Shambhunath Azad: బనకచర్లపై వాప్కోస్ కసరత్తు
ABN, Publish Date - Jul 05 , 2025 | 03:22 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ అధ్యయనం ప్రారంభించింది. అమరావతికి శుక్రవారం వాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ ఆజాద్ నేతృత్వంలోని అధికార బృందం వచ్చింది.
ఢిల్లీ నుంచి వచ్చిన శంభు ఆజాద్ బృందం
సలహాదారు వెంకటేశ్వరరావుతో చర్చలు
కేంద్ర జలసంఘం అడిగిన హైడ్రాలజీ లెక్కలపై అధ్యయనం
ఎల్లుండికల్లా ఈఏసీ వేసిన కొర్రీలపై జవాబులు సిద్ధం
అనంతరం సీడబ్ల్యూసీకి రాష్ట్రం నివేదన
తర్వాత ఢిల్లీకి జలవనరుల శాఖ బృందం
అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘వాప్కోస్’ అధ్యయనం ప్రారంభించింది. అమరావతికి శుక్రవారం వాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ ఆజాద్ నేతృత్వంలోని అధికార బృందం వచ్చింది. ఈయన సదరు సంస్థలో జలవనరుల అభివృద్ధి కేంద్రం ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో)గా ఉన్నారు. వెలగపూడి సచివాలయంలో జల వనరుల శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావుతో ఈ బృందం సమావేశమైంది. ఇప్పటికే.. వాప్కోస్ వద్ద ఉన్న నీటి లెక్కలు.. సముద్రంలో కలుస్తున్న వరద జలాల గణాంకాలను ప్రాథమికంగా వివరించింది. ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక (పీఎ్‌ఫఆర్) పరిశీలన సమయంలోనే కేంద్ర పర్యావరణ, అటవీ శాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) అభ్యంతరాలు చెప్పడం, కేంద్ర జల సంఘం పలు నీటి ప్రాజెక్టులు, వరదల గణాంకాలు అడిగిన సంగతి తెలిసిందే. వీటిని అధ్యయనం చేసి సమగ్ర సమాధానాలను సిద్ధం చేసే పనిలో శంభునాథ్ బృందం నిమగ్నమైంది. ఇది సోమవారంకల్లా పూర్తవుతుంది.
కొర్రీలు సహజమే..
సాగునీటి ప్రాజెక్టుల పీఎ్‌ఫఆర్‌లు, సమగ్ర ప్రాజెక్టు నివేదికల(డీపీఆర్)ను జల సంఘానికి, కేంద్ర పర్యావరణశాఖ ఆమోదానికి పంపినప్పుడు కొర్రీలు వేయడం, సందేహాలు లేవనెత్తడం సహజమేనని జల వనరుల శాఖ అంటోంది. ‘బనకచర్ల పథకానికి సముద్రంలో కలిసే వృధా జలాలను వాడుకోవాలని నిర్ణయించినందున అభ్యంతరాలుండవని భావించాం. కానీ ప్రాథమిక దశలోనే కేంద్రం నుంచి అభ్యంతరాలు రావడం కొంత ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ఏ కొత్త నీటి ప్రాజెక్టును కట్టాలనుకున్నా.. వెంటనే తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావడం సర్వసాధారణమైంది. పోలవరం ప్రాజెక్టుపైనా అభ్యంతరాలు చెబుతోంది. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 2005లో కేంద్ర జల సంఘానికి సమర్పించినప్పుడు తెలంగాణ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని ఫలితంగా 2009 దాకా ఆమోదం లభించలేదు. ఇప్పుడు బనకచర్లకు ఎదురవుతున్న అవాంతరాలనూ అధిగమించి.. త్వరలోనే వాస్తవ నివేదికలను.. కేంద్ర సంస్థలు అడిగిన సమాచారాన్ని సమర్పించి.. ఆమోదం పొందుతాం’ అని జలవనరుల శాఖ అధికారులు ధీమా వ్యక్తంచేశారు. సోమవారంనాటికి వాప్కోస్ సమాధానాలు సిద్ధం చేయగానే.. వాటిని జలసంఘానికి, ఈఏసీకి నివేదిస్తామని.. అనంతరం అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశమై వివరణ ఇస్తుందని తెలిపారు.
Updated Date - Jul 05 , 2025 | 03:24 AM