ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: పంటలపై శాటిలైట్‌ సర్వే

ABN, Publish Date - Jul 23 , 2025 | 03:14 AM

రాష్ట్రంలో ఏ సర్వే నంబరు భూమిలో ఏయే పంటలు పండిస్తున్నారో శాటిలైట్‌ సర్వే చేపట్టి వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

  • సర్వే నంబరు ఆధారంగా పంటల గుర్తింపు

  • రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ

  • కృత్రిమ మేధతో ఉత్పత్తులకు విలువ జోడింపు

  • ఉద్యాన పంటల్లో సూక్ష్మసేద్యం ‘గేమ్‌ చేంజర్‌’

  • ఆయకట్టు చివరి వరకు సాగునీటి విడుదల

  • ఆగస్టు 20లోగా ‘బర్లీ’ కొనుగోలు పూర్తి

  • తోతాపురి రైతులకు 15లోగా చెల్లింపులు

  • విత్తనాలు, ఎరువుల విక్రయంపై ట్రాకింగ్‌

  • వ్యవసాయ, అనుబంధ శాఖల సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

  • త్వరలో నీటి సంఘాలతో వర్చువల్‌ భేటీలు

  • ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌కు టాటా సంస్థతో ఒప్పందానికి ముఖ్యమంత్రి ఆమోదం

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏ సర్వే నంబరు భూమిలో ఏయే పంటలు పండిస్తున్నారో శాటిలైట్‌ సర్వే చేపట్టి వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురంలో శాటిలైట్‌ సర్వేతో సమగ్ర సమాచారం వెల్లడైందని, అలాగే క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని శాటిలైట్‌ సర్వే సమాచారంతో సరిపోల్చాలని సూచించారు. ఒక ప్రాంతంలో ఒకే తరహా పంటలు వేసేలా రైతులకు దిశానిర్దేశం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రం నుంచి సూచనలు, సహకారం అన్నదాతలకు నిరంతర అందించాలని తెలిపారు. రీసర్వే అనంతరం రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి, వ్యవసాయ రికార్డులు కూడా నవీకరించాలని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాలుగు గంటలకుపైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రైతులకు మేలు చేసేలా స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నీటి నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేశారు. పంటల ప్రణాళిక, ఉత్పత్తులకు విలువ జోడింపు, రైతులకు సహకారం అందించేందుకు కృత్రిమ మేథ(ఏఐ చాట్‌బాట్‌) వినియోగంపై చర్చించారు. ఏపీ ద్వారా అవసరమైన సమాచారం రైతులకు అందేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

వారికి ఈ-కేవైసీ పూర్తి

‘అన్నదాత-సుఖీభవ’ పథకం కింద ఇప్పటి వరకు 47,41,792 మంది రైతులకు ఈ-కేవైసీ పూర్తయిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ‘ఈ-పంట’ ద్వారా అర్హులను గుర్తించాలని, రాష్ట్రంలో ప్రతి రైతుకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందాలని సీఎం సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని, త్వరలో సాగునీటి సంఘాలతో వర్చువల్‌గా సమావేశాలు నిర్వహించి, నేరుగా వారితో మాట్లాడతానని సీఎం చెప్పారు. మరోవైపు ఖరీఫ్‌ సీజన్‌లో దక్షిణ కోస్తాలో కొన్ని జిల్లాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్‌లలో ప్రధాన ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయని, సమృద్ధిగా కురుస్తున్న వర్షాలతో సాగు విస్తీర్ణం కూడా పెరిగిందని తెలిపారు. ఇప్పటికే 9.9 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగులోకి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్షాధార పంటలు పండించేలా పంటల కాలాన్ని సవరించాలని సూచించారు. దీనిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు రైతులతో సంప్రదింపులు జరపాలన్నారు.

పంటకాలం.. ముందుకు!

సీజన్‌ని ముందుకు తీసుకురాగలిగితే తుఫాన్లు, భారీ వర్షాల నుంచి రైతులు పంట నష్టపోకుండా జాగ్రత్త పడొచ్చని, ఇదే సమయంలో మరో పంటకు అవకాశం ఉంటుందని సీఎం అన్నారు. ‘‘కరువు అనే మాట ఉండకూడదు. వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుని, ప్రాజెక్టుల నుంచి తక్కువగా నీటిని వాడుకునేలా ప్రణాళికలు ఉండాలి. నీటి సంరక్షణ చర్యల ద్వారా భూగర్భ జలాలు పెరిగేలా చూడాలి. వెయ్యి టీఎంసీల మేర భూగర్భ జలాలు ఉండాలనేదే మన లక్ష్యం.’’ అని సీఎం నిర్దేశించారు. అలాగే, కాలువలో పూడిక తీయించి, అంతరాయం లేకుండా నీరు పారేలా చూడాలని, వ్యవసాయ, జల వనరుల శాఖ సమన్వయంతో పని చేస్తే, రైతులకు ఫలితాలు అందుతాయని చెప్పారు. నీటి పంపిణీపై సాగునీటి సంఘాలతో కలిసి కసరత్తు చేయాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కాలువల ద్వారా నీటిని విడుదల చేసి, చివరి ఆయకట్టు వరకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్‌ కుడికాలువ ద్వారా గుంటూరు ప్రాంతానికి సాగునీరు అందించాలని సూచించారు.

ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం: రాష్ట్రంలో 36.71 లక్షల టన్నుల ఎరువులు వాడుతుండగా, గతేడాదితో పోల్చితే 12శాతం తగ్గిందని, నిరుడు 1,733 టన్నుల పురుగు మందులు వాడారని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. అయితే, ఎరువులు, పురుగు మందులు అవసరానికిమించి వాడడం వల్ల భూసారం తగ్గుతోందని, వినియోగాన్ని నియంత్రించి, రైతుల్ని ప్రకృతి సేద్యం దిశగా ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్గానిక్‌, బయో ఫెర్టిలైజర్ల వినియోగంపై రైతులకు అవగాహన పెంచాలన్నారు. పంటల్ని చీడపీడల నుంచి రక్షించేందుకు ఇంటిగ్రేటెడ్‌ పెస్ట్‌ మేనేజ్మెంట్‌ విధానం తేవాలని, సాంకేతికతను వినియోగించి.. పురుగు మందుల వాడకం తగ్గించ వచ్చన్నారు. విత్తనాలు, ఎరువుల విక్రయంపై ట్రాకింగ్‌ జరగాలన్నారు.

ఆ మందుతో కేన్సర్‌

వరిలో కలుపు నివారణకు వినియోగించే మందుల్లోని కెమికల్స్‌ కారణంగా కేన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని అధికారులు సీఎంకు చెప్పారు. దీంతో ఎక్కడెక్కడ కేసులు పెరుగుతున్నాయో సమాచారం సేకరించి, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా ఆర్గానిక్‌ ఉత్పత్తుల సర్టిఫికేషన్‌కు టాటా సంస్థతో ఒప్పందం చేసుకునేందుకు సీఎం అనుమతించారు.

వారికి ఇతర పనులు వద్దు!

ప్రస్తుత సీజన్‌లో వ్యవసాయ అధికారులను ఇతర విధులకు వినియోగించవద్దని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్లను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బర్లీ పొగాకు, తోతాపురి మామిడి, కొనుగోళ్లు, రైతులకు చెల్లింపులపై ఆరా తీశారు. పొగాకు రైతులకు మార్క్‌ఫెడ్‌ ద్వారా రెండు విడతల్లో బకాయిలు చెల్లించాలని సూచించారు. ఆగస్టు 20లోగా బర్లీ పొగాకు కొనుగోలు పూర్తి చేయాలన్నారు. తోతాపురి మామిడి రైతులకు కూడా ఆగస్టు 15లోగా చెల్లించాలని ఆదేశించారు.

నాణ్యత పాటిస్తేనే సబ్సిడీ!

మెరుగైన ఆదాయం వచ్చే వాణిజ్య పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ లేదని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లు ఉండాలన్నారు. చికెన్‌ వ్యర్ధాలను దాణాగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించే ఆక్వా రైతులకే సబ్సిడీ విద్యుత్‌ అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. సముద్రంలో మత్స్య సంపద ఏ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తుందో మత్స్యకారులకు యాప్‌ ద్వారా తెలియజేయాలని, సముద్రంలో ఉత్పత్తయ్యే సీవీడ్‌ ఎక్కువ మంది సాగు చేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్నారు. బయో ఫ్యూయల్‌గా కూడా సీవీడ్‌ను వినియోగించేలా అధ్యయనం చేయాలన్నారు. ఉద్యాన రంగంతో సమానంగా పశుపోషణ, ఆక్వా ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. పశుసంవర్ధకంలో 15ు వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించి, వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఇక నుంచి ప్రత్యేకంగా సమీక్షిస్తానని సీఎం చెప్పారు. సమీక్షలో మంత్రి అచ్చెన్న, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సూక్ష్మ సేద్యం గేమ్‌ చేంజర్‌

ఉద్యాన పంటలకు సూక్ష్మ సేద్యమే ‘గేమ్‌ చేంజర్‌’ అవుతుందని సీఎం తెలిపారు. ప్రస్తుతం 16.17 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం కింద సాగువుతోందని, దీన్ని మరింత విస్తరించాలన్నారు. నీళ్లు లేని చోట మైక్రో ఇరిగేషన్‌, నీటి వనరుల లభ్యత ఉన్న చోట్ల ఫ్లడ్‌ ఇరిగేషన్‌ అమలుకు అధ్యయనం చేయాలని తెలిపారు. రాయలసీమలో సూక్ష్మసేద్యంతో పాటు కాలువ ద్వారా నీరిస్తే.. రైతులకు లాభమవుతుందన్నారు. వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను నగరాల్లో ఇంటి ముంగిటకు తీసుకెళ్లి,నేరుగా రైతులే విక్రయించేలా చూడాలని మార్కెటింగ్‌ శాఖకు సీఎం నిర్దేశించారు. వ్యవసాయఉత్పత్తుల ధరలు పెరగకుండా, తగ్గకుండా ఈ విధానం ఉపకరిస్తుందన్నారు. అన్ని నియోజకవర్గకేంద్రాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో మొబైల్‌ రైతుబజార్లు ప్రవేశపెట్టాలని, దీనిపై నెల రోజుల్లో కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు

వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు

For More AP News and Telugu News

Updated Date - Jul 23 , 2025 | 05:00 AM