MLA Vasantha Krishnaprasad: లిక్కర్ కంటే.. ఇసుక స్కామే పెద్దది
ABN, Publish Date - Aug 02 , 2025 | 04:00 AM
జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కంటే నాటి ఇసుక కుంభకోణమే చాలా పెద్దదని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
నెలకు రూ.260 కోట్లు లాగేశారు.. వసూళ్ల డెన్ బెజవాడే
‘బియాండ్ కాఫీ హౌస్’ సుధీర్‌కు డబ్బులు కట్టేవారు
కేసుల్లేకుండా విజయసాయిరెడ్డి చూసుకునేవారు
సిట్ పిలిస్తే వాస్తవాలన్నీ చెబుతా: వసంత
ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి
విజయవాడ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాం కంటే నాటి ఇసుక కుంభకోణమే చాలా పెద్దదని మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. వసూళ్లకు విజయవాడను డెన్‌గా ఎంచుకున్నారని.. బియాండ్ కాఫీ హౌస్‌కు చెందిన సుధీర్ ఈ వసూళ్లు చేపట్టేవాడని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో కృష్ణప్రసాద్ ఆ పార్టీలోనే ఉన్నారు. జరిగిన అక్రమాలన్నీ ప్రత్యక్షంగా చూశారు. ఇప్పుడు ఆయనే ఈ మాటలనడం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ అడ్డగోలు నిర్ణయాలను అడ్డుకోవడంతో ఆయన్ను వైసీపీ నాయకత్వం టార్గెట్ చేసింది. తనపైకి జోగి రమేశ్‌ను, వైసీపీ మూకలను ఉసిగొల్పడంతో ఆయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంతరం టీడీపీలో చేరి గత ఎన్నికల్లో మైలవరం నుంచి గెలిచారు. ‘రూ.1467 కోట్ల ఇసుక దోచేశారు’ శీర్షికన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇసుక కుంభకోణంపై తనకు తెలిసిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుచేసి విచారణకు పిలిస్తే మొత్తం చెబుతానని స్పష్టంచేశారు. ‘వైసీపీ ప్రభుత్వం ఏజెన్సీలను ముందుపెట్టి తెరవెనుక అనధికారికంగా రూ.వేల కోట్ల ఇసుక అక్రమ వ్యాపారం నడిపింది. తద్వారా నెలకు రూ.260 కోట్లు వైసీపీ పెద్దల జేబుల్లోకి వెళ్లేవి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లాభాల ఆశలు చూపించి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కూడిన సిండికేట్లకు అప్పగించారు. ఒక్కో సిండికేట్‌లో 10-15 మంది ఉండేవారు. నెలకు 20కోట్ల నుంచి 25కోట్ల వరకు కప్పంగా ఫిక్స్ చేశారు. ఆ డబ్బును ప్రతి పది రోజులకోసారి ముందుగానే కట్టాలి.
మొత్తం నగదుగానే ఇవ్వాలి. పోలీసులు అడ్డుకోకుండా, కేసులు పెట్టకుండా ఆ రోజుల్లో ఆ పార్టీలో నంబర్‌టూగా ఉన్న విజయసాయిరెడ్డి మాట్లాడేవారు’ అని చెప్పారు. పెద్దలకు అయాచితంగా లబ్ధి కలిగేదని.. సిండికేట్లకు మాత్రం నష్టాలు వచ్చేవని.. దాంతో నాలుగైదు నెలలకే వైదొలిగేవారని.. వైసీపీ పెద్దలు మళ్లీ కొత్త సిండికేట్లను ప్రోత్సహించేవారని తెలిపారు. ‘ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సిండికేట్లకు కట్టబెట్టారు. ఉభయ గోదావరి జిల్లాలకు రూ.24 కోట్ల చొప్పున టార్గెట్ పెట్టారు. కృష్ణా జిల్లాకు రూ.22కోట్లు.. గుంటూరుకు రూ.24 కోట్లు.. ఇలా ప్రతి జిల్లాకు సగటున రూ.22 కోట్ల నుంచి రూ.25కోట్ల వరకు నెలకు టార్గెట్లు పెట్టారు. అంతకంటే ఎక్కువ సిండికేట్లకు వస్తే ఆ మొత్తాన్ని వారిని ఉంచుకోమని చెప్పేవారు. ప్రభుత్వ పెద్దలకు మాత్రం ఫిక్స్‌చేసిన డబ్బు కట్టేయాల్సిందే’ అని వివరించారు. ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగేవన్నారు. రూ.కోట్ల ఆశలు, లాభాల లెక్కల సినిమా చూపించడంతో స్థానిక వైసీపీ నేతలు ఆశపడి అప్పులు చేసి మకీ సిండికేట్లలో చేరారని.. ప్రభుత్వ పెద్దలు నిర్దేశించిన ప్యాకేజీని ముందుగానే కట్టారని.. ఆ సిండికేట్లలో బాగుపడిన వారెవరూ లేరని వెల్లడించారు. రాష్ట్రంలో లోకల్‌గా పోలీసులు వేధిస్తే.. సిండికేట్లు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేవని.. అప్పుడు విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి పోలీసులతో మాట్లాడేవారని అన్నారు. ‘ఇసుక కుంభకోణంలో అవినీతి వివరాలు నా వద్ద ఉన్నా యి. సంబంధిత అధికారులు, సిట్ విచారణకు పిలిస్తే వాస్తవాలు వివరిస్తా’ అని కృష్ణప్రసాద్ తెలిపారు.
Updated Date - Aug 02 , 2025 | 04:03 AM