Bapatla District: ఆరుగురిని మింగేసిన గ్రానైట్ క్వారీ
ABN, Publish Date - Aug 04 , 2025 | 04:38 AM
వారంతా ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళ్లడం.. వచ్చిన డబ్బుతో కడుపు నింపుకోవడం.. ఇదే వారి జీవితం.
బండరాయి పడి వలస కూలీల దుర్మరణం.. బాపట్ల జిల్లాలో ఘోరం
మరో 8 మందికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
మృతులు, క్షతగ్రాత్రులు అంతా ఒడిశావాసులే
సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి.. విచారణకు ఆదేశం
క్వారీల్లో భద్రతా ప్రమాణాలపై అనుమానాలు
బాపట్ల, బల్లికురవ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): వారంతా ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలు.. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వలస వెళ్లడం.. వచ్చిన డబ్బుతో కడుపు నింపుకోవడం.. ఇదే వారి జీవితం. ఈ క్రమంలో రాష్ట్రం కాని రాష్ట్రానికి వలస వచ్చిన ఆ పేద బతుకుల్ని గ్రానైట్ రాయి మింగేసింది. ఒకరిద్దరు కాదు ఏకంగా ఆరుగురు ఒకే బండ కింద నలిగి పోయారు. ఇంతకాలం కలిసి మెలిసి పని చేసిన ఇద్దరు స్నేహితులనూ మృత్యువు కబళించింది. స్నేహితుల దినోత్సవం నాడే ఈ దారుణం జరిగింది. ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్స్‌లో ఆదివారం ఉదయం ఈ ఘోరం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?!
శనివారం రాత్రి కురిసిన వర్షానికి క్వారీలో ఉన్న గ్రానైట్ రాళ్ల మధ్య సీఫేజ్ ఏర్పడిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. వర్షం నీటికి మధ్యలో ఉన్న మట్టి కొంచెంకొంచెంగా కరిగి తొలగిపోయింది. ఎప్పటిలాగే ఆదివారం ఉదయం కార్మికులు పనికి వెళ్లారు. దాదాపు పదిన్నర సమయంలో క్వారీ అంచు ఒక్కసారిగా విరిగిపడడంతో అక్కడికక్కడే నలుగురు కూలీలు మృతి చెందారు. గాయడిన వారిని నరసరావుపేట ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో ఇద్దరు ప్రాణాలొదిలారు. మృతులు ఒడిశాకు చెందిన దండా బడత్వా(48), టుకునదలాయ్(37), బనమల చెహ్ర(30), భాస్కర్ బిషోయ్(40), సైంతోష్ గౌడ(36), ముస్సాజన(43)గా గుర్తించారు. మరో 8 మందికి చికిత్స పొందుతుండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని ఎస్పీ తుషార్‌డూడి పరిశీలించారు. నరసరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న కూలీలను కలెక్టర్ వెంకటమురళి పరామర్శించారు.
విచారణకు సీఎం ఆదేశాలు
వలస కూలీల మృతి విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంకటమురళికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరపాలని ఆదేశించారు. క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు దుర్మరణం పాలవడం కలచివేసిందని మంత్రి లోకేశ్ అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, భరోసా ఇచ్చారు. మంత్రులు కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్‌లు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించడంతో పాటు, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు బాపట్ల జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రమాదానికి కారణాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 04:41 AM