దుర్మార్గులకు పరామర్శా..: సోమిరెడ్డి
ABN, Publish Date - Jul 31 , 2025 | 05:12 AM
దుర్మార్గులను పరామర్శించడానికి జగన్ నెల్లూరుకు వస్తుండడం ఆయన నైజానికి నిదర్శనమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.
నెల్లూరు, జూలై 30(ఆంధ్రజ్యోతి): దుర్మార్గులను పరామర్శించడానికి జగన్ నెల్లూరుకు వస్తుండడం ఆయన నైజానికి నిదర్శనమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం నెల్లూరులోని తన కార్యాలయంలో సోమిరెడ్డి మాట్లాడారు. అరాచకాలు చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిని, ఓ మహిళా ఎమ్మెల్యే గురించి నీచంగా మాట్లాడిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వంటి వైసీపీ నేతల్ని పరామర్శించడానికి జగన్ నెల్లూరు రావడాన్ని ఆయన తప్పు పట్టారు. ‘నేతల అరాచకాలు, దుర్మార్గాలను భరించలేక నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాల్లో వైసీపీని ప్రజలు మట్టికరిపించాక జగన్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇక్కడకు వస్తున్నారు? లిక్కర్ స్కామ్‌లో ఇప్పటి వరకూ 12 మంది అరెస్టు అయ్యారు. జగన్ ధనదాహానికి వీరంతా జైలుకు వెళ్లారు. ఆ కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పలేకనే జగన్ లిక్కర్‌స్కామ్ నిందితులను పరామర్శించేందుకు వెళ్లడం లేదు. చంద్రబాబుతో పాటు నా తల్లిదండ్రుల గురించి కూడా కాకాణి నీచంగా మాట్లాడారు. వైసీపీ హయాంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారు. అందుకు కాకాణి ధనదాహమే కారణం. నాడు ఇన్ని పాపాలు చేసి.. నేడు పరామర్శల పేరుతో రాజకీయాలు చేయాలని చూడడం సిగ్గుచేటు’ అని సోమిరెడ్డి విమర్శించారు.
Updated Date - Jul 31 , 2025 | 05:12 AM