AP Govt: ఆరుగురు హౌసింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు
ABN, Publish Date - Aug 02 , 2025 | 05:33 AM
గృహనిర్మాణ కార్యక్రమాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన హౌసింగ్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
వారి అక్రమాలపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు
అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): గృహనిర్మాణ కార్యక్రమాల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన హౌసింగ్ అధికారులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సూపరింటెండింగ్ ఇంజినీరు సి.జయరామాచారిని విచారణాధికారిగా, కడప జిల్లా ఇన్‌చార్జి హౌసింగ్ హెడ్ వి.రాజరత్నంను ప్రెజెంటింగ్ ఆఫీసర్‌గా నియమించింది. మూడు నెలల్లో విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశిస్తూ గృహ నిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్ ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం అమృతనగర్ కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణ పథకం అమలులో అక్రమాలు జరిగినట్లు విచారణలో నిర్ధారించారు. ప్రొద్దుటూరు గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కవర్ చేసే ప్రాజెక్టు అమలులో అక్రమ చెల్లింపులు చేసి ఉల్లంఘనలకు పాల్పడిన ఆరుగురు హౌసింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని విచారణాధికారి సిఫారసు చేశారు. దాంతో ప్రస్తుతం సర్వీసులో ఉన్న పులివెందుల హౌసింగ్ ఏఈ సి.సంజీవరాయుడు, గతంలో అక్కడ పనిచేసిన ఏఈలు టి.కె.ప్రతాప్ రెడ్డి (ప్రస్తుతం కమలాపురం ఏఈ), డి.లాలికృష్ణయ్య (ప్రస్తుతం కర్నూలు జిల్లా మంత్రాలయం డిప్యూటీ ఈఈగా ఉన్నారు)లపైన, గతంలో ప్రొద్దుటూరు ఈఈగా పనిచేసి పదవీ విరమణ చేసిన పి.నాగేశ్వరరావు, డీఈఈగా పని చేసి రిటైరైన ఆర్.వీరన్న, ఈఈ ఎన్.రాజశేఖర్‌లపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలను ప్రారంభించింది. దీంతో వారు తమపై అభియోగాలను తిరస్కరిస్తూ తదుపరి చర్యలను ఉపసంహరించాలని అభ్యర్థిస్తూ లిఖితపూర్వకంగా అర్జీలను సమర్పించారు. దీంతో సదరు అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Updated Date - Aug 02 , 2025 | 05:35 AM