విశాఖకు 20 వేల మంది సాధకులు
ABN, Publish Date - Jun 17 , 2025 | 11:49 PM
ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నుంచి 20 వేల మంది సాధకులు వెళుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని కోరారు.
అరసవల్లి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 21న విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న యోగాంధ్ర కార్యక్రమానికి జిల్లా నుంచి 20 వేల మంది సాధకులు వెళుతున్నారని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు చెప్పారు. అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని కోరారు. మంగళవారం ఉదయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆవరణలో 1000 మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత నీరజా సుబ్రహ్మణ్యం బృందంతో నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. తరువాత యోగా శిక్షకులు, వలంటీర్లు వెయ్యి మందితో ప్రాణాయామం, ధ్యానం, యోగా సాధన చేయించారు. అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న స్థానిక 80 అడుగుల రోడ్డులో గానీ, లేదా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో గానీ 3000 మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, ఆదిత్యాలయ ఈవో ప్రసాదరావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి.జగదీష్, డా.గౌతమ్, డ్వామా పీడీ సుధాకరరావు, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు కొఠారి రేణుక, తంగి స్వాతి, మురళి, దుంపల చిన్నబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 17 , 2025 | 11:49 PM