Matsyakara Bharosa : రూ.258కోట్లతో మత్స్యకార భరోసా
ABN, Publish Date - Apr 24 , 2025 | 10:55 PM
Fishermen Welfare ‘చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరాగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.258 కోట్లు అందజేయనుంది. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఈ నెల 26న సీఎం చంద్రబాబునాయుడు మత్స్యకార భరోసా నిధులు పంపిణీ చేయనున్నార’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం బుడగట్లపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
మంత్రి అచ్చెన్నాయుడు
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
ఎచ్చెర్ల, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ‘చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఆసరాగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార భరోసా కింద రూ.258 కోట్లు అందజేయనుంది. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఈ నెల 26న సీఎం చంద్రబాబునాయుడు మత్స్యకార భరోసా నిధులు పంపిణీ చేయనున్నార’ని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం బుడగట్లపాలెంలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మత్స్యకారులకు కనీసం బోట్లు, వలలు కూడా పంపిణీ చేయలేదు. గతంలో అనర్హులకు, వైసీపీ సానుభూతిపరులకు మాత్రమే రూ.10వేలు చొప్పున అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గతంలో ఇచ్చిన మత్స్యకార భరోసా మొత్తాన్ని రెట్టింపు చేశాం. మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామ’ని తెలిపారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డితో కలిసి అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రి మత్స్యకారులు, పార్టీ శ్రేణులతో వేర్వేరుగా సమావేశం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు. హెలిప్యాడ్, రూట్ మ్యాప్, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై తగు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్(ఏఎస్‌ఎల్) నిర్వహించి ముందస్తు భద్రత కల్పించాలన్నారు. హెలిప్యాడ్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు, సభా వేదిక భద్రత, మత్స్యకారులతో ముఖాముఖి, అమ్మవారి గుడి సందర్శన తదితర చోట్ల పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ ఏవీ రమణ, ఏఎస్పీ వి.శ్రీనివాసరావు, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, డీఎస్పీలు, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, టీడీపీ మండల అధ్యక్షుడు బెండు మల్లేశ్వరరావు, కూటమి నేతలు పైడి ముఖలింగం, గాలి వెంకటరెడ్డి, స్థానిక సర్పంచ్ అలుపల్లి రాంబాబు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 10:55 PM