Arasavalli: భక్తజన సందోహం...ఆదిత్యాలయం
ABN, Publish Date - May 19 , 2025 | 12:07 AM
Aadityalayam temple అరసవల్లిలో ఆదిత్యాలయం.. భక్తజన సందోహంతో నిండిపోయింది. వైశాఖమాస ఆదివారం పురస్కరించుకుని.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
అరసవల్లి, మే 18(ఆంధ్రజ్యోతి): అరసవల్లిలో ఆదిత్యాలయం.. భక్తజన సందోహంతో నిండిపోయింది. వైశాఖమాస ఆదివారం పురస్కరించుకుని.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. తొలుత తలనీలాలు సమర్పించి.. ఇంద్ర పుష్కరిణిలో స్నానాలు ఆచరించారు. ఆలయ ఆవరణలో క్షీరాన్న పాయసం వండి స్వామికి నైవేద్యం సమర్పించారు. కేశఖండన శాల, ఇంద్ర పుష్కరిణి, క్యూలైన్లు.. ఎక్కడ చూసినా భక్తుల రద్దీ కనిపించింది. ఆలయ అనివెట్టి మండపం సూర్యనమస్కారాలు ఆచరించే భక్తులతో నిండిపోయింది. కాగా కేశఖండనశాల ఆవరణలో నీడ సౌకర్యం లేక భక్తులు ఎండలో ఇబ్బందులు పడ్డారు. ప్రసాదాలు, తాగునీటి సరఫరా విషయంలో ఇబ్బందులు లేకుండా ఈవో శోభారాణి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ‘ఆదివారం ఒక్కరోజు స్వామికి రూ.13,03,091 ఆదాయం లభించింది. ఇందులో టిక్కెట్ల అమ్మకం ద్వారా రికార్డు స్థాయిలో రూ.9,45,900 సమకూరాయి. విరాళాల ద్వారా రూ.78,216, ప్రసాదాలు విక్రయం ద్వారా రూ.2,78,975 లభించింద’ని ఈవో తెలిపారు.
Updated Date - May 19 , 2025 | 12:07 AM