Liquor Scam: సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న సిట్
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:21 AM
జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సజ్జల శ్రీధర్ రెడ్డిని ఎస్‌ఐటీ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం కంపెనీలకు కమీషన్లు కోరడం, ఒత్తిడి చేయడం, వందల కోట్ల లాభాలు పొందడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు.
కమీషన్ల నిర్ణయంలో కీలక పాత్ర.. హైదరాబాద్‌లో కంపెనీలతో భేటీలు
బలవంతంగా డిస్టిలరీల స్వాధీనం.. ఎస్పీవై ఆగ్రోలో ‘సొంత’ తయారీ
హైదరాబాద్‌లో అరెస్టు.. విజయవాడకు తరలింపు
మద్యం స్కామ్‌లో మరో అరెస్టు
సజ్జల శ్రీధర్ రెడ్డిని పట్టుకున్న ‘సిట్’.. హైదరాబాద్ నుంచి బెజవాడ తరలింపు
అమరావతి, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని ‘సిట్’ అధికారులు అరెస్టు చేశారు. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి(ఏ6)ని హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. మొత్తం మద్యం కుంభకోణం సూత్రధారి రాజ్ కసిరెడ్డి కాగా... కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డిది కీలక పాత్ర. మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి (ఏ1), ఆయన తోడల్లుడు చాణక్య (ఏ8)ను ‘సిట్’ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి, వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు వెనకేసుకున్నట్లు సిట్ అధికారులు సమాచారం సేకరించారు. కొన్నాళ్లుగా ఆయన కదలికలపై దృష్టి సారించారు. ఎట్టకేలకు... శుక్రవారం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి. విజయవాడకు తీసుకొచ్చారు. శనివారం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెడతారు.
ఇదీ శ్రీధర్ రెడ్డి పాత్ర...
మద్యం కుంభకోణంలో సజ్జల శ్రీధర్‌రెడ్డి పాత్ర గురించి చాణక్య రిమాండ్ రిపోర్టులోనే ‘సిట్’ క్లుప్తంగా వివరించింది. దీని ప్రకారం... 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో ఒక భేటీ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని మద్యం డిస్టిలరీస్ యజమానులను రప్పించారు. లిక్కర్ సరఫరా చేయాలంటే కనీసం 12శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశారు. కొందరు అంగీకరించారు. మరికొందరు నిరాకరించారు. కమీషన్లు ఇచ్చేందుకు సరేనన్న వారికి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి... ఆ సరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉంచారు. కమీషన్ మొత్తం 2024నాటికి 20శాతం వరకూ పెంచడంలోనూ శ్రీధర్‌రెడ్డిదే మాస్టర్ మైండ్ అని ‘సిట్’ గుర్తించింది. ప్రతి నెలా కనీసం రూ.50-60 కోట్లు వసూలు చేయడం ఎలా.. అనే అంశంపై హైదరాబాద్‌లోని స్టార్ హోటళ్లలో సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్య ప్రసాద్ పలుమార్లు చర్చలు జరిపారు. కమీషన్లు ఇచ్చే కంపెనీలకే ఆర్డర్లు వెళ్లాయి. అలాగే అప్పటికే ఏపీలో ఉన్న డిస్టిలరీస్‌ను బలవంతంగా లాక్కుని సొంతంగా మద్యం తయారు చేయడం మొదలుపెట్టారు. సొంత ప్రభుత్వం.. సర్కారీ మద్యం దుకాణాలు.. సొంత బ్రాండ్లు! ఇలా... తామే ఆర్డర్లు పొంది, తమ డిస్టిలరీలలో తయారైన నాసిరకం మద్యాన్నే సరఫరా చేశారు. శ్రీధర్‌రెడ్డి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీ్‌సలో మిథున్‌రెడ్డికి వచ్చేలా ప్లాన్ చేశారు. వైసీపీ హయాంలో మద్యం దుకాణాల్లో పుష్కలంగా అందుబాటులో ఉన్న సదరన్ బ్లూ, నైన్ హార్స్ వంటివి వీరి ఉత్పత్తులే కావడం గమనార్హం.
ఎవరీ సజ్జల శ్రీధర్ రెడ్డి!
నంద్యాల, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): మద్యం కేసులో అరెస్టయిన సజ్జల శ్రీధర్‌రెడ్డి నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్. ఆయనది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం తుమ్మలపల్లి! వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డికి సమీప బంధువు. హైదరాబాద్, కర్నూలులో ఆయన విద్యాభ్యాసం సాగింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో 1997లో ఇంజనీరింగ్ చదివే సమయంలో అప్పటి నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వైసీపీలో చేరకముందు.. 2019లో నంద్యాల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి... ఓటమి పాలయ్యారు. 2012 పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మద్యం స్కామ్‌పై విచారణ మొదలయ్యాక.. సజ్జల శ్రీధర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 26 , 2025 | 04:21 AM