రూ.5 కోట్ల పాఠశాల స్థలం కబ్జా!
ABN, Publish Date - May 02 , 2025 | 12:42 AM
మచిలీపట్నంలో భూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రామాలయం, మసీదు స్థలాలను ఆక్రమించిన ఆక్రమణదారులు.. మరికొందరితో కలిసి సుమారు రూ.5 కోట్ల విలువైన 28 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని తాజాగా కబ్జా చేశారు. నాడు ఆ స్థలంలో ఎయిడెడ్ పాఠశాలను నడిపిన దంపతుల దత్త పుత్రుడు తమకు ఈ స్థలం విక్రయించాడని పత్రాలు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఒకే సారి ఆ స్థలంలోకి వెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడిన ఆక్రమార్కులు స్థానిక పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిమొదలెట్టారు. విషయం బయటకు రావడంతో ఆక్రమణను అడ్డుకుంటామని పూర్వ విద్యార్థులు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
- 1975లో పాఠశాల కోసం 28 సెంట్లు కేటాయించిన ప్రభుత్వం
- అదే ఏడాది ఎయిడెడ్ పాఠశాల ఏర్పాటు చేసిన ఆనంద్ దంపతులు
- సంతానం లేకపోవడంతో వారి మరణానంతరం 15 ఏళ్ల క్రితం మూతపడిన పాఠశాల
- చిలకలపూడి, సర్కారుతోట మధ్య విలువైన స్థలం కావడంతో అక్రమార్కుల కన్ను
- ఆనంద్‌కు ‘దత్తపుత్రుడు ఉన్నాడు.. స్థలం అమ్మాడు’ అంటూ తప్పుడు పత్రాల సృష్టి
- ఆక్రమణను అడ్డుకుంటామంటున్న పూర్వ విద్యార్థులు, స్థానికులు
మచిలీపట్నంలో భూ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రామాలయం, మసీదు స్థలాలను ఆక్రమించిన ఆక్రమణదారులు.. మరికొందరితో కలిసి సుమారు రూ.5 కోట్ల విలువైన 28 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని తాజాగా కబ్జా చేశారు. నాడు ఆ స్థలంలో ఎయిడెడ్ పాఠశాలను నడిపిన దంపతుల దత్త పుత్రుడు తమకు ఈ స్థలం విక్రయించాడని పత్రాలు సృష్టించి గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ర్టేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఒకే సారి ఆ స్థలంలోకి వెళ్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని భయపడిన ఆక్రమార్కులు స్థానిక పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిమొదలెట్టారు. విషయం బయటకు రావడంతో ఆక్రమణను అడ్డుకుంటామని పూర్వ విద్యార్థులు, స్థానికులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
మచిలీపట్నంలోని చిలకలపూడి, సర్కారుతోట తదితర ప్రాంతాలు గత 50 సంవత్సరాల కిందటి వరకు రిజర్వు ఫారెస్ట్ భూములుగా ఉండేవి. ఈ రెండు ప్రాంతాల్లో వేలాది మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండటంతో భవిష్యత్తులో వారికి ఇళ్లస్థలాల విషయంలో ఇబ్బందులు రాకుండా అప్పట్లో నివాసం ఉంటున్న వారి నుంచి చదరపు గజం భూమికి రూపాయి చొప్పున నగదు కట్టించుకుని ఇళ్లస్థలాలుగా అప్పటి ప్రభుత్వం క్రమబద్దీకరించింది. ఈ ప్రాంతంలో పాఠశాల లేక పోవడంతో 1975లో అప్పటి చిలకలపూడి మునసబు కొండపల్లి కృష్ణారావు, స్థానికులు దాసరి నాంచారయ్య, శింగవరపు వేదాంతం తదితరులు అప్పటి విద్యాశాఖామంత్రిగా పనిచేసిన మండలి వెంకటకృష్ణారావు వద్దకు వెళ్లి తమ ప్రాంతంలో పాఠశాలకు స్థలం కేటాయించి పాఠశాలకు అనుమతులు ఇవ్వాలని కోరారు. దీంతో అప్పటి మంత్రి వెంకటకృష్ణారావు చిలకలపూడి, సర్కారుతోటలో నివాస ప్రాంతాల మధ్య సర్వే నెంబరు 357/1లో 28 సెంట్ల స్థలాన్ని పాఠశాల నిమిత్తం కేటాయింపజేసి, అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ ఉత్తర్వుల్లో రెండు ప్రాంతాలకు సంబంధించి భవిష్యత సామాజిక అవసరాల కోసం ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా చూపారు.
1975లోనే ఎయిడెడ్ పాఠశాల ఏర్పాటు
పాఠశాలకు కేటాయించిన స్థలంలో ఆనంద్ ఆనే వ్యకి ఏహెచ్ ఎయిడెడ్ పాఠశాలను 1975లోనే ఏర్పాటు చేశారు. కాలక్రమంలో ఈ పాఠశాలలో ఏడవ తరగతి వరకు తరగతులు నిర్వహించారు. ఈ పాఠశాలకు ఆనంద్ భార్య హెచ్‌ఎంగా పనిచేసేవారు. వీరికి సంతానం లేరు. ఆనంద్ దంపతులు మరణానంతరం పాఠశాలను నడిపేవారు లేక 15 ఏళ్ల క్రితం మూత పడింది. అప్పటి నుంచి ఈ పాఠశాల స్థలం ఖాళీగానే ఉంటోంది.
దత్తపుత్రుడి దగ్గర కొన్నట్టు పత్రాలు సృష్టించి..
చిలకలపూడి ప్రధాన కూడలిలో సుమారు రూ.5 కోట్ల విలువ చేసే పాఠశాలకు చెందిన స్థలం ఖాళీగా ఉండటంతో అక్రమార్కుల కన్ను పడింది. ఈ స్థలాన్ని ఆక్రమించే కుట్రలో భాగంగా పాఠశాలను నడిపిన ఆనంద్ దంపతులకు దత్తపుత్రుడు ఉన్నాడనే అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. అతని నుంచి పాఠశాల స్థలాన్ని తాము కొనుగోలు చేసినట్టుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. ఈ పత్రాల ఆధారంగా ఇటీవల ఈ 28 సెంట్ల భూమిని తమ పేరున గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ర్టేషన్ కూడా చేయించుకున్నారు. చిలకలపూడి ప్రధాన కూడలిలో కోట్ల రూపాయల విలువైన స్థలం ఇప్పటికిప్పుడు ఆక్రమించేస్తే స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుందని గహ్రించి, స్థానిక పెద్దల వద్దకు వెళ్లి ఈ స్థలం తాము కొనుగోలు చేశామని, మీరు సహకరిస్తే అందులో భవనం నిర్మాణం చేసుకుంటామనే ప్రతిపాదన పెట్టారు. ఈ పాఠశాలలో చదివిన వారు ఈ ప్రతిపాదనతో అవాక్కయ్యారు. గతంలో ప్రభుత్వం పాఠశాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరు విక్రయించారు.. ఎంత మంది కొనుగోలు చేశారు... ఎలా రిజిస్ర్టేషన్ చేసుకున్నారనే అంశంపై కూపీ లాగారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో అక్రమార్కులు ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు కీలక ప్రజాప్రతినిధుల పీఏలు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఒక ద్వితీయ శ్రేణి నాయకుడికి పెద్ద మొత్తంలో నగదు ముట్టచెప్పి పాఠశాల స్థలం ఆక్రమణకు సహకరించాలని కోరినట్టు స్థానికులు చెప్పుకుంటున్నారు.
వైసీపీ హయాంలో రామాలయం, మసీదు స్థలాలు కబ్జా!
ఈ స్థలానికి సమీపంలోనే రాములవారి గుడికి 25 సెంట్ల భూమి ఉంది. ఇందులో సగం స్థలంలో గుడి ఉండగా, తూర్పు వైపున మిగిలిన స్థలాన్ని వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక వైసీపీకి చెందిన వారు ఆక్రమించేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. రాములవారి గుడి స్థలాన్ని వైసీపీ నాయకులు ఆక్రమించేసిన అంశాన్ని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో ఈ స్థలం ఎవరికీ విక్రయించకుండా నేటికీ అలానే ఉంది. సర్కారు తోటలోని మసీదు స్థలాన్ని ఆక్రమించేసిన వైసీపీ నాయకులు ప్లాట్‌లుగా విభజించి విక్రయాలు జరిపారు. ఈ స్థలం ఆక్రమణలపై గతంలో స్థానికులు రెవెన్యూ, మునిసిపల్ అధికారులకు పలు మార్లు ఫిర్యాదులు చేసినా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు ఈ ఆక్రమణల అంశాన్ని మరుగున పెట్టేశారు. రాములవారి గుడి, మసీదు స్థలాలను ఆక్రమించిన వారితోపాటు మరికొందరు కలసి ప్రస్తుతం పాఠశాల స్థలాన్ని దొంగ రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని స్థానికులు అంటున్నారు.
పాఠశాల స్థలంలో అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించాలి
చిలకలపూడి, సర్కారు తోటల్లో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ రెండూ అద్దె భవనాల్లోనే ప్రస్తుతం నడుస్తున్నాయి. వీటిని పాఠశాల స్థలంలో నిర్మించి, కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా కాకుండా చూడాలని స్థానిక పెద్దలు కోరుతున్నారు. తాము చదువుకున్న పాఠశాల స్థలం ప్రభుత్వానికి చెందినదేనని, తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎవరెవరో వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమిస్తే సహించేది లేదని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని చిలకలపూడి, సర్కారు తోట వాసులు కోరుతున్నారు.
Updated Date - May 02 , 2025 | 12:42 AM