబర్‌కు పదుల సంఖ్యలో విద్యుత్‌ సర్వీసులు అనుసంధానం

- తప్పుడు సీడింగ్‌తో ‘తల్లికి వందనం’ దూరం

- లబోదిబోమంటున్న నిరుపేదల కుటుంబాలు

కంచిలి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిరుపేద కుటుంబాల పాలిట శాపంగా మారింది. వారి తప్పిదంతో చాలామంది పేద పిల్లలు తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. ఒకే ఆధార్‌ నెంబర్‌కు పదుల సంఖ్యలో విద్యుత్‌ సర్వీసులను అనుసంధానం చేయడంతో అనేక మంది తల్లికి వందనం పథకాన్ని కోల్పోయారు. సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన పైల చందనం, కుమారికి ఇద్దరు పిల్లలు. హాసిని ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, కార్తీక్‌ జింకిభద్ర ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరికి డాబా ఇళ్లు ఉంది. ఇంటిలో రెండు ఫ్యాన్‌లు, రెండు బల్బులతోపాటు ఒక టీవీ ఉంది. ప్రతి నెలా కరెంట్‌ చార్జీలు నామామాత్రంగానే వస్తున్నాయి. కానీ, తల్లికి వందనం పథకం డబ్బులు కుమారి బ్యాంకు ఖాతాలో పడలేదు. ఉసూరంటూ ఆమె తన పిల్లల విద్యార్హత పత్రాలు, ఆధార్‌ కార్డులు పట్టుకుని గ్రామంలోని సచివాలయానికి వెళ్లి, అధికారులను ప్రశ్నించింది. అక్కడ వారు కుమారికి చెందిన ఆధార్‌కార్డుతో మరో 70 విద్యుత్‌ సర్వీసులు అనుసంధానం అయినట్లు చెప్పడంతో అవాక్కు అవ్వడం కుమారి వంతైంది. తనకేమి అపార్టుమెంట్లు లాంటివి లేవని, తాను నిరుపేదనని, ఇన్ని విద్యుత్‌ మీటర్లు తన నెంబరుకు ఎలా అనుసంధానం చేస్తారంటూ అధికారులను నిలదీసింది. మీరు చేసిన తప్పుకు ప్రభుత్వం తన పిల్లలకు అందిస్తున్న సాయం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన నెంబరుతో అనుసంధానం చేసిన సర్వీసులను తొలగించాలని ఫిర్యాదు చేసింది. అయితే కుమారి ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానమైన 70 విద్యుత్‌ మీటర్లకు చెందిన వారి ఆధార్‌కార్డులు తెస్తే, పని జరుగుతుందని చెప్పడంతో కుమారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు చేసిన తప్పు వల్ల తాను నష్టపోయానని, దాన్ని సరిదిద్దాల్సిన అధికారులు తనకు 70 మీటర్లకు సంబంధించిన వారి ఆధార్‌కార్డులు తెమ్మనడం ఎంతవరకు సమంజసమని నిలదీసింది. అయినా అధికారులు రూల్స్‌ ఇలానే ఉన్నాయి, తామేమి చేయలేమని చెప్పడంతో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తల్లికి వందనం పథకం అందకపోవడానికి విద్యుత్‌ శాఖాధికారులు నిర్లక్ష్యమే కారణమని, తనకు న్యాయం చేయాలని ఆమె అటు సచివాలయ అధికారులకు, ఇటు విద్యుత్‌ శాఖాధికారుల కార్యాలయానికి తిరుగుతూ ఉంది. ఇది ఒక్క కుమారికి మాత్రమే కాదు, నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోను ఇదే పరిస్థితి నెలకొంది. సోంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఒక్కొక్కరి ఆధార్‌ నెంబర్‌కు పదుల సంఖ్యలో సర్వీసులు అనుసంధానం కావడంతో వారంతా పథకానికి అనర్హులుగా మారారు. జింకిభద్రతోపాటు మామిడిపల్లి, సోంపేట తదితర గ్రామాల్లో పలువురు ఇదే సమస్యతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సోంపేట పట్టణంలోని ఒక పాన్‌షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి ఇంటిలో ఒకరి ఆధార్‌కార్డుకి, మరో ఏడు సర్వీసులు అనుసంధానం చేశారు. దీంతో అతనికి సైతం తల్లికి వందనం సొమ్ములు పడలేదు. ఇలా ఇంతమంది నిరుపేదలు సమస్యతో అధికారులు చుట్టూ తిరుగుతుంటే దీనికి కారణమైన విద్యుత్‌ శాఖాధికారులు మాత్రం ఇదేమి తమ పని కాదన్నట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిరుపేద లబ్ధిదారులకు తల్లికి వందనం పథకం అందేందుకు శాఖాపరమైన ఇబ్బందులను తొలగించాలని సర్వత్రా కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 11:42 PM