ఇసుక సిండికేట్ వార్!
ABN, Publish Date - Apr 22 , 2025 | 12:48 AM
కృష్ణాజిల్లాలో ఇసుక టెండర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని నాలుగు ఇసుక క్వారీలకు టెండర్లు ఆహ్వానించగా, పొరుగు రాషా్ట్రల నుంచి ఆరు సంస్థలు బిడ్‌లు వేశాయి. స్థానిక సంస్థలే పాల్గొనాలనే నిబంధనను అధికారులు పక్కన పెట్టి వీటి బిడ్‌లను పాస్ చేయించారు. అర్హతలేని సంస్థలకు అవకాశం ఇవ్వడంపై స్థానిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంలో సిండికేట్ నడుస్తోందని ఆరోపణలు గుప్పించాయి. జిల్లా యంత్రాంగం వాటికి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శలు చేస్తున్నాయి. టెండర్లు ఖరారు కాగానే హైకోర్టును ఆశ్రయించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.
- కృష్ణాజిల్లాలో ఇసుక టెండర్ల దుమారం
- సిండికేట్ సంస్థలు, స్థానిక సంస్థల మధ్య రగడ
- పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో 4 క్వారీలకు టెండర్లు
- స్థానికంగా ఉన్న సంస్థలే పాల్గొనాలని నిబంధన
- బిడ్లు వేసిన పొరుగు రాష్ర్టాలకు చెందిన 6 సంస్థలు
- టెక్నికల్ బిడ్లలో వాటిని పాస్ చేయించటంతో తలెత్తిన వివాదం
- న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్న స్థానిక సంస్థలు
కృష్ణాజిల్లాలో ఇసుక టెండర్ల వ్యవహారం దుమారం రేపుతోంది. పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లోని నాలుగు ఇసుక క్వారీలకు టెండర్లు ఆహ్వానించగా, పొరుగు రాషా్ట్రల నుంచి ఆరు సంస్థలు బిడ్‌లు వేశాయి. స్థానిక సంస్థలే పాల్గొనాలనే నిబంధనను అధికారులు పక్కన పెట్టి వీటి బిడ్‌లను పాస్ చేయించారు. అర్హతలేని సంస్థలకు అవకాశం ఇవ్వడంపై స్థానిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ వ్యవహారంలో సిండికేట్ నడుస్తోందని ఆరోపణలు గుప్పించాయి. జిల్లా యంత్రాంగం వాటికి అనుకూలంగా వ్యవహరించిందని విమర్శలు చేస్తున్నాయి. టెండర్లు ఖరారు కాగానే హైకోర్టును ఆశ్రయించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణాజిల్లాలో పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో నాలుగు ఇసుక క్వారీలకు జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు ఇటీవల టెండర్లు ఆహ్వానించారు. పామర్రు నియోజకవర్గం పరిధిలో రొయ్యూరు, నార్త్ వల్లూరు, లంకపల్లి క్వారీలకు, పెనమలూరు నియోజకవర్గంలో చోడవరం ఇసుక క్వారీకి టెండర్లు పిలిచారు. సగటున ఒక్కో క్వారీకి డజనుకు పైగా కాంట్రాక్టు సంస్థలు బిడ్‌లను వేశాయి. ప్రతి క్వారీలో కూడా స్థానికేతర కాంట్రాక్టు సంస్థలు బిడ్‌లను వేశాయి. టెండరు నిబంధనల ప్రకారం ఇసుక టెండర్లలో పాల్గొనే సంస్థలు కృష్ణాజిల్లాకు చెందిన స్థానిక సంస్థలు అయి ఉండాలి. స్థానికత లేని సంస్థలు టెండర్లకు అర్హత సాధించవు. ఈ నిబంధనలను జిల్లా యంత్రాంగమే నిర్దేశించింది. కానీ అస్మదీయ సంస్థలకు మాత్రం ఈ నిబంధనల మినహాయింపు ఇవ్వటం గమనార్హం. దీంతో మొత్తం ఆరు రాష్ర్టేతర సంస్థలు కృష్ణాజిల్లా ఇసుక టెండర్లలో పాలు పంచుకున్నాయి. వీటిలో ఐదు వరకు హైదరాబాద్‌కు చెందిన సంస్థలు కాగా, ఒకటి హుబ్లీకి చెందిన సంస్థగా ఉంది.
టెక్నికల్ బిడ్‌లలో పాస్ చేయటంతో వివాదం
చోడవరం, రొయ్యూరు, నార్త్ వల్లూరు, లంకపల్లి క్వారీల్లో ఈ ఆరు సంస్థలు టెండర్లు వేశాయి. స్థానిక సంస్థలు కాకపోవటం వల్ల టెక్నికల్ బిడ్‌ల పరిశీలనలోనే వీటిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ జిల్లా యంత్రాంగం ఆ పని చేయలేదు. మైనింగ్ అధికారులకు ఆ మేరకు డైరెక్షన్ ఇవ్వలేదు. స్థానికంగా లేకపోయినప్పటికీ టెక్నికల్ బిడ్‌లలో అర్హత సాధించినట్టుగా చూపారు. ఇక్కడే వివాదం తలెత్తింది. కృష్ణాజిల్లాకు చెందిన సంస్థలే టెండర్లు వేయాల్సి ఉండగా.. పొరుగు రాష్ర్టాల వారు టెండర్లలో పాల్గొన్నా కూడా పాస్ చేయటం వివాదాస్పదంగా మారింది. అధికారుల తీరు తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది. ఆధార్ కార్డును తాత్కాలికంగా మార్చుకున్నంతమాత్రాన స్థానికుడు అయిపోరు. అతని రేషన్ కార్డు కూడా స్థానికంగా ఉండాలి. ఆ ప్రాంతంలో బియ్యం తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఆ ఆధార్ కార్డుకు సార్థకత ఉంటుంది. ఇసుక టెండర్లలో పొరుగు రాష్ర్టాలకు చెందిన ఆరు సంస్థలు కూడా జీఎస్టీని తాత్కాలికంగా స్థానిక అడ్రస్‌తో మార్పించుకున్న మాత్రాన ఆ సంస్థ ఎక్కడ రిజిస్ర్టేషన్ అయిందన్నది ప్రధానమైన విషయం. పొరుగు రాష్ర్టాల్లో సంస్థను రిజిస్ర్టేషన్ చేయించుకుని అక్కడ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థలని చెప్పుకోవటమే విడ్డూరం. మైనింగ్ అధికారులు మాత్రం ఆ సంస్థల రిజిస్ర్టేషన్ చూడకుండా కేవలం జీఎస్టీ అడ్రస్‌లనే ప్రాతిపదికగా తీసుకుని టెక్నికల్ బిడ్‌లలో పాస్ చేయటం తీవ్ర ఆరోపణలకు దారి తీస్తోంది.
ఆ ఆరు సంస్థలు సిండికేట్‌గా ఏర్పడ్డాయా?
పొరుగు రాష్ర్టాలకు చెందిన ఆరు సంస్థలు కూడా సిండికేట్ అయినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. కృష్ణాజిల్లాకు చెందిన బిడ్డర్లు వీటిపై జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. సిండికేట్ సంస్థలన్నీ నీకు ఈ క్వారీ, నాకు ఆ క్వారీ అని పంచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరు సంస్థలు కూడా క్వారీలను దక్కించుకునేందుకు వీలుగా అవగాహనతో టెండర్లు వేశాయన్న విమర్శలు వస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఆ సంస్థలకు అవకాశం కల్పించేందుకు మైనింగ్ అధికారులు, జిల్లా యంత్రాంగం కలిసి స్థానిక సంస్థలు కాకపోయినా కూడా టెక్నికల్ బిడ్‌లలో పాస్ చేసినట్టు తెలుస్తోంది.
కోర్టును ఆశ్రయించనున్న జిల్లా సంస్థలు
టెండర్ల నిబంధనలకు విరుద్ధంగా పొరుగు రాష్ర్టాలకు చెందిన సంస్థలను తిరస్కరించకుండా టెక్నికల్ బిడ్లలో వాటిని పాస్ చేయటంపై కృష్ణాజిల్లాకు చెందిన పలు సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాయి. టెండర్లు ఖరారు కాగానే ఆధారాలతో సహా కేసు వేసేందుకు సిద్ధం చేసుకోవటం గమనార్హం. ఇప్పటికే లాయర్‌ను పిలిపించుకుని మరీ కేసు గురించి చర్చించినట్టు సమాచారం.
Updated Date - Apr 22 , 2025 | 12:48 AM